సరిహద్దుల్లో జనజీవనానికి అనుమతి

ప్రధానాంశాలు

Updated : 25/10/2021 05:21 IST

సరిహద్దుల్లో జనజీవనానికి అనుమతి

కొత్త చట్టం తెచ్చిన చైనా
భారత్‌పై ప్రభావం!

బీజింగ్‌: సరిహద్దు వివాదాలకు మరింత ఆజ్యం పోసేలా చైనా కొత్త చట్టాన్ని తెచ్చింది. వివాదాస్పదమైన ఆ ప్రాంతాల్లో ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు అందులో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన సహా సరిహద్దు రక్షణ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు తెలిపింది. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత చాలా పవిత్రమైనవని, వాటి ఉల్లంఘనను ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతించబోమని ఈ సందర్భంగా పేర్కొంది.

చైనా పార్లమెంటు.. నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పీసీ) స్థాయీ సంఘం సభ్యులు శనివారం ఈ చట్టాన్ని ఆమోదించినట్లు అధికారిక వార్తా సంస్థ షిన్హువా తెలిపింది. ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం..

* ప్రాదేశిక సమగ్రత, సరిహద్దులను రక్షించుకునేందుకు చైనా ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టాలి. వీటిని ఉల్లంఘించే యత్నాలను తిప్పికొట్టాలి.  

* చైనా సైన్యం.. సరిహద్దుల్లో కవాతులు సహా పలు రకాల రక్షణ చర్యలను చేపట్టాలి. చొరబాటు, ఆక్రమణ, కవ్వింపు వంటి వాటిని దృఢంగా ఎదుర్కోవాలి.

* సరిహద్దుల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి చర్యలను చేపట్టాలి. అక్కడ ప్రజల నివాసాలను అనుమతించాలి. అందుకు అవసరమైన సేవలు, మౌలిక వసతులను కల్పించాలి. ప్రజలు అక్కడ పనిచేసుకునేలా ప్రోత్సహించాలి.

* సరిహద్దు రక్షణ; సామాజిక, ఆర్థిక అభివృద్ధి మధ్య సమన్వయం ఉండాలి. అక్కడ ఆర్థిక సహకార ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. వరదలు, అగ్ని ప్రమాదాల నియంత్రణకూ చర్యలు చేపట్టాలి.

* సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపులు అనే సూత్రాల ప్రాతిపదికన పొరుగు దేశాలతో వ్యవహారాలను సాగించాలి. సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.


రెండు దేశాలతో వివాదం

భారత్‌, భూటాన్‌లతో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి. 12 పొరుగు దేశాలతో వీటిని పరిష్కరించుకుంది. భారత్‌తో 3,488 కిలోమీటర్లు, భూటాన్‌తో 400 కి.మీ మేర డ్రాగన్‌కు సరిహద్దు వివాదం ఉంది. గత ఏడాది నుంచి తూర్పు లద్దాఖ్‌లో భారత్‌, చైనాల మధ్య సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కొత్త చట్టం రావడం గమనార్హం. చైనా కొన్నేళ్లుగా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక వసతులను బలోపేతం చేసుకుంటోంది. వైమానిక, రైలు, రోడ్డు రవాణాకు సంబంధించిన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దుకు చేరువ వరకూ బులెట్‌ రైలు సర్వీసును ప్రారంభించింది. దీనికితోడు టిబెట్‌లో భారత సరిహద్దుకు కూతవేటు దూరంలో అనేక గ్రామాలను నిర్మిస్తోంది. సరిహద్దు రక్షణలో అవి ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన