దీపావళి దాకా భౌతిక విచారణలొద్దు

ప్రధానాంశాలు

Published : 21/10/2021 05:22 IST

దీపావళి దాకా భౌతిక విచారణలొద్దు

సీనియర్‌ న్యాయవాదుల వినతి

న్యాయమూర్తుల ప్యానెల్‌తో చర్చిస్తానన్న సీజేఐ ఎన్‌.వి.రమణ

దిల్లీ: సుప్రీంకోర్టులో బుధ, గురువారాల్లో చేపట్టే కేసుల విచారణను భౌతిక విధానంలో మాత్రమే నిర్వహించాలన్న నిర్ణయాన్ని దీపావళి సెలవుల వరకూ వాయిదా వేయాలని సీనియర్‌ న్యాయవాదుల బృందం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి విన్నవించింది. ఈ విషయమై న్యాయమూర్తుల ప్యానెల్‌తో చర్చిస్తానని ప్రధాన న్యాయమూర్తి వారికి తెలిపారు. ఈ నెల 20 నుంచి బుధ, గురువారాల్లో భౌతిక విచారణలను మాత్రమే చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీనిపై కపిల్‌ సిబల్‌, ముకుల్‌ రోహత్గీ, ఎ.ఎం.సింఘ్వీ, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తదితర న్యాయవాదులు జస్టిస్‌ రమణతోపాటు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లి సభ్యులుగా ఉన్న ధర్మాసనానికి తమ అభ్యంతరాన్ని తెలిపారు. బుధ, గురువారాల్లో భౌతిక విచారణలు తప్పనిసరి చేస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి అన్నిరోజుల్లోనూ హైబ్రిడ్‌ పద్ధతిని కొనసాగించాలని కోరారు. కొన్ని కేసుల్లో ఎక్కువ సంఖ్యలో న్యాయవాదులు హాజరు కావాల్సి ఉంటుందని, అలాంటప్పుడు కొవిడ్‌ నిబంధనలు పాటించడం కష్టసాధ్యమని కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. భౌతిక విచారణల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను న్యాయమూర్తుల ప్యానెల్‌ను కలిసి వివరిస్తానని, అందుకు అనుమతించాలని అభ్యర్థించారు. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పందిస్తూ...‘‘భౌతిక విచారణల విషయమై నా సహచర న్యాయమూర్తులను సంప్రదించాను. వారిలో కొందరికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆ దిశగా నిర్ణయం తీసుకున్నాం. వారంలో రెండు రోజులు భౌతిక విచారణలకు హాజరవడంలో సమస్య ఏంటి’’ అని ప్రశ్నించారు. ‘‘చాలా హైకోర్టులు హైబ్రిడ్‌ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇబ్బందులను న్యాయమూర్తుల ప్యానెల్‌కు తెలియజేయడానికి అనుమతినివ్వండి. ఆలోగా దీపావళి వరకూ ఆ నిర్ణయాన్ని వాయిదా వేయండి’’ అని సిబల్‌ కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు ఐదుగురు న్యాయమూర్తుల ప్యానెల్‌ ఉందని, దీనిపై ఇతర న్యాయమూర్తులనూ సంప్రదిస్తానని జస్టిస్‌ రమణ చెప్పారు. హైబ్రిడ్‌ పద్ధతిని కొనసాగించాలన్న వాదనపై సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ అభ్యంతరం తెలిపారు. ఎంతో మంది న్యాయవాదులు ఆకలితో అలమటిస్తున్నారని, భౌతిక విచారణలను పునఃప్రారంభించాలని కోరారు. విచారణ ప్రక్రియను కవర్‌ చేయడానికి మీడియా ప్రతినిధులను కోర్టురూంలోకి అనుమతించాలని సుప్రీంకోర్టు నిర్ణయించిందిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన