అగ్రరాజ్యమా.. హద్దుల్లో ఉండు..!

ప్రధానాంశాలు

Updated : 24/10/2021 05:49 IST

అగ్రరాజ్యమా.. హద్దుల్లో ఉండు..!

తైవాన్‌లో జోక్యం చేసుకోవద్దు

చైనాకు మద్దతుగా రంగంలోకి ఉత్తరకొరియా

అమెరికాపై తీవ్రస్థాయిలో ధ్వజం

సియోల్‌: ఉత్తరకొరియా మరోసారి చైనాతో తన స్నేహబంధాన్ని చాటుకుంది. తైవాన్‌ వ్యవహారంలో డ్రాగన్‌కు మద్దతుగా నిలిచింది. అగ్రరాజ్యం అమెరికాపై తీవ్రస్థాయిలో మండిపడింది. అమెరికా తన నిర్లక్ష్యపూరిత వైఖరితో దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలకు తెరలేపుతోందని ఆరోపించింది. తైవాన్‌కు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు, సైనిక శిక్షణను అందించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. ఈమేరకు శనివారం ఉత్తర కొరియా విదేశాంగశాఖ ఉపమంత్రి పాక్‌ మయాంగ్‌ హో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘చైనాపై ఒత్తిడి తెచ్చేందుకే దక్షిణ కొరియాలోని సైనిక స్థావరాలు, సైనికులు ఉన్నారన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు అమెరికా.. దాని మిత్ర దేశాలు తైవాన్‌ సమీపంలో భారీగా మోహరించాయి. దీంతో ఉత్తర కొరియాపై కూడా ఏ సమయంలోనైనా సైనిక దాడి జరిగే అవకాశం ఉంది’’ అని హో తెలిపారు. కొరియా ద్వీపకల్పంలో, తైవాన్‌లో ఉత్తరకొరియా, చైనా సమస్యలు సృష్టిస్తాయన్న ఒక తప్పుడు వాదనతో అమెరికా ఈ ప్రాంతంలో తన సైనిక బలాన్ని పెంచుకుంటూ పోతుందని అన్నారు. సోషలిస్టు దేశాలైన చైనా ఉత్తర కొరియాలను అణిచివేసి అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చూస్తోందని తెలిపారు. చైనా నుంచి తైవాన్‌కు ఎప్పుడైనా ముప్పు ఎదురైతే, అమెరికా తక్షణమే సాయం చేస్తుందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ ఇటీవలే వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన