కేరళలో కుంభవృష్టి

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 09:47 IST

కేరళలో కుంభవృష్టి

పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు

వరద కారక ప్రమాదాల్లో ఆరుగురి మృతి

12 మంది గల్లంతు

అరేబియా సముద్రతీరంలో అల్పపీడన ప్రభావం

సహాయక చర్యల్లో త్రివిధ దళాలు

తిరువనంతపురం: కేరళలో వర్షాలు భీభత్సంగా కుమ్మేస్తున్నాయి. పథనంతిట్ట, కొట్టాయంలతో పాటు... ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశ్శూర్‌, పాలక్కాడ్‌ జిల్లాల్లోనూ శనివారం అతి భారీ స్థాయిలో కురిశాయి. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు మృతిచెందారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్రివిధ దళాల సిబ్బంది, జాతీయ విపత్తుల స్పందనా దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బలగాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.

కేరళ వద్ద ఆగ్నేయ అరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పథనంతిట్ట, కొట్టాయం సహా మొత్తం ఆరు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ఇక్కడ అతిభారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, మలప్పురం, కొజికోడ్‌, వయనాడ్‌ జిల్లాలకు ‘ఆరెంజ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. రాష్ట్రంలో పలుచోట్ల ఆదివారం ఉదయం వరకూ అతి భారీ స్థాయిలో, సోమవారం వరకూ భారీగా, మంగళవారం సాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.


విరిగిపడుతున్న కొండ చరియలు

ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. కూట్టిక్కల్‌లో సంభవించిన ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతిచెందారు. గల్లంతైన మరో వ్యక్తి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇడుక్కి జిల్లా, కాంజార్‌లో వరద నీటిలో కారు కొట్టుకుపోవడంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. వీరి వయసు సుమారు 30 ఏళ్లు ఉంటుందని స్థానికులు తెలిపారు. భారీ వానల కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో సుమారు 12 మంది గల్లంతైనట్టు అధికారులు తెలిపారు.

తిరువనంతపురంలో ఓ ఇంటి గోడ కూలి ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. కొల్లాం, కొట్టాయం తదితర చోట్ల వరద ఉద్ధృతికి రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో పలు పట్టణాలు, కొండ ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కొల్లాంలోని తెన్‌మల జలాశయ గేట్లను ఎత్తివేయగా, సమీప గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలో పాలక్కాడ్‌లోని చులియార్‌, త్రిశ్శూర్‌లోని పీచీ జలాశయాల వద్ద అత్యంత అప్రమత్తత అవసరమంటూ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.


పరిస్థితి సీరియస్‌గా ఉంది: సీఎం విజయన్‌

భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పరిస్థితి సీరియస్‌గా ఉందని, వచ్చే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రజలను హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, పర్యాటక స్థలాలను సందర్శించవద్దని అధికారులు హెచ్చరించారు. చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు. కొట్టాయంలోని పూంజార్‌లో కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన ఓ బస్సు వరదలో చిక్కుకుపోగా, స్థానికులు అందులోని ప్రయాణికులను రక్షించారు.


 




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన