రూ.8 లక్షల పరిమితికి ప్రాతిపదిక ఏమిటి?

ప్రధానాంశాలు

Published : 22/10/2021 04:51 IST

రూ.8 లక్షల పరిమితికి ప్రాతిపదిక ఏమిటి?

 నిర్ణయించే ముందు అధ్యయనం చేశారా?

దీనిని పునఃపరిశీలిస్తారా?

ఈడబ్ల్యూఎస్‌ వర్తింపుపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు

దిల్లీ: వార్షిక ఆదాయం రూ.8 లక్షలు మించని వారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)గా గుర్తించాలన్న నిబంధనకు ప్రాతిపదిక ఏమిటని సుప్రీంకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ పరిమితిపై సమీక్ష చేసే ఆలోచన ఏమైనా ఉందా అని అడిగింది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో తాము జోక్యం చేసుకోవడం లేదని, అయితే ఈ విషయంలో రాజ్యాంగాన్ని అమలు చేశారా? లేదా? అన్నది పరిశీలించడమే తమ ఉద్దేశమని వివరణ ఇచ్చింది. నీట్‌ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయమై దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రంనాథ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణకు చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రానికి పలు ప్రశ్నలు సంధిస్తూ వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంది.

*ఆదాయ పరిమితి ఎంత ఉండాలన్న విషయమై ప్రభుత్వానికి ఏమీ చెప్పదలచుకోలేదు. అయితే ఏ ప్రాతిపదికన అంత కచ్చితంగా రూ.8 లక్షల పరిమితి ఉండాలని నిర్ణయించారన్న విషయాన్నే తెలుసుకోదలచుకున్నాం.

* ఓబీసీల్లో రూ.8 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారిని సంపన్న శ్రేణిగా గుర్తించి వారికి రిజర్వేషన్ల సౌకర్యం కల్పించడం లేదు. ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు మాత్రం రూ.8 లక్షల ఆదాయం ఉన్నా రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇదెలా సమర్థనీయం? ఓబీసీలకు, ఈడబ్ల్యూఎస్‌లకు ఒకే తరహా ఆర్థిక పరిమితులను ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారు?

* ఏదో గాల్లో నుంచి తీసినట్టుగా రూ.8 లక్షల పరిమితిని నిర్ణయించలేరు. ఇందుకు తగిన అధ్యయనం చేశారా? అధ్యయనం జరగలేదంటే ఆ పరిమితిని కోర్టు కొట్టివేయవచ్చు కదా?

* గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల కొనుగోలు శక్తిని పరిగణనలోకి తీసుకున్నారా? ఆదాయం లెక్కింపులో ఇళ్ల విలువను పరిగణనలోకి తీసుకోకూడదని ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు? మెట్రోపాలిటన్‌ నగరాలు, ఇతర నగరాల్లో నివాస భవనాల ఇళ్ల విలువలో తేడాలు చూపకూడదని ఎందుకు భావిస్తున్నారు?

* 103వ రాజ్యాంగ సవరణలోని వివరణ ప్రకారం ఈడబ్ల్యూఎస్‌లపై రాష్ట్ర ప్రభుత్వాలే నోటిఫికేషన్లు ఇవ్వాలి. అలాంటప్పుడు మొత్తం దేశానికి వర్తించేలా కేంద్ర ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్‌ ఇస్తుంది?

* రూ.8 లక్షల వార్షికాదాయం అన్న పరిమితిని సమీక్షిస్తారా? లేదా? చెప్పండి. మేం విధులు నిర్వర్తించాలని మీరు అనుకుంటే అందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకే ప్రశ్నలు పంపిస్తున్నాం. వాటికి సమాధానాలు ఇవ్వండి. ఈ పరిమితిని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వగలం. మీరు ప్రమాణ పత్రాలు సమర్పిస్తూ ఉండండి...అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


ఆందోళన చేసే హక్కున్నా రోడ్లు దిగ్బంధించకూడదు

దిల్లీ: రైతులకు ఆందోళన చేసే హక్కు ఉన్నా, రహదారులను నిరవధికంగా దిగ్బంధించకూడదని గురువారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వ్యవసాయ చట్టాలపై కోర్టులో వ్యాజ్యాలు ఉన్నప్పటికీ ఆందోళన కొనసాగించడాన్ని తాము కాదనడం లేదని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ‘రోడ్లను ఈ విధంగా అడ్డుకోకూడదు. ఇతరులకు కూడా రహదారులపై వెళ్లే హక్కు ఉంది’ అని తెలిపింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రైతు సంఘాలను ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబరు ఏడో తేదీకి వాయిదా వేసింది. నొయిడాకు చెందిన మోనికా అగర్వాల్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ధర్మాసనం పై వ్యాఖ్య చేసింది. రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టింది దిల్లీ పోలీసులే తప్ప రైతులు కాదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ తెలిపింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన