రిజర్వేషన్లకు నిర్దిష్ట సూత్రం ఉండాలి

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:50 IST

రిజర్వేషన్లకు నిర్దిష్ట సూత్రం ఉండాలి

లేకుంటే నిరంతరం సమస్యలే  
రూపొందించే బాధ్యత సుప్రీందే
అటార్నీ జనరల్‌ వేణుగోపాల్‌

దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయమై నిర్దిష్ట, నిర్ణయాత్మక ప్రాతిపదికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టును కోరింది. ఈ విషయమై దాఖలైన వ్యాజ్యాలను విచారిస్తున్న జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు ఈ విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘ఎస్సీ, ఎస్టీలు ఎన్నో శతాబ్దాల తరబడి ప్రధాన జీవన స్రవంతి నుంచి దూరంగా ఉండిపోయారు. దేశ హితం దృష్ట్యా వారికి సమాన అవకాశాలు కల్పించాల్సి ఉంది. ఇందుకోసం రిజర్వేషన్ల రూపంలో సమానత్వ సాధకుడు (ఈక్వలైజర్‌)ని తీసుకొచ్చాం. ఈ విషయంలో నిర్ధిష్ట, నిర్ణయాత్మక ప్రాతిపదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించకపోతే చాలా దావాలు వస్తూనే ఉంటాయి. ప్రతిభ లేకుంటే సీట్లు భర్తీ చేయలేం. కానీ శతాబ్దాలుగా నిరాదరణకు గురయిన వర్గం ఒకటి ఉంది. వారి కోసం సమానత్వ సాధకుడిని తీసుకొచ్చాం. నా దృష్టిలో అది నిష్పత్తి ఆధారిత ప్రాతినిధ్యంలాంటిది. అది సమానత్వ హక్కును ఇస్తుంది. ఈ రిజర్వేషన్ల కల్పనకు ఓ సూత్రం ఉండాలి. దీన్ని రూపొందించే బాధ్యతను ప్రభుత్వాలకు అప్పగించడం సరికాదు. ఏ మేరకు రిజర్వేషన్లు ఉండాలనే విషయమై 1950 నుంచే సమస్య ఉంది. గత ఏడు దశాబ్దాలుగా విద్య, ఉద్యోగ రంగాల్లో ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు ఎంతవరకు ఫలించాయో పరిశీలించండి. అవి సంతృప్తికరంగా లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం కోర్టు విధి. దురదృష్టవంతులకు కల్పిస్తున్న ఈ అవకాశాలు సమానత్వ సాధన ప్రక్రియలాంటివి. ఇక బలహీన వర్గాల విషయానికి వస్తే దేశంలో 52 శాతం మంది బీసీలు ఉన్నారు. ఆ నిష్పత్తి ప్రకారం మొత్తం 74.5 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉన్నా, 50 శాతానికే పరిమితం చేశాం. గ్రూపు-ఏ కేటగిరీలోని ఉన్నత ఉద్యోగాలు పొందడం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కష్టంగా మారింది. 1975లో ప్రభుత్వ ఉద్యోగాల్లో 3.5 శాతం మంది ఎస్సీలు, 0.62 శాతం మంది ఎస్టీలు ఉండగా 2008 నాటికి అది 17.5 శాతం, 6.8 శాతంగా పెరిగింది. పెరుగుదల కనిపిస్తున్నా అది సరిపోదు. అందుకే రిజర్వేషన్లు కొనసాగాలి. ఈ విషయంలో సుస్థిర ప్రాతిపదికను న్యాయస్థానమే సూచించాలి’’ అని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన