కాంగ్రెస్‌, వామపక్షాలకు ఓటు వేయటమంటే నోటా మీట నొక్కినట్లే!

ప్రధానాంశాలు

Published : 24/10/2021 05:29 IST

కాంగ్రెస్‌, వామపక్షాలకు ఓటు వేయటమంటే నోటా మీట నొక్కినట్లే!

టీఎంసీ నేత అభిషేక్‌ బెనర్జీ విసుర్లు

ఖర్దా: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దేశ మంతటికీ ఆమోదయోగ్యమైన నేతగా ఆవిర్భవిస్తున్నారని, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు వివాదరహిత నాయకురాలు ఆమేనని టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ అన్నారు. కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలకు వేసే ఓట్లు నోటా మీట నొక్కిన దానితో సమానమని అభివర్ణించారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే భాజపాను బలోపేతం చేసినట్లేనని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో ఈ నెల 30న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఆ నియోజకవర్గాల్లో శనివారం నిర్వహించిన వరుస బహిరంగ సభల్లో ప్రసంగించిన మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని అడ్డుకునేందుకే కాంగ్రెస్‌, వామపక్షాలు జట్టు కట్టాయని ఆరోపించారు. ‘గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా భాజపా చేతిలో కాంగ్రెస్‌ ఓడిపోతూనే ఉంది. అయితే, భాజపా విసురుతున్న మతపరమైన, అప్రజాస్వామికమైన సవాళ్లన్నిటినీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విజయవంతంగా తిప్పికొడుతోంద’ని తెలిపారు. దేశమంతటికీ తమ పార్టీ విస్తరిస్తోందని, అగ్రస్థాయి జాతీయ పార్టీల్లో టీఎంసీ కూడా ఒకటని అన్నారు. కొద్ది నెలల్లో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని భరోసా వ్యక్తం చేశారు. 2023లో త్రిపురలోని భాజపా సర్కారును గద్దె దించుతామని చెప్పారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని భాజపా నేతలు వివిధ రకాలుగా వేధింపులకు గురిచేస్తారని ఆరోపించారు. ‘దర్యాప్తు సంస్థలు 9 గంటల పాటు నన్ను విచారించాయి. ఇంకా గంటల తరబడి నన్ను పశ్నించినా భాజపా నేతలకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటా. నా గొంతు కోసినా జైహింద్‌, జైబంగ్లా అని నినదిస్తూనే ఉంటా. సత్యం నా వైపు ఉంది’ అని అభిషేక్‌ బెనర్జీ పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన