అధిక పనివేళలపై ఆక్రందనలు

ప్రధానాంశాలు

Published : 17/10/2021 05:18 IST

అధిక పనివేళలపై ఆక్రందనలు

చైనాలో ‘బాయ్‌కాట్‌ 996’ ఉద్యమం

బీజింగ్‌: ఓవైపు అమెరికా సహా పలు దేశాల్లో ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ సంక్షోభం కొనసాగుతుంటే.. చైనాలో మరో కొత్త ఉద్యమం మొదలైంది. అక్కడి టెక్‌ ఉద్యోగులంతా.. ‘996’ పద్ధతికి వ్యతిరేకంగా ఆన్‌లైన్‌ ఉద్యమం ప్రారంభించారు. ఓవర్‌ టైం పనివేళలు, వీక్‌ ఆఫ్స్‌ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారు పనిచేస్తున్న కంపెనీలో పనివేళల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఇలా ఒక డేటాబేస్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులు వారి వివరాలు నమోదు చేయగా.. అందులో అలీబాబా గ్రూప్‌, బైదూ, టెన్సెంట్‌ హోల్డింగ్స్‌, బైట్‌ డాన్స్‌ వంటి ప్రముఖ సంస్థల ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు.

ఏమిటీ 996?

పనివేళలు.. రోజులను సూచించే సంఖ్యే 996. ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు.. వారానికి 6 రోజులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీన్నే 996గా పేర్కొంటున్నారు. చైనాలో ఉద్యోగులకు పనివేళలు, పనిభారం ఎక్కువగా ఉంటుందన్న విషయం బహిర్గతమే. అక్కడి టెక్‌ కంపెనీల నిబంధనల్లో మాత్రం ఉద్యోగుల విధులు వారంలో ఐదు రోజులు, రోజుకు 8 గంటలే ఉంటాయని పేర్కొంటున్నా.. చాలావరకు ఉద్యోగులు వారానికి ఆరు రోజులు.. రోజుకు 10 నుంచి 12 గంటలు పనిచేస్తున్నట్లు డేటాబేస్‌లో నమోదవుతోంది.

955ని తీసుకురావడమే ధ్యేయం

చైనాలో అధిక పనిగంటల విషయంపై గత కొన్నాళ్లుగా ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. ఈ క్రమంలోనే బాయ్‌కాట్‌ 996 ఉద్యమం మొదలుపెట్టారు. ఇందులో పాల్గొంటున్న వారంతా 996 పద్ధతిని నిషేధించి.. 955 (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనివేళలు.. వారానికి ఐదు రోజులే పనిదినాలు)ని తీసుకురావాలని కోరుతున్నారు. ఈ ఉద్యమం ద్వారానైనా.. కంపెనీలు తమ ఆవేదనపై దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నారు. అలాగే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఏయే కంపెనీలో పనివేళలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఈ డేటాబేస్‌ ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన