రష్యాలో 85 చోట్ల ఉద్ధృతంగా కొవిడ్‌ వ్యాప్తి

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 12:16 IST

రష్యాలో 85 చోట్ల ఉద్ధృతంగా కొవిడ్‌ వ్యాప్తి

 దేశంలో తొలిసారి అత్యధిక కేసులు

మళ్లీ వెయ్యి దాటిన మరణాలు

మాస్కో, రష్యాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి తలెత్తిన తర్వాత తొలిసారిగా ఇక్కడ సోమవారం అత్యధిక కేసులు వెలుగుచూశాయి. 24 గంటల వ్యవధిలో 37,930 కేసులు, 1,069 మరణాలు నమోదయ్యాయి. రష్యాలో కొద్ది రోజులుగా కొవిడ్‌ మరణాలు వెయ్యికిపైనే నమోదవుతున్నాయి.

దేశంలో మొత్తం 85 చోట్ల కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పేర్కొన్నారు. ఆయా చోట్ల కొవిడ్‌ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు... అధ్యక్షుడు పుతిన్‌ ఆదేశాల మేరకు కార్యాలయాలకు సెలవులు కూడా ప్రకటించారు. వైరస్‌ ఉద్ధృతి కారణంగా గురువారం నుంచి బడులు, వినోద కేంద్రాలు, జిమ్‌లను 11 రోజుల పాటు మూసివేస్తారు. దేశంలో ఇప్పటివరకూ సుమారు 82 లక్షల పాజిటివ్‌ కేసులు, 2,31,669 మరణాలు చోటుచేసుకున్నాయి. ఐరోపాలో ఇవే అత్యధికమని... అమెరికా, భారత్‌, బ్రెజిల్‌, మెక్సికోల తర్వాత కరోనాకు అత్యంత ఎక్కువగా ప్రభావితమైనది రష్యానే అని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పేర్కొన్నారు.

స్పుత్నిక్‌-వి ముందే అందుబాటులోకి వచ్చినా...

కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా స్పుత్నిక్‌-వి టీకాను రష్యా అందుబాటులోకి తెచ్చింది. కానీ, టీకా తీసుకునేందుకు రష్యన్లు అంతగా ఆసక్తి చూపడం లేదు! చాలామంది కనీసం కొవిడ్‌ నిబంధనలను కూడా పాటించడం లేదు. ‘‘ఇప్పటివరకూ కేవలం 4.5 కోట్ల మందే వ్యాక్సిన్‌ తీసుకున్నారు. కొవిడ్‌ నిబంధనలను పాటించడం పట్ల చాలామంది అజాగ్రత్తగా ఉంటున్నారు. ప్రజల తీరు వల్లే కేసులు మళ్లీ పెరుగుతున్నాయి’’ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

మూడేళ్ల చిన్నారులకూ టీకా

డ్రాగన్‌ దేశంలో 3-11 ఏళ్ల బాలబాలికలకు అతి త్వరలోనే కొవిడ్‌ టీకా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఐదు ప్రావిన్సుల ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేశాయి. కొద్ది రోజులుగా దేశంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఓవైపు టీకా కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతూనే, మరోవైపు కొవిడ్‌ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. సోమవారం ఉదయం నాటికి చైనాలో కొత్తగా 35 కేసులు వెలుగుచూశాయి. రాజధాని బీజింగ్‌లో కేసుల సంఖ్య 21 నుంచి 33కు పెరిగింది. డెల్టా వేరియంట్‌ కారణంగానే దేశంలో కేసులు పెరుగుతున్నట్టు నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ పేర్కొంది. గాన్సు ప్రావిన్సులో పర్యాటక స్థలాలను అధికారులు మూసివేశారు. ఇన్నర్‌ మంగోలియాలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన