close

కథనాలు

Published : 17/02/2021 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ వేలంలో ఆకర్ష.. ఆకర్ష..

మాక్సీ, స్మిత్‌, మలన్‌పై క్రేజ్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2021 వేలానికి వేళయింది. 292 మంది భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 164 మంది భారతీయులు, 125 మంది విదేశీయులు, ముగ్గురు అసోసియేట్‌ దేశాల ఆటగాళ్లు ఇందులో పోటీపడుతున్నారు. ప్రస్తుతం జరిగేది చిన్న వేలమే అయినా స్టీవ్‌స్మిత్‌, మాక్స్‌వెల్‌, డేవిడ్‌ మలన్‌, ఆరోన్‌ ఫించ్‌ వంటి ఆటగాళ్లు ఉండటం ఆసక్తిరేకెత్తిస్తోంది. కొందరు క్రికెటర్లు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. వారు ఎవరంటే?


మాక్సీకి మాక్సిమమ్‌!

ప్రత్యర్థి బౌలర్‌ ఎంతటి మొనగాడైనా భారీ సిక్సర్లతో వణికించగల ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌. 2014 ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి అదరగొట్టాడు. పంజాబ్‌ను తొలిసారి ఫైనల్‌కు చేర్చడంలో కీలకంగా నిలిచాడు. వేలానికి వెళ్లిన ప్రతిసారీ రూ.10 కోట్ల పైచిలుకు పలికే ఈ భారీ హిట్టర్‌ చాన్నాళ్లుగా ఐపీఎల్‌లో రాణించడం లేదు. గతేడాది పంజాబ్‌ అతడిని రూ.10.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. కానీ 13 మ్యాచులాడి చేసింది 108 పరుగులే. దాంతో అతడిని ఆ జట్టు వదిలేసింది. అయితే టీమ్‌ఇండియాతో జరిగిన టీ20, వన్డే సిరీసులో అతడు విధ్వంసకరంగా ఆడాడు. మళ్లీ ఫ్రాంచైజీల కళ్లు తిప్పుకున్నాడు. బెంగళూరు, చెన్నై వంటి జట్లు అతడి కోసం చూస్తుండటంతో ఈ సారీ భారీ మొత్తమే దక్కించుకొనేలా ఉన్నాడు.


స్మిత్‌కు గిరాకీ

క్రీజులో నిలిస్తే విధ్వంసకరంగా ఆడగల క్రికెటర్‌ స్టీవ్‌స్మిత్‌. గతేడాది సారథ్యం వహించిన అతడిని రాజస్థాన్‌ రాయల్స్‌ వదిలేసింది. సంజు శాంసన్‌కు పగ్గాలు అప్పగించింది. ఇప్పటి వరకు 95 మ్యాచులు ఆడిన స్మిత్‌ 2,333 పరుగులు చేశాడు. ఒకసారి శతకమూ అందుకున్నాడు. 2020లో రూ.12.5 కోట్లు అందుకున్న అతడికి ఈ సారీ మంచి ధరే లభించొచ్చు. ధోనీతో కలిసి ఆడాడు కాబట్టి చెన్నై కొనుగోలు చేసినా ఆశ్చర్యం లేదు. గతేడాది 14 మ్యాచులు ఆడిన స్మిత్‌ 311 పరుగులు చేశాడు. టీమ్‌ఇండియాతో పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే.


మలన్‌కు క్రేజ్‌

ప్రస్తుతం టీ20ల్లో నంబర్‌వన్‌ ఆటగాడు డేవిడ్‌ మలన్‌. ఇంగ్లాండ్‌ తరఫున మూడో స్థానంలో విధ్వంసకరంగా ఆడుతున్న అతడిపై అన్ని ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కాబట్టి భారీ సొమ్ము చెల్లించేందుకు వెనుకాడకపోవచ్చు. రూ.1.5 కోట్ల కనీస ధరలో ఉన్న అతడు రూ.10కోట్ల పైచిలుకు ధర పలికే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో 19 టీ20లు ఆడిన మలన్‌ 53.44 సగటు, 149.48 స్ట్రైక్‌రేట్‌తో 855 పరుగులు చేయడం విశేషం. ఈసారి ఐపీఎల్‌ అరంగేట్రం ఖాయమే!


మిస్టరీపై మోజు

అఫ్గాన్‌ తరఫున అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే అంతర్జాతీయ క్రికెట్‌ దృష్టిని ఆకర్షించాడు ముజీబుర్‌ రెహ్మాన్‌. బిగ్‌బాష్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక టీ20ల్లో అతడు కీలక ఆటగాడిగా ఎదిగాడు. తన మిస్టరీ స్పిన్‌తో జట్టుకు అండగా మారాడు. ఐపీఎల్‌లోనూ అతడికి మంచి క్రేజ్‌ ఉంది. గతేడాది రూ.4 కోట్లు పలికిన ముజీబ్‌ను ఈసారి పంజాబ్‌ వదిలేసింది. జట్టు కూర్పులో పొసగకపోవడమే కారణం. నలుగురు విదేశీ ఆటగాళ్లకే అవకాశం ఉండటంతో అతడికి రెండుకు మించి అవకాశాలు రాలేదు. యువకులపై దృష్టి పెడుతున్న చెన్నై అతడిని భారీ ధరకు సొంతం చేసుకోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం.


ఫించ్‌.. మళ్లీ! 

భారీ సిక్సర్లు బాదేస్తూ విధ్వంసాలు సృష్టించే సత్తా ఉన్న ఆటగాడు ఆరోన్‌ ఫించ్‌. ఎందుకో తెలీదు కానీ అతడు ఏ జట్టుకూ రెండుమూడేళ్లు ఆడిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఎనిమిది ఫ్రాంచైజీలు మారాడు. సారథిగా ఆసీస్‌ తరఫున పరుగుల వరద పారిస్తున్నాడు కాబట్టి ఐపీఎల్‌ వేలంలో మంచి ధరే పలికే అవకాశం ఉంది. గతేడాది రూ.4.4 కోట్లు పెట్టి కొన్న బెంగళూరు అతడిని విడుదల చేసింది. ఆశించిన మేరకు శుభారంభాలు అందించకపోవడమే ఇందుకు కారణం. గతేడాది 12 మ్యాచులు ఆడిన అతడు 268 పరుగులే చేశాడు.


మోరిస్‌తో సమతూకం

దక్షిణాఫ్రికా పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ను కొనుగోలు చేసేందుకు ఈ సారి ఫ్రాంచైజీలు మొగ్గు చూపొచ్చు. సమయోచితంగా వికెట్లు తీయడమే కాకుండా భారీ సిక్సర్లు బాదగలగడం అతడి ప్రత్యేకత. జట్టుకు అత్యంత సమతూకం తీసుకురాగలడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 77 మ్యాచులు ఆడిన మోరిస్‌ 551 పరుగులు చేశాడు. 79 వికెట్లు పడగొట్టాడు. గతేడాది 9 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. 2020లో బెంగళూరు అతడిని రూ.10 కోట్లు వెచ్చించి తీసుకుంది.


దూబె.. చెప్పలేం?

రెండేళ్లుగా శివమ్‌ దూబెను ప్రోత్సహించిన బెంగళూరు ఈ సారి అతడిని వదిలేసింది. గతేడాది అతడికి రూ.5 కోట్లు చెల్లించిందని సమాచారం. పేస్‌బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌గా అతడికి మంచి పేరుంది. పొడగరి కావడంతో సునాయసంగా సిక్సర్లు బాదగలడు. ఎడమచేతి వాటం కావడంతో జట్టుకు సమతూకం తీసుకురాగలడు. ఈ ఉద్దేశంతోనే కోహ్లీ అతడిని ఆదరించాడు. కానీ ధర ఎక్కువని భావించడంతో వదిలేసినట్టు కనిపిస్తోంది. మొత్తంగా 13 ఐపీఎల్‌ మ్యాచులాడిన దూబె 169 పరుగులు చేశాడు. 11 ఓవర్లు వేసి 4 వికెట్లు పడగొట్టాడు. విధ్వంసకరంగా ఆడిన సందర్భాలైతే లేవు.


ఉమేశ్‌ది అనుభవం

కొన్నేళ్లుగా టీమ్‌ఇండియాకు సేవలందిస్తూ ఐపీఎల్‌లో అదరగొడుతున్న క్రికెటర్‌ ఉమేశ్‌ యాదవ్‌. ఇప్పటి వరకు లీగులో 121 మ్యాచులు ఆడి 119 వికెట్లు తీశాడు. కొన్ని సందర్భాల్లో తడబడినప్పటికీ అవసరమైనప్పుడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. గతేడాది రూ.4.2 కోట్లు అందుకున్న అతడిని బెంగళూరు విడుదల చేసింది. కొన్ని ఫ్రాంచైజీలు అతడిని భారీ ధరకు కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు. భారత పిచ్‌లపై అతడికి మంచి అవగాహన ఉండటమే ఇందుకు కారణం.


అర్జున్‌ ఆకర్షణ

ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో ప్రత్యేక ఆకర్షణ సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌ అనడంలో సందేహం లేదు. ఎడమ చేతివాటం పేసర్‌గా అతడికి మంచిపేరే ఉంది. బ్యాటింగూ చేయగలగడం మరో ప్రత్యేకత. క్లబ్‌, లీగ్‌ క్రికెట్లో అర్జున్‌ క్రేజ్‌ ఫర్వాలేదు. అయితే ముంబయి జట్టు తరఫున అతడికి చాలినన్ని అవకాశాలైతే రాలేదు. బహుశా ముంబయి ఇండియన్స్‌ అతడిని తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. అతడి కనీస ధర రూ.20 లక్షలు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన