అందరిపైనా డెల్టా ప్రభావం

ప్రధానాంశాలు

Published : 02/08/2021 21:23 IST

అందరిపైనా డెల్టా ప్రభావం

టీకా తీసుకున్నా మాస్కు ధరించాల్సిందే: నిపుణులు 

దిల్లీ: టీకా పొందారా.. లేదా.. అన్నదానితో సంబంధం లేకుండా కరోనా సోకిన వ్యక్తుల్లో డెల్టా వైరస్‌ రకం వైరల్‌ లోడు ఉంటోందన్న అమెరికా ‘సీడీసీ’ నివేదికపై భారత్‌లోని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నివేదిక ఫలితాలు మన దేశానికీ వర్తిస్తాయని చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ‘‘అధిక వైరల్‌ లోడు కారణంగా కరోనా వ్యాప్తి చెందే ముప్పు ఎక్కువగా ఉంటుంది. డెల్టా సోకిన వ్యక్తి అప్పటికే టీకా పొంది ఉన్నప్పటికీ.. వ్యాక్సిన్‌ తీసుకోని వ్యక్తి స్థాయిలోనే వైరస్‌ను వ్యాపింపజేస్తాడు. ఈ నేపథ్యంలో మాస్కు నిబంధలను సవరించాం. తమకు తెలియకుండా ఇతరులకు వైరస్‌ వ్యాప్తి చేయకుండా ఉంచేలా.. మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేశాం’’ అని సీడీసీ డైరెక్టర్‌ రోషెల్‌ పీ వాలెన్‌స్కీ ఇటీవల పేర్కొన్నారు.

ఇది భారత్‌లోని పరిస్థితులకూ వర్తిస్తుందని మన దేశ నిపుణులు చెబుతున్నారు. మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. డెల్టా వేరియంట్‌ ఉద్ధృతి నేపథ్యంలో గదుల్లో జరిగే సమావేశాలు, పని ప్రదేశాలు, బార్లు, పండగల సమయంలో జాగ్రత్తగా ఉండాలని ‘ఏషియన్‌ సొసైటీ ఫర్‌ ఎమర్జెన్సీ మెడిసిన్‌’కు చెందిన డాక్టర్‌ తమోరిశ్‌ కోలె తెలిపారు. దేశంలో అందుబాటులో ఉన్న టీకాలలో కొవాగ్జిన్, కొవిషీల్డ్‌.. అన్ని వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెల్టా ప్లస్‌ రకంపై టీకా పనితీరును విశ్లేషించే అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే, దేశవ్యాప్తంగా ‘ఆర్‌ ఫ్యాక్టర్‌’ పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ చేపట్టాలని తమోరిశ్‌ సూచించారు. ఒక ప్రాంతంలో కొవిడ్‌ ఏ స్థాయిలో విజృంభిస్తుందనే విషయాన్ని ఆర్‌-ఫ్యాక్టర్‌తో సూచిస్తారు. మరోవైపు, దేశంలోని అనేక రాష్ట్రాలు కరోనా ఆంక్షలను సడలిస్తున్నాయి. త్వరలో మరిన్ని మినహాయింపులను ఇచ్చే యోచనలో ఉన్నాయి. వంద శాతం సామర్థ్యంతో బస్సులు, మెట్రోలు నడుస్తున్నాయి. ఫలితంగా 10 రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మూడో దశ కరోనా వ్యాప్తిపై ఊహాగానాలు మొదలయ్యాయి.


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన