Corona Virus: కొవిడ్‌ దెబ్బకు ఐరోపా విలవిల

ప్రధానాంశాలు

Published : 25/11/2021 09:30 IST

Corona Virus: కొవిడ్‌ దెబ్బకు ఐరోపా విలవిల

11% కేసుల పెరుగుదల

జెనీవా: ఐరోపాలో కొవిడ్‌ విజృంభిస్తోంది. అనేక దేశాల్లో కేసులు, మరణాలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. ప్రధానంగా డెల్టా రకం వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఐరోపాలో గత వారం 11% మేర కొవిడ్‌ కేసులు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ప్రపంచంలో అక్టోబరు మధ్య నుంచి కేసులు పెరుగుతున్న ఏకైక ప్రాంతం ఇదేనని పేర్కొంది. మహమ్మారి పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌ఓ మంగళవారం అందించిన సమాచారం ప్రకారం.. గత వారంలో ప్రపంచవ్యాప్తంగా కేసులు, మరణాలు 6% మేర పెరిగాయి. మొత్తం 36 లక్షల కొత్త కేసులు బయటపడగా, 51 వేల మరణాలు సంభవించాయి. 

* ఆగ్నేయాసియాలో 11%, పశ్చిమాసియాలో 9% మేర కేసులు తగ్గాయి. గత వారంలో అత్యధికంగా ఆఫ్రికాలో 30% మేర కొవిడ్‌ మరణాలు తగ్గాయి. అమెరికాల్లో కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, మరణాలు 19% పెరిగాయి. 

నెదర్లాండ్స్‌లో మళ్లీ ‘భౌతిక దూరం’

కరోనా కేసులు పెరుగుతుండటంతో నెదర్లాండ్స్‌లో భౌతిక దూరం నిబంధనను బుధవారం నుంచి తప్పనిసరి చేశారు. మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను కూడా అమల్లోకి తేవాలని ఐసీయూల జాతీయ అసోసియేషన్‌ అధిపతి డైడెరిక్‌ గోమర్స్‌ సూచించారు. విద్యాసంస్థలు సహా అన్నింటినీ మూసివేయాలన్నారు. గత కొద్ది రోజులుగా దేశంలోని ఆసుపత్రులకు కొవిడ్‌ రోగుల తాకిడి పెరిగిపోయిందని, ఈమేరకు ఐసీయూల్లో ప్రాధాన్యక్రమంలో విషమ పరిస్థితుల్లో ఉన్నవారినే చేర్చేలా వైద్యులు చర్యలు చేపట్టాలన్నారు. గత వారంలో 5 నుంచి 11 ఏళ్ల పిల్లలు ఎక్కువగా కొవిడ్‌ బారినపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ద.కొరియాలో రికార్డు స్థాయి కేసులు

కరోనాను కట్టడి చేయడంలో విజయవంతమైన దేశంగా ఒకప్పుడు పేరొందిన దక్షిణ కొరియాలోనూ ఆందోళనకర రీతిలో కేసులు పెరుగుతున్నాయి. మహమ్మారి జాడ కనిపించిన తర్వాత ఎన్నడూ లేనంతగా దేశంలో 4,116 రోజువారీ కేసులు నమోదయ్యాయి. ఆర్థిక రంగ పురోభివృద్ధికి ఉద్దేశించి భౌతిక దూరం నిబంధనలను సడలించడం, డెల్టా వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో కొద్ది వారాలుగా కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో ఐసీయూలకు కొరత వస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

జర్మనీలో లక్ష దాటిన మరణాలు

జర్మనీలో మహమ్మారి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య లక్ష దాటింది. బుధవారం ఒక్కరోజులో 66,884 కొత్త కేసులు బయపడగా.. 335 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 68% ప్రజలకే వ్యాక్సినేషన్‌ పూర్తయింది. ప్రభుత్వం 75 శాతానికి పైగా ప్రజలకు టీకాలు వేయాలని నిర్దేశించుకున్నప్పటికీ.. లక్ష్యం ఇంకా దూరంగానే ఉంది. దేశవ్యాప్తంగా ఐసీయూల్లో చేరుతున్న వారిలో యువత సంఖ్య పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో టీకాను తప్పనిసరి చేసే నిబంధనను తీసుకురావాలని రాజకీయ నాయకులు కోరుతున్నారు. 

చెక్‌ రిపబ్లిక్‌లో.. 

చెక్‌ రిపబ్లిక్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా బుధవారం 26 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు 1,061 కేసులు బయట పడుతున్నాయి. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఇది రెట్టింపు సంఖ్య అని అధికార వర్గాలు తెలిపాయి.

దేశంలో కొత్త కేసులు 9,283

దిల్లీ: దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9,283 మంది కరోనా బారిన పడారు. వైరస్‌తో 437 మంది మరణించారు. మొత్తం కేసులు 3,45,35,763కు, మృతుల సంఖ్య 4,66,584కు చేరింది. కోలుకుంటున్నవారి శాతం (98.33) కూడా పెరుగుతోంది. పాజిటివిటీ రేటు 0.80 శాతంగా నమోదైంది. సుమారు 118.44 కోట్ల మంది టీకా తీసుకున్నారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన