అమెరికా మాజీ మంత్రి కొలిన్‌ పావెల్‌ కన్నుమూత

ప్రధానాంశాలు

Updated : 19/10/2021 10:36 IST

అమెరికా మాజీ మంత్రి కొలిన్‌ పావెల్‌ కన్నుమూత

వాషింగ్టన్‌: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మాజీ ఛైర్మన్‌ కొలిన్‌ పావెల్‌(84) సోమవారం కొవిడ్‌తో కన్నుమూశారు. అద్భుతమైన భర్తను, తండ్రిని, ఓ గొప్ప అమెరికా పౌరుడిని తాము కోల్పోయామని ఆయన కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. పావెల్‌.. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకున్నారని వెల్లడించారు. 1989లో జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌గా పావెల్‌ నియమితులయ్యారు. ఆ పదవిని చేపట్టిన తొలి నల్లజాతీయుడు పావెలే. ఆయన ఆధ్వర్యంలోనే పనామాపై అమెరికా దాడి చేసింది.

1991లో కువైట్‌ను ఆక్రమించిన ఇరాక్‌ సైన్యాన్ని పారదోలిన సమయంలోనూ పావెల్‌ కీలక పాత్ర పోషించారు. జార్జి బుష్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2001 నుంచి 2005 వరకు పావెల్‌ అమెరికా విదేశాంగ మంత్రిగా పని చేశారు. మానవాళిని సమూలంగా నాశనం చేసే ఆయుధాలు సద్దాం హుస్సేన్‌ దగ్గర ఉన్నాయంటూ ఇరాక్‌పై 2003లో అమెరికా దాడి చేయడం వివాదాస్పదమైంది. తదనంతర పరిస్థితుల్లో పావెల్‌ ప్రతిష్ఠ మసకబారింది. పావెల్‌ మృతికి అమెరికా మాజీ అధ్యక్షుడు బుష్‌ సంతాపం తెలిపారు. ఆయన గొప్ప ప్రజాసేవకుడు అని కీర్తించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన