నీట్‌లో ఈడబ్ల్యూఎస్‌ వార్షికాదాయ పరిమితిని సమీక్షిస్తాం

ప్రధానాంశాలు

Updated : 26/11/2021 05:36 IST

నీట్‌లో ఈడబ్ల్యూఎస్‌ వార్షికాదాయ పరిమితిని సమీక్షిస్తాం

దానిపై ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తాం

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: నీట్‌ పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి.. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద లబ్ధి పొందేందుకు వార్షికాదాయ పరిమితిని రూ.8 లక్షలుగా పరిగణించాలన్న తమ నిర్ణయాన్ని సమీక్షించుకుంటామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గురువారం నివేదించింది. ఈడబ్ల్యూఎస్‌ విషయంలో వార్షికాదాయ పరిమితిని నిర్ణయించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తామని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనానికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. నాలుగు వారాల్లో కమిటీ తన పనిని పూర్తిచేస్తుందని పేర్కొన్నారు. అప్పటివరకు నీట్‌ (పీజీ) కౌన్సిలింగ్‌ను వాయిదా వేస్తామని చెప్పారు. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన కౌన్సిలింగ్‌లో ఓబీసీలకు 27%, ఈడబ్ల్యూఎస్‌లకు 10% రిజర్వేషన్‌ కల్పిస్తామంటూ ఈ ఏడాది జులై 29న ప్రకటన విడుదలైంది. ఈడబ్ల్యూఎస్‌ వార్షికాదాయ పరిమితిని రూ.8 లక్షలుగా పరిగణించనున్నట్లు వెల్లడించింది. దాన్ని సవాలు చేస్తూ పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు అభినందనీయమని విచారణ సందర్భంగా జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర సర్కారుకు అన్ని రాష్ట్రాలు సహకరించాలని పిలుపునిచ్చారు. అయితే- ఈడబ్ల్యూఎస్‌ వార్షికాదాయ పరిమితిని శాస్త్రీయ విధానంలో నిర్ధారించాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. కమిటీ నివేదిక సమర్పించడానికి ఆలస్యమయ్యే అవకాశాలుండటంతో ప్రస్తుత విద్యాసంవత్సరానికిగాను ఈడబ్ల్యూఎస్‌ కోటాను పక్కనపెట్టి కౌన్సిలింగ్‌ నిర్వహించే అవకాశాలను పరిశీలించాలన్న విద్యార్థుల వినతికి కేంద్రం నిరాకరించింది. తదుపరి విచారణను సర్వోన్నత న్యాయస్థానం వచ్చే ఏడాది జనవరి 6కు వాయిదా వేసింది.

* నీట్‌ (యూజీ) 2021 పరీక్షకు సంబంధించి భౌతికశాస్త్రం పేపరు హిందీ వర్షన్‌లో వచ్చిన తప్పును పునఃపరిశీలించేందుకు ముగ్గురు నిపుణులతో కమిటీని ఏర్పాటుచేయనున్నట్లు సుప్రీంకోర్టుకు జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) గురువారం నివేదించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన