Rani Rampal: విరిగిన స్టిక్‌తో.. ఒలింపిక్‌ పతక వేట!

కథనాలు

Published : 03/08/2021 01:10 IST

Rani Rampal: విరిగిన స్టిక్‌తో.. ఒలింపిక్‌ పతక వేట!

ఆమె పేరుకే రాణి.. కానీ జీవితమంతా వెతలే! ఇంట్లో కరెంటు కూడా లేనంతటి పేదరికం... అర లీటరు పాలు కొనలేని దుస్థితి... పైగా అమ్మాయిలకు ఆటలేంటి? అనే సవాళ్లు ఎదుర్కొంది... అయితే ఏంటట? హాకీనే ఊపిరి చేసుకొని అన్నింటికీ ఎదురొడ్డింది... విరిగిన హాకీ స్టిక్‌తో సాధన మొదలు పెట్టింది... కష్టాలన్నీ గోల్‌పోస్ట్‌లోకి నెట్టేసి దేశం గర్వించే క్రీడాకారిణిగా ఎదిగింది... ఒలింపిక్స్‌లో తొలిసారి సెమీస్‌కి చేరిన జట్టును ముందుండి నడిపి చరిత్ర సృష్టించింది... తనే భారత జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌.. తన ఒలింపిక్‌ స్వప్నానికి రెండడుగుల దూరంలో ఉంది.

‘ఈ జీవితం నుంచి దూరంగా పారిపోతే బాగుండు..’ రాణి చిన్నప్పుడు చాలాసార్లు అనుకునేదట. ఇంట్లో చిన్న దీపమే దిక్కు. దోమల బెడద భరించలేక రోజూ నిద్రలేని రాత్రులే గడిపేది. ఓసారి భారీ వర్షాలొస్తే ఉన్న చిన్నపాటి గుడిసె కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ఇలాంటి కష్టాలతో సావాసం చేసిన అమ్మాయి జాతీయ జట్టుకి ఎంపికవుతుందని, జట్టును ముందుండి నడిపిస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు.

రాణిది హరియాణాలోని షహబాద్‌ మర్కందా. నాన్న రిక్షా పుల్లర్‌. అమ్మ చుట్టుపక్కల ఇళ్లలో పనిమనిషిగా చేసేది. వాళ్ల ఇంటిపక్కనే హాకీ అకాడమీ ఉండేది. నిమిషం ఖాళీగా ఉన్నా అక్కడికెళ్లి కళ్లప్పగించి చూస్తుండిపోయేది. మెల్లిమెల్లిగా ఆడాలనే ఆసక్తి మొదలైంది. కానీ ఎలా? పొద్దంతా కష్టపడితే నాన్నకి వచ్చేది 80 రూపాయలు. అవీ ఇంటి ఖర్చులకే సరిపోయేవి. కనీసం హాకీ స్టిక్‌ కూడా కొనలేని పేదరికం. అందుకే అకాడమీ కోచ్‌ దగ్గరికెళ్లి నాకూ నేర్పించమని బతిమాలేది. బక్కపల్చగా ఉన్న తన రూపం చూసి సాధ్యం కాదనేవాడాయన. ‘హాకీలో రాణించాలంటే గంటలకొద్దీ ప్రాక్టీస్‌ చేయాలి. దానికెంతో ఓపిక, బలం కావాలి. నువ్వు చూస్తే పీలగా, బలహీనంగా ఉన్నావు. అందుకే కోచింగ్‌ ఇవ్వడం కుదరదు’ అనేవారు. అయినా రాణి పట్టు విడిచేది కాదు. ఓసారి విరిగిపోయిన హాకీ స్టిక్‌ని ఎవరో ఓ మూలన పడేస్తే దాన్నే తీసుకొని ప్రాక్టీసు చేయడం మొదలు పెట్టింది. సల్వార్‌ కమీజ్‌తోనే గ్రౌండ్‌ నలుమూలల అలుపెరుగుకుండా పరుగులు తీసేది. చివరికి ఓరోజు కోచ్‌ మనసు కరిగింది. శిక్షణ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

అమ్మాయికి ఆటలా..?

సంతోషంగా పరుగెత్తుకెళ్లి అమ్మానాన్నలకు చెప్పింది. రేపట్నుంచి నేను హాకీ కోచింగ్‌కి వెళ్తున్నానని అంది. కానీ వాళ్లు ససేమిరా అన్నారు. ‘అమ్మాయిలంటే ఇంటి పనే చేయాలి. వీధుల్లోకి వెళ్తే ఆడటం ఏంటి? పైగా ఈ ఆటలో కురచ దుస్తులు (స్కర్ట్‌) ధరించాలి. అందుకు మేం ఒప్పుకోం’ అన్నారు. బంధువులదీ అదేమాట. ఏడ్చి, బతిమాలి.. చివరికి ఎలాగోలా వాళ్లని ఒప్పించింది. ఇందులో గనక ఫెయిల్‌ అయితే అమ్మానాన్నలు ఏం చెప్పినా చేస్తాననే షరతుపై.

పాలల్లో నీళ్లు కలిపి...

ఉదయం ఐదుగంటలకే తన శిక్షణ మొదలయ్యేది. కానీ, సమయం చూసుకోవడానికి వాళ్లింట్లో అసలు వాచీ ఉంటేగా! అందుకే రాణి తల్లి ఏ అర్ధరాత్రో నిద్ర లేచేది. ఆకాశంవైపు చూసి చీకటి తెరమరుగవుతుంటే తెల్లవారుతోందని గ్రహించి, అదే సరైన టైం అని నిద్ర లేపేది. అకాడమీలో సాధన చేసే ప్రతి క్రీడాకారిణి తప్పనిసరిగా రోజూ అర లీటరు పాలు తీసుకోవాలి అనే నియమం ఉండేది. కానీ పాలు కొనడానికి డబ్బులు లేకపోయేవి. దాంతో 200 మిల్లీ లీటర్లే కొని అందులో నీళ్లు కలుపుకొని వెళ్లేది. రాణి తపన చూసి కోచ్‌నే సొంత డబ్బులతో హాకీ కిట్‌, షూలు కొనిచ్చాడు. అంతేకాదు.. తనకి మంచి ఆహారం అందించాలనే పెద్దమనసుతో వాళ్ల కుటుంబంతోనే ఉండనిచ్చారు. అప్పట్నుంచి ఒక్కరోజు కూడా ప్రాక్టీస్‌కి డుమ్మా కొట్టలేదు.

రూ.500 పారితోషికం

రాణి ఓ టోర్నమెంట్‌లో గెలిచినందుకు అందుకున్న తొలి పారితోషికం రూ.500. ఆ డబ్బుని తీసుకెళ్లి నాన్న చేతిలో పెట్టింది. ఆయన ముందు నమ్మలేదు. దాన్ని అపురూపంగా చూశాడు. నా కూతురు సంపాదనపరురాలైందని ఊరంతా గొప్పగా చెప్పుకున్నాడు. అప్పుడే చిన్నారి రాణి తన తండ్రితో సొంత ఇల్లు కూడా కొని ఇస్తానని మాట ఇచ్చింది. చాలా టోర్నమెంట్లలో పాల్గొన్న తర్వాత, రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాక.. పదిహేనేళ్ల వయసులో జాతీయ జట్టుకి పిలుపు అందుకుంది. అత్యంత పిన్న వయసులో జాతీయ జట్టుకి ఎంపికైన అమ్మాయిగా రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని గొప్పగా భావించాల్సిన బంధువులు ‘దేశమంతా తిరగడం కాదు.. పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌?’ అని నిలదీసేవాళ్లట. నాన్నే అప్పుడు అండగా నిలిచాడు. నా కూతురు ఇష్టమైనన్ని రోజులు ఆడుతుందని వెన్నుతట్టాడు. కుటుంబం ఇచ్చిన అండతో తను మరింత మనసు పెట్టి ఆడసాగింది. ఆరేళ్లకే ఏకంగా దేశ జట్టుకే కెప్టెన్‌ అయ్యింది. ఓసారి తండ్రి స్నేహితుడు తన మనవరాలిని వెంటబెట్టుకొని రాణి దగ్గరికొచ్చాడు. తనని చూపిస్తూ ‘రాణిలాగే నువ్వూ గొప్ప ప్లేయర్‌ కావాలి’ అన్నాడట. ఆ క్షణం కలిగిన ఆనందం మాటల్లో వర్ణించలేను అంటుంది రాణి.

అన్నట్టుగానే మూడేళ్ల కిందట కన్నవాళ్లకి ఒక సొంతిల్లు నిర్మించి ఇచ్చింది. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ ‘హాకీనే నా సర్వస్వం. నేను స్టిక్‌ పట్టుకున్నప్పటి నుంచి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నా. అమ్మానాన్నలకు ఇల్లు ఇవ్వాలనే మొదటి లక్ష్యం పూర్తయింది. టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి గోల్డ్‌ మెడల్‌ అందించడం నా చివరి లక్ష్యం, జీవిత కల’ అంది. ఆ కల నెరవేరడానికి ఇంకో రెండు మ్యాచ్‌ల దూరమే మిగిలి ఉంది. ఈ కలల రాణి స్వప్నం నూటా నలభై కోట్ల భారతీయుల ఆశ కూడా. అది నెరవేరాలని ఆశిద్దాం!Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన