close

కథనాలు

Published : 18/02/2021 22:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ వేలం: ఈ హైలైట్స్‌ చూశారా?

మొత్తం ఖర్చు రూ.145 కోట్లు.. ఐదుగురికే రూ.69  కోట్లు

(Images: ipl)

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంచలనాలకు వేదికైన ఐపీఎల్‌-2021 వేలం ముగిసింది. ఎనిమిది ఫ్రాంచైజీలు ఒకటిని మించి మరొకటి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. తమ జట్ల అంతరాలను పూడ్చగల క్రికెటర్లను ఎంపిక చేసుకున్నాయి. 164 భారతీయులు, 125 విదేశీయులు, ముగ్గురు అసోసియేట్‌ సభ్య దేశాల ఆటగాళ్లు పోటీపడ్డారు. ఫ్రాంచైజీలు రూ.145.30 కోట్లు వెచ్చించి 57 మందిని సొంతం చేసుకున్నాయి. 22 విదేశీ ఆటగాళ్లను దక్కించుకున్నాయి. ఈ ఐపీఎల్‌ వేలం విశేషాలు మీకోసం..

* వేలంలో మొదటి పేరు కరుణ్‌ నాయర్‌. ఆఖరి పేరు అర్జున్‌ తెందూల్కర్‌. కరుణ్‌ను తొలుత ఎవరూ కొనుగోలు చేయలేదు. రెండో దఫాలో కోల్‌కతా సొంతం చేసుకుంది. అర్జున్‌ను ముంబయి కనీస ధర రూ.20 లక్షలకు తీసుకుంది.

* దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్‌ మోరిస్‌ ఐపీఎల్‌ వేలంలోనే అత్యధిక ధర సొంతం చేసుకున్నాడు. రూ.16.25 కోట్లకు అతడిని రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది.

* వేలం తర్వాత రాజస్థాన్‌ (24), బెంగళూరు (22) కాకుండా మిగతా అన్ని ఫ్రాంచైజీల్లో 25 మంది ఆటగాళ్లు ఉన్నారు.

* వేలం ముగిసిన తర్వాత పంజాబ్‌ కింగ్స్‌ వద్ద అత్యధికంగా రూ.18.80 కోట్లు మిగిలుంది. ఆ తర్వాత రాజస్థాన్‌ (రూ.13.65 కోట్లు), హైదరాబాద్‌ (రూ.6.95 కోట్లు) ఉన్నాయి.

* అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ముగ్గురిని పంజాబ్‌ సొంతం చేసుకుంది. చెన్నై, బెంగళూరు చెరో ఇద్దరిని, రాజస్థాన్‌ ఒకరిని తీసుకుంది.

* జాతీయ జట్టుకు ఆడకుండా ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడు కృష్ణప్ప గౌతమ్‌. రూ.9.25 కోట్లు పెట్టి చెన్నై కొనుగోలు చేసింది.

* తమిళనాడు యువ ఆటగాడు షారుక్‌ ఖాన్‌ను పంజాబ్‌ రూ.6.95 కోట్లకు తీసుకోవడం ప్రత్యేకం.

* ఈ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు ఆరుగురు కన్నా ఎక్కువ మందిని తీసుకోగా ఒక్క సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రమే ముగ్గుర్ని తీసుకుంది. అందులో కేదార్‌ జాదవ్‌ కోసం మాత్రమే అత్యధికంగా రూ.2 కోట్లు వెచ్చించింది.

* ఈ వేలంలో హైదరాబాద్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ముంబయి కనీసం ఒక్క బ్యాట్స్‌మన్‌నూ తీసుకోలేదు. ఎక్కువగా ఆల్‌రౌండర్లు, తక్కువగా బౌలర్లను తీసుకున్నాయి.

* టీమ్‌ఇండియా నయావాల్‌, టెస్టు స్పెషలిస్టు చెతేశ్వర్‌ పుజారా మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెడుతున్నాడు. 2014లో అతడు పంజాబ్‌కు ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడే చెన్నైకి ఆడనున్నాడు. రూ.50 లక్షలతో ధోనీసేన అతడిని కొనుగోలు చేసింది.

* భారీ ధర పలుకుతారని భావించిన జేసన్‌ రాయ్‌, అలెక్స్‌ హేల్స్‌, ఆరోన్ ఫించ్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.

* చెన్నై విడుదల చేసిన వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దక్కించుకుంది. తొలుత అతడిని కొనుగోలు చేయలేదు. రెండో దఫాలో సొంతం చేసుకుంది.

* తెలుగు కుర్రాడు హరిశంకర్‌ రెడ్డి (బౌలర్‌)ను చెన్నై సూపర్‌కింగ్స్‌ రూ.20 లక్షలకు తీసుకుంది.

* 2013 నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ ఐపీఎల్‌ వేలంలోనూ ఒక బ్యాట్స్‌మెన్‌ అత్యధిక ధర పలకలేదు. ప్యాట్‌ కమిన్స్‌ మినహా అంతా ఆల్‌రౌండర్లే కావడం గమనార్హం.

* ఫ్రాంచైజీలు ఖర్చు చేసిన మొత్తంలో దాదాపుగా 50% ఐదుగురు ఆటగాళ్లకే పోయింది. మోరిస్‌, జేమిసన్‌, మాక్స్‌వెల్‌, రిచర్డ్‌సన్‌, కృష్ణప్ప గౌతమ్‌ల మొత్తం ధర రూ.68.75 కోట్లు.

* కోల్‌కతా తరఫున వేలానికి షారుక్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌, జుహీచావ్లా కుమార్తె జాహ్నవి మెహతా హాజరవ్వడం విశేషం.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన