అపార్టుమెంట్లలో నయా పెత్తందార్లు! 

ప్రధానాంశాలు

Published : 02/08/2021 21:26 IST

అపార్టుమెంట్లలో నయా పెత్తందార్లు! 

నిర్వహణ సంఘాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నం
రిజిస్ట్రేషన్, ఎన్నికపై తరచూ గొడవలు
ఓ గేటెడ్‌ కమ్యూనిటీ వివాదంలో సహకారశాఖ అధికారుల తీరుపై విమర్శలు 


ఈనాడు, హైదరాబాద్‌: జీవనం భద్రంగా, సౌకర్యంగా ఉంటుందనే ఆలోచనతో నగరాలు, పట్టణాల్లో బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్‌ కమ్యూనిటీల(జీసీ)కు ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో నిర్వహణ సంఘాల్లో ‘పెత్తనం’ వివాదాలు వాటిల్లోని కొన్ని కుటుంబాలకు మనశ్శాంతిని దూరం చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగరంలో మేడ్చల్‌ జిల్లా పరిధిలోకి వచ్చే ఒక గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీ వాసులు కొత్తగా ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్‌(సంఘం) రిజిస్ట్రేషన్, ఎన్నికల నిర్వహణపై వివాదం తలెత్తడం, హైకోర్టు వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది.  
వివాదం ఇలా..
ఈ జీసీ కాలనీలో నివాసముంటున్న కుటుంబాల్లో తొలుత కొందరు సంఘం ఏర్పాటు చేసుకున్నామని సహకార చట్టం కింద మేడ్చల్‌ జిల్లా కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. నిబంధనల మేరకు ఇది పూర్తయిన 90 రోజుల్లోగా సంఘం ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఎన్నుకోవాలి. ఆ కాలనీలోని మరో వర్గం సహకరించకపోవడంతో గడువులోపు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ క్రమంలో అదే కాలనీకి¨ చెందిన మరో వర్గం తాము సంఘం ఏర్పాటు చేసుకున్నామని రిజిస్ట్రేషన్‌ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై హైకోర్టుకూ వెళ్లారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇక్కడ ఇళ్లు కొన్న ప్రముఖులు, రాజకీయ నాయకుల బంధువులు కొందరు సంఘం అధ్యక్ష పదవిని పొందాలనే లక్ష్యంతో.. పైరవీలు చేసి తమకు అనుకూలంగా పనులు చేయించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి.  
పాత చట్టాలే కారణమా?
1964లో సహకార చట్టం తెచ్చినప్పుడు అపార్టుమెంట్లు, జీసీ కాలనీల సంస్కృతి లేదు. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అపార్ట్‌మెంట్‌ సంఘాల ఏర్పాటు, పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు ఇంతవరకూ పారదర్శక వ్యవస్థలు లేవు. ఈ క్రమంలో అనేక సమస్యలు వస్తున్నాయని సహకార శాఖ వర్గాలు చెబుతున్నాయి. పరస్పర అవగాహన సహకార సంఘం(మ్యాక్స్‌) చట్టం-1995 కింద కూడా ఈ సంఘాలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఈ చట్టానికి సవరణ ప్రతిపాదించగా హైకోర్టు స్టేతో ఆగిపోయింది.  
సమస్యలెలా వస్తున్నాయంటే...
ఫ్లాట్‌ కొన్నప్పుడు ఎవరిపేరున రిజిస్ట్రేషన్‌ అయితే వారే సంఘం ఎన్నికల్లో ఓటు వేయాలని, వారే పాలకవర్గంలోకి ఎన్నిక కావాలని సంఘం బైలాస్‌లో రాస్తున్నారు. అయితే నగరంలో ఫ్లాట్లు కొనే చాలామంది తమ భార్య, పిల్లలు లేక తల్లిదండ్రుల పేరున వాటిని రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నారు. ఇలాంటివారు పాలకవర్గాల్లోకి ఎన్నిక కావడానికి, ఓటు వేయడానికి వీల్లేదని మిగతావారు కొన్ని సంఘాల్లో అడ్డుకుంటున్నారు. ఉదాహరణకు ఓ అపార్టుమెంటులో 70 ఫ్లాట్లు ఉండగా.. తమ పేరుతో ఫ్లాట్‌ రిజిస్టర్‌ అయి.. అందులో నివాసముంటున్నవారు కేవలం 13 మంది మాత్రమే ఉన్నారు. బైలాస్‌ ప్రకారం ఆ 13 మందికే ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీచేసి పాలకవర్గంగా ఎన్నికయ్యే హక్కు ఉంటుందని వాదిస్తున్నారు. ఈ 13 మందే ఏళ్ల తరబడి సంఘంలో ఎన్నికై తిష్ఠవేస్తే నిర్వహణలో సమస్యలు మొదలవుతున్నాయి. ఇబ్బందులు పడేవారు ఒకవైపు, పెత్తనం చేసేవారు మరో వర్గంగా ఏర్పడిగొడవలు పడుతూ కోర్టులకు వెళ్లడం, సహకార అధికారులకు ఫిర్యాదు చేయడం మామూలైంది. 
స్థానిక సంస్థలకే అప్పగించాలి!
మేడ్చల్‌ జిల్లా పరిధిలోని జీసీ కాలనీ రిజిస్ట్రేషన్‌ విషయంలో లోపాలున్నట్టు తమ దృష్టికి వచ్చిందని బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని సహకారశాఖ రాష్ట్ర కమిషనర్‌ వీరబ్రహ్మయ్య ‘ఈనాడు’కు చెప్పారు. అపార్టుమెంట్లు, జీసీ కాలనీ సంఘాల్లో వివాదాలు పెరుగుతున్న మాట వాస్తవమేనని, తమ శాఖకున్న కొద్దిమంది ఉద్యోగులతో వాటిని పరిష్కరించడం సాధ్యం కాదని, అవి ఎక్కడ ఉంటే అక్కడి మున్సిపాలిటీ లేదా పంచాయతీ వంటి స్థానిక సంస్థలకే వాటి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశామన్నారు. చాలా సంఘాలలో ఒకరిద్దరు చేసే ఆగడాలతో వివాదాలు పెరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.   Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన