కశ్మీర్‌ను వీడుతున్న వలస కూలీలు

ప్రధానాంశాలు

Published : 19/10/2021 05:14 IST

కశ్మీర్‌ను వీడుతున్న వలస కూలీలు

ఉగ్ర దాడులతో స్థానికేతరుల్లో గుబులు

శ్రీనగర్‌: కశ్మీర్‌ లోయలో సాధారణ ప్రజలపై ఉగ్రవాదుల వరుస దాడులు ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలు, చిరు వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. స్వస్థలాలకు పయనమవుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కూలీలు శ్రీనగర్‌ను విడిచి వెళ్లిపోయారు. ‘ఇక్కడ పరిస్థితులు బాగా లేవు. బిహార్‌ కూలీలను చంపేశారు. భయంగా ఉంది. మా రాజస్థాన్‌కే తిరిగి వెళ్లిపోతున్నాం’ అని శాంతిదేవి అనే వలస కూలీ ‘ఈటీవీ భారత్‌’కు చెప్పారు. తమ భద్రత గురించి బంధుమిత్రులు కలవరపడున్నారనీ, అందుకే స్వస్థలాలకు వెళ్లిపోతున్నామని మరో కూలీ తెలిపారు. కాలిబాటపై కూర్చున్న అనేకమంది వలస కూలీలు సోమవారం జమ్ము రైల్వేస్టేషన్‌ వెలుపల కనిపించారు. మళ్లీ కశ్మీర్‌ లోయకు వెళ్లేదే లేదని స్పష్టంచేశారు. తినడానికి ఏమీ లేక కూలీల పిల్లలు అలమటిస్తున్నారు. కొంతమంది కూలీలు వారు పనిచేసిన కాలానికి వేతనాలూ అందుకోలేకపోయారు.

రెండు వారాల్లో ఐదుగురు స్థానికేతర కూలీలను ఉగ్రవాదులు హత్య చేశారు. మిగిలిన కూలీలు లోయ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఉగ్ర దాడుల నేపథ్యంలో వలస కూలీలను పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కశ్మీర్‌ ప్రజలు మంచివాళ్లు కావడం, తమకు ఎక్కువ వేతనాలు లభిస్తుండడం వల్ల లోయను విడిచివెళ్లేది లేదని మరికొందరు కూలీలు స్పష్టం చేస్తున్నారు. స్వగ్రామాలకు వెళ్తే రెండు పూటలా తిండి కూడా దొరకదని, చావు భయం కంటే ఆకలి భయమే ఎక్కువగా ఉందని ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వడ్రంగి ఒకరు చెప్పారు.


మరిన్ని హత్యలు తప్పవు: ఐఎస్‌కేపీ

జమ్మూ: జమ్మూ-కశ్మీర్‌లో పౌరులపై ముష్కరుల దాడులు పెరిగిపోతున్న సమయంలో ఉగ్ర సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరసన్‌ ప్రావిన్స్‌(ఐఎస్‌కేపీ) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌ లోయలో ఆ తరహా దాడులు మరిన్ని జరుగుతాయని హెచ్చరించింది. ఐఎస్‌కేపీ భారత మ్యాగజీన్‌ ‘వాయిస్‌ ఆఫ్‌ హింద్‌’లో ఈ వ్యాఖ్యలు చేసింది. కశ్మీర్‌లో ఇటీవల ఓ వీధి వ్యాపారిని చంపిన ఘటనకు సంబంధించిన ఫొటోను ప్రచురించి, ‘మేం వస్తున్నాం’ అన్న వ్యాఖ్యను జోడించింది. త్రిశూలం ధరించిన హిందూ దేవతల ఫొటోలను కూడా ప్రచురించి, వాటిని లక్ష్యంగా చేసుకోబోతున్నట్లు సంకేతాలిచ్చింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన