రిజర్వేషన్ల కేసు తేలే వరకు నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌ ఉండదు

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 12:18 IST

రిజర్వేషన్ల కేసు తేలే వరకు నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌ ఉండదు

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: రిజర్వేషన్ల కేసు తేలే వరకు నీట్‌-పీజీ కౌన్సెలింగ్‌ను నిర్వహించబోమని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విషయమై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ ఇచ్చిన ఈ హామీని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం నమోదు చేసింది. ఒకవేళ కౌన్సెలింగ్‌ ప్రకియ ప్రారంభమయితే విద్యార్థులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటారని తెలిపింది. దీంతో ఏకీభవించిన నటరాజ్‌..ఈ విషయంలో ఎలాంటి సమస్య ఎదురయినా పిటిషన్‌దారు తరఫు న్యాయవాదులు తనను నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌సైన్సెస్‌ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కౌన్సెలింగ్‌ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమయిందని పిటిషన్‌దారు తరఫు సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దత్తార్‌ చెప్పగా నటరాజ్‌ వివరణ ఇచ్చారు. అది వైద్య కళాశాలల్లో సీట్ల వెరిఫికేషన్‌ కోసం చేసిన సూచనలు మాత్రమేనని, కౌన్సెలింగ్‌కు సంబంధించి కాదని తెలిపారు.

ఫలితాలపై స్టే ఎత్తివేయండి: నీట్‌ ఫలితాల వెల్లడిపై బాంబే హైకోర్టు ఇచ్చిన స్టే అంశాన్ని త్వరగా విచారించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సుప్రీంకోర్టును కోరింది. ఈ విషయాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ముంబయిలోని ఓ కేంద్రంలో వైష్ణవి భోపాలీ, అభిషేక్‌ శివాజీ అనే అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లు తారుమారు కావడంతో వారిద్దరికి మళ్లీ పరీక్షలు నిర్వహించి, అందరి ఫలితాలతో కలిపి వెల్లడించాలని హైకోర్టు ఈ నెల 20న హైకోర్టు ఆదేశించింది. అయితే ఇద్దరి కోసం మొత్తం ఫలితాలను ఆపడం తగదంటూ ఎన్‌టీఏ అప్పీలు చేసింది. ఫలితాలన్నీ సిద్ధంగా ఉన్నాయని తెలిపింది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన