సింఘు సరిహద్దుల్లో ఘాతుకం

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 09:44 IST

సింఘు సరిహద్దుల్లో ఘాతుకం

దళిత యువకుడి దారుణ హత్య

చేతిని నరికి బారికేడ్‌కు వేలాడదీసిన వైనం

నలుగురు నిందితుల అరెస్టు

సింఘు సరిహద్దు/చండీగఢ్‌: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న దిల్లీ-హరియాణాలోని సింఘు సరిహద్దు ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఆందోళన జరుగుతున్న ప్రధాన వేదిక సమీపంలో గురువారం అర్ధరాత్రి తర్వాత ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా కొందరు హత్య చేశారు. హంతకులు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఎడమ చేతిని నరికివేసి మృతదేహాన్ని పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్‌కు వేలాడదీశారు. మృతుడు పంజాబ్‌లోని తరణ్‌ తారణ్‌ చెందిన దళిత వ్యవసాయ కార్మికుడు లఖ్‌బీర్‌ సింగ్‌(35)గా గుర్తించారు. సిక్కుల్లోని ‘నిహంగ్‌’ వర్గమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. తమ పవిత్ర గ్రంథం గురుగ్రంథ్‌ సాహిబ్‌ను లఖ్‌బీర్‌ అపవిత్రం చేశాడని, అందుకే హత్య చేశామని వీరు చెబుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ కేసులో సరబ్‌జీత్‌ సింగ్‌, నారాయణ్‌ సింగ్‌, గోవింద్‌ సింగ్‌, భగవంత్‌సింగ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. సరబ్‌జీత్‌ను శనివారం సోనీపత్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. అతడిని ఏడు రోజులు పోలీసు కస్టడీకి న్యాయమూర్తి అప్పగించారు.


చిత్రవధ చేసి..

లఖ్‌బీర్‌ హత్య ప్రకంపనలు సృష్టించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఇందులో ఓ వీడియోలో.. తీవ్ర గాయాలతో ఉన్న లఖ్‌బీర్‌ చుట్టూ నీలం రంగు దుస్తులు, తలపాగా ధరించిన వ్యక్తులు ఉన్నారు. వీరి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. నరికివేసిన చేయి.. బాధితుడి తల దగ్గర ఉంది. సిక్కుల మత గ్రంధాన్ని అపవిత్రం చేశాడంటూ ఆ వ్యక్తులు పంజాబీలో ఆరోపించారు. గాయాలతో వేడుకుంటున్న లఖ్‌బీర్‌ను ఎక్కడి నుంచి వచ్చావు..? ఎవరు పంపారు..? అంటూ అడగడం కూడా వీడియోలో రికార్డు అయింది. మరోవైపు లఖ్‌బీర్‌ అంత్యక్రియలను అత్యంత భద్రత మధ్య శనివారం పంజాబ్‌లోని అతని స్వగ్రామం చీమా కలాన్‌లో నిర్వహించారు.


మృతుడి శరీరంపై 37 గాయాలు

చేతిని నరికివేసిన హంతకులు మృతదేహాన్ని తాళ్లతో బారికేడ్‌కు వేలాడదీశారు. మృత దేహంపై పదునైన ఆయుధాలతో చేసిన గాయాలు కనిపించాయి. పోస్ట్‌మార్టం నివేదికలో మొత్తం 37 గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. తరణ్‌ తారణ్‌కు చెందిన లఖ్‌బీర్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం భార్యకు దూరంగా సోదరి దగ్గర ఉంటున్నారు. ఇటీవల లఖ్‌బీర్‌ రైతులు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దుకు చేరుకున్నారు.


ఎవరీ నిహంగులు

సిక్కుల్లో నిహంగ్‌ వర్గం ధైర్య సాహసాలకు మారుపేరు. వీరిని యోధులుగా పేర్కొంటారు. నీలం రంగు దుస్తులు, తలపాగా ధరిస్తారు. ఆయుధాలతో తిరుగుతుంటారు. నిరుడు కరోనా సమయంలో కర్ఫ్యూ పాస్‌ అడిగిన ఓ పోలీస్‌ చేతిని నరకడంతో వీరు వార్తల్లోకి ఎక్కారు. లఖ్‌బీర్‌ హత్య కేసులో శుక్రవారం అరెస్టైన సరబ్‌జీత్‌ న్యాయస్థానానికి హాజరయ్యే సమయంలో మాట్లాడుతూ.. చంపినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని తెలిపాడు. మరో నిందితుడు నారాయణ్‌సింగ్‌ను శనివారం పంజాబ్‌లోని అమర్‌కోట్‌ గ్రామంలో అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆయన భార్య పరమ్‌జీత్‌ కౌర్‌.. తన భర్త చేసిన పనికి తాను గర్విస్తున్నానని తెలిపారు.


మాకు సంబంధం లేదు: రైతు నాయకులు

రైతులు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దు వద్ద జరిగిన దారుణ హత్య తీవ్ర దుమారం రేపింది. రైతుల నిరసనలు నేరస్థుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, తాలిబన్లలా వారి కార్యకలాపాలున్నాయని భాజపా ధ్వజమెత్తింది. లఖీంపుర్‌ ఖేరి ఘటనపై స్పందించిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడేమయ్యారని ప్రశ్నించింది. మరోవైపు హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్‌ మోర్చా తెలిపింది. తమ ఉద్యమంలో హింసకు తావు లేదని స్పష్టం చేసింది. హత్యను బీఎస్పీ అధినేత్రి మాయావతి ఖండించారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని 15 దళితసంఘాలు డిమాండ్‌ చేశాయి.


 
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన