కొత్త కొలువుల జోష్‌.. ఫ్రెషర్స్‌ వైపు ఐటీ, ఇతర రంగాల చూపు

ప్రధానాంశాలు

Updated : 21/10/2021 16:35 IST

కొత్త కొలువుల జోష్‌.. ఫ్రెషర్స్‌ వైపు ఐటీ, ఇతర రంగాల చూపు

నియామకాల్లో టాప్‌-3లో హైదరాబాద్‌

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: దాదాపు 1500 సంస్థలు.. 5.60 లక్షల మంది ఉద్యోగులు.. ఒక్కో టెకీకి మరో ముగ్గురు సహాయ ఉద్యోగులు. అంటే దాదాపు 22 లక్షల మందికి ఆధారం. ఇదీ హైదరాబాద్‌ ఐటీ రంగ స్వరూపం. అయితే కొవిడ్‌-19 ప్రభావంతో కుదేలు కావడంతో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. సంస్థలూ ఖర్చు తగ్గించుకునేందుకు కొందర్ని తొలగించి, మిగిలినవారితో ఇంటి నుంచి పనిచేయించాయి. గత జనవరి నుంచి దాదాపు 7 శాతం ఉత్పత్తి పెరగడంతో మళ్లీ ఉద్యోగుల నియామక ప్రక్రియను ప్రారంభిస్తున్నాయి. ఫ్రెషర్స్‌ నియామకాలకు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. 

మూడో స్థానంలో హైదరాబాద్‌..

దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోని 53% సంస్థలు ఈ అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం నుంచి ఉద్యోగుల్ని చేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రముఖ హెచ్‌ఆర్‌ సొల్యూషన్స్‌ సంస్థ టీమ్‌ లీజ్‌ అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 14 నగరాల్లో 21 రంగాలకు చెందిన సంస్థల నుంచి వివరాలు సేకరించగా.. నియామక ప్రక్రియలో 67%తో బెంగళూరు మొదటి స్థానంలో, 59%తో దిల్లీ రెండోస్థానంలో నిలిచాయి. వాటి తర్వాత స్థానం భాగ్యనగరిదే. ఐటీలో 69%, విద్యారంగంలో 64%, ఔషధ రంగంలో 51% సంస్థలు ఈ త్రైమాసికంలో నియామక ప్రక్రియలు చేపట్టనున్నట్లు టీమ్‌ లీజ్‌ అధ్యయనంలో తేలింది. 

ఇంటి నుంచి కార్యాలయాలకు..

హైసియా నివేదిక ప్రకారం.. హైదరాబాద్‌లో 500 మంది లోపు ఉద్యోగులున్న చిన్న సంస్థలు ఇప్పటికే 60% మందిని కార్యాలయాలకు రప్పించాయి. మధ్యస్థ, భారీ సంస్థలు 15% మందితో నడిపిస్తున్నాయి. దాదాపు 76% సంస్థలు 9% కంటే తక్కువ మంది ఉద్యోగులను రప్పించాయి. ఈ ఏడాది డిసెంబరు నుంచి దాదాపు 73% సంస్థలు సగం మంది ఉద్యోగులతో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. మిగతా సంస్థలు 10%, అంతకంటే తక్కువ మందితో పనిచేయించుకోనున్నాయి. 2022 మార్చి నాటికి దాదాపు 2 నుంచి 5 లక్షల దాకా ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చే అవకాశముంది.

1.5% మంది కొత్తవారికే అవకాశాలు

గతేడాది ఫ్రెషర్స్‌ నియామకాలు పూర్తిగా ఆగిపోయాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది కొత్తవారి నియామకాలు 1.5% పెరిగాయి. ఖర్చు కలిసిరావడంతో పాటు సామర్థ్యం చూసి ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో టాప్‌-15 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 90% మందికి క్యాంపస్‌ నియామకాల్లోనే ఉద్యోగాలొస్తున్నాయి. - చెరుకూరి కిరణ్‌ హైసియా ఉపాధ్యక్షుడు

సాంకేతికత వినియోగం పెరిగింది

కొవిడ్‌-19 తర్వాత సాంకేతికత వినియోగం పెరిగింది. అందుకు తగ్గట్లే ఉద్యోగుల అవసరముంది. వివిధ కోడింగ్‌లలో సుశిక్షితుల్ని సంస్థలు ఎంచుకుంటున్నాయి. వచ్చే ఏడాది ఆరంభం నుంచి కార్యాలయాల నుంచి పని మొదలుకావొచ్చు. ఉద్యోగులూ దానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.-సందీప్‌ మక్తల, టీటా గ్లోబల్‌ అధ్యక్షుడు Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన