ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే యత్నం

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 10:40 IST

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే యత్నం

పెగాసస్‌ వ్యవహారంలో కేంద్రంపై రాహుల్‌ విమర్శ

దిల్లీ: పెగాసస్‌ నిఘా వ్యవహారం మీద సుప్రీంకోర్టు ఉత్తర్వులపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నించిందనీ, ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్పైవేర్‌ వాడుకకు ప్రధాని, లేదా కేంద్ర హోంమంత్రి ఆదేశించి ఉండవచ్చని చెప్పారు. స్పైవేర్‌ను వ్యక్తిగత ఆయుధంగా ప్రధాని వాడుతూఉంటే పూర్తిగా అది నేరమే అవుతుందన్నారు. దేశానికి, వ్యవస్థలకు ప్రధాని అతీతుడు కాదని స్పష్టంచేశారు. ‘పెగాసస్‌ స్పైవేర్‌ను ప్రభుత్వాలకే ఇస్తారు. మరి ప్రభుత్వంలో ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఎవరిపై దానిని వాడారు? మన ప్రజలకు సంబంధించిన సమాచారం మరే దేశానికైనా అందుబాటులో ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి. దీనిపై పార్లమెంటులోనూ చర్చకు పట్టుపడతాం’ అని వివరించారు. విపక్షాలు ఇంతకాలం చేస్తున్న వాదనలకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయన్నారు. కరోనా టీకాల గురించి రాహుల్‌ ట్వీట్‌ చేస్తూ దేశంలో ఇంకా చాలామందికి ఇవి అందలేదని, కేంద్రం తప్పుడు లెక్కలు చూపిస్తోందని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఓ పత్రికకు రాసిన కథనాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. 68 కోట్ల మంది ప్రజలు ఒక్కడోసు కూడా పొందలేదని ఓ వెబ్‌సైట్‌లో ఉన్న గణాంకాల్ని ప్రస్తావించారు.

చరిత్రాత్మకమన్న న్యాయ నిపుణులు

దిల్లీ: పెగాసస్‌ వ్యవహారంలో సైబర్‌ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని న్యాయ నిపుణులు దుష్యంత్‌ దవే, రాకేశ్‌ ద్వివేది, గీతా లూథ్రా స్వాగతించారు. గోప్యత హక్కుపై ఇదొక చరిత్రాత్మక తీర్పుగా నిలిచిపోతుందన్నారు. ఇది పిటిషనర్ల విజయమని అభివర్ణించారు. జాతీయ భద్రత పేరుతో న్యాయ సమీక్షను ప్రభుత్వం అడ్డుకోజాలదని దవే పేర్కొన్నారు.

ప్రభుత్వ వైఖరికి తగ్గట్టుగా ఉంది: భాజపా

సుప్రీంకోర్టు ఆదేశం.. ప్రభుత్వ వైఖరికి œగ్గట్టుగా ఉందని భాజపా వ్యాఖ్యానించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొంతమంది చేస్తున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలంటే నిపుణుల కమిటీని వేయడమే మేలని ప్రభుత్వం మొదటినుంచీ చెబుతోందని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్‌పాత్ర పేర్కొన్నారు.

ప్రభుత్వానిది దాటవేత ధోరణి: సీపీఎం

నిఘా సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వ సంస్థలు వాడాయా, లేదా అనేది సుప్రీంకోర్టులో తేల్చి చెప్పకుండా ప్రభుత్వం నిరాకరించిందని సీపీఎం ఆరోపించింది. ఈ దాటవేత ధోరణితో ప్రభుత్వం తన భాగస్వామ్యాన్ని అంగీకరించినట్లయిందని పేర్కొంది. సుప్రీంకోర్టు కమిటీని వేయడంతో ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనం బయటపడిందని సీపీఐ ఎంపీ బినయ్‌ విశ్వం వ్యాఖ్యానించారు. జాతీయ భద్రత ముసుగులో తప్పించుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించిందని, నిజం బయటపడిపోతుందని మోదీ భయపడుతున్నారని చెప్పారు.

* చట్టాని కంటే కేంద్ర ప్రభుత్వం గొప్పదేమీ కాదన్న విషయాన్ని మోదీ సర్కారు ఇప్పటికైనా గ్రహించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. ఫోన్ల నిఘాపై ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని పార్టీ నేతలు పేర్కొన్నారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన