నేర ఉద్దేశంతో చేసే యత్నం నేరంతో సమానం: సుప్రీం

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 10:04 IST

నేర ఉద్దేశంతో చేసే యత్నం నేరంతో సమానం: సుప్రీం

దిల్లీ: నేరపూరిత చర్యకు సన్నద్ధం కావడానికి, నేర యత్నానికి మధ్య వ్యత్యాసాన్ని విస్తృతంగా విశదీకరిస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఓ కేసులో కీలక తీర్పు వెలువరించింది. మైనర్లపై అత్యాచార యత్నం కేసులో నిందితుడు నేరం చేయడానికి సన్నద్ధం మాత్రమే అయ్యాడని, ప్రయత్నించలేదని చెబుతూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు శిక్షను తగ్గించడాన్ని తప్పుపట్టింది. ఆ తీర్పును రద్దుచేస్తూ నిందితుడు వెంటనే లొంగిపోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన నిందితుడు పక్కింట్లో ఉండే 8, 9 ఏళ్ల బాలికలపై అఘాయిత్యానికి పాల్పడే ఉద్దేశంతో తన ఇంట్లోకి తీసుకెళ్లాడని కేసు నమోదైంది. విచారణలో దిగువ కోర్టు నిందితుడికి ఐదేళ్ల కారాగార శిక్ష విధించింది. దీనిపై నిందితుడు హైకోర్టులో సవాల్‌ చేయగా, శిక్షను రెండేళ్లకు తగ్గించింది. ఈ సందర్భంగా హైకోర్టు నిందితుడు ఏ దశలోనూ అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఆధారాలు లేవని, సన్నద్ధ దశను దాటి ముందుకెళ్లలేదని పేర్కొంది. నేర చర్యకు సన్నద్ధతను నేర యత్నంగా పరిగణించలేమని అభిప్రాయపడింది. దీనిపై మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. నేరపూరిత చర్యలో నిందితుల మనస్తత్వానికి సంబంధించి మూడు దశలు ఉంటాయని జస్టిస్‌ ఎన్‌.వి.రమణతోపాటు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనం విచారణ సందర్భంగా పేర్కొంది. నేరం చేయాలన్న ఉద్దేశం, అందుకోసం సన్నద్ధం, ఆ తర్వాత యత్నం ఉంటాయని చెప్పింది. యత్నం సఫలమైతే నేరం పూర్తవుతుందని, విఫలమైతే నేరం పూర్తికాదని పేర్కొంది. అయినప్పటికీ నేర యత్నం శిక్షార్హం అంది. నేరం చేయాలన్న నైతిక అపరాధ ఉద్దేశంతో చేసే యత్నం సామాజిక విలువలపై చూపే దుష్ప్రభావం నేరం జరిగినదానికన్నా తక్కువ కాదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో బాలికలను అత్యాచారం చేయాలన్న ఉద్దేశంతో, వారిని ప్రలోభపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి, తలుపులు మూయడంతోనే సన్నద్ధ దశ దాటి నేర యత్నానికి పాల్పడినట్లేనని స్పష్టం చేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన