షారుక్‌ఖాన్‌ కుమారుడైనందుకే... ఆర్యన్‌ బలిపశువయ్యాడు

ప్రధానాంశాలు

Published : 24/10/2021 05:29 IST

షారుక్‌ఖాన్‌ కుమారుడైనందుకే... ఆర్యన్‌ బలిపశువయ్యాడు

దిగ్విజయ్‌ వ్యాఖ్యలు

భాజపా ఆగ్రహం

భోపాల్‌: షారుక్‌ఖాన్‌ కుమారుడైనందుకే ఆర్యన్‌ఖాన్‌ బలిపశువు అయ్యాడని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో టన్నుల కొద్దీ హెరాయిన్‌ దొరికినపుడు చర్యలు తీసుకోని అధికారులు.. ఆర్యన్‌తో పాటు ఉన్న వ్యక్తి దగ్గర 5 గ్రాములు ఉన్నందుకు మాత్రం అరెస్టులకు పాల్పడ్డారంటూ శనివారం ట్వీట్‌ చేశారు. ‘‘షారుక్‌ కొడుకైనందుకు ఆర్యన్‌ బలిపశువు కావడం విచారకరం. అతను చేసిన నేరమేంటి? అతనితో కలిసి ఉన్న వ్యక్తి దగ్గర 5 గ్రాముల డ్రగ్స్‌ ఉండటమేనా? మరి ముంద్రా పోర్టులో దొరికిన టన్నుల కొద్దీ హెరాయిన్‌ సంగతేంటి? కుల్‌దీప్‌ సింగ్‌ ఎవరు? ఈ విషయాల గురించి మాదకద్రవ్యాల నిరోధక శాఖ (ఎన్‌సీబీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) చెప్పగలవా’’ అని దిగ్విజయ్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నెల మూడో తేదీన ముంబయిలో ఓ క్రూయిజ్‌ నౌకపై దాడి చేసి ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్యన్‌ జైల్లో ఉన్నారు. దిగ్విజయ్‌ వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. మైనారిటీలను బుజ్జగించే రాజకీయాలకు దిగ్విజయ్‌ పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘‘ఎట్టకేలకు ఖాన్‌కు మద్దతుగా దిగ్విజయ్‌ రంగంలోకి దిగారు. ప్రస్తుతం కేసు న్యాయస్థానంలో ఉంది. విచారణ సంస్థ వాస్తవాలను నిగ్గు తేల్చే పనిలో ఉంది. కానీ అప్పుడే దిగ్విజయ్‌ తన తీర్పును ప్రకటించేశారు. ఇలాంటి బుజ్జగింపు రాజకీయాలతో ప్రజలను ఎంత కాలం ఆయన తప్పుదోవ పట్టిస్తారు’’ అంటూ భాజపా విమర్శలు గుప్పించింది. మరోవైపు షారుక్‌ఖాన్‌ మేనేజర్‌ పూజా దద్లానీ శనివారం ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు గంటసేపు అక్కడే ఉన్నారు. శుక్రవారం కూడా షారుక్‌ అంగరక్షకుడు కార్యాలయానికి చేరుకొని కొన్ని పత్రాలను అధికారులకు అందజేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన