close

కథనాలు

Published : 02/04/2021 09:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌ నాయకా.. ఎలా నడిపిస్తావో నీవిక! 

సీజన్‌ ముందు ఏ సారథి ఫామ్‌ ఎలా ఉందంటే..

నడిపించే నాయకుడిని బట్టే బృందం ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అతడు చూపిన తోవలోనే మిగతావాళ్లు నడుస్తారు. అతడు ప్రదర్శించే వైఖరినే అందరూ అనుసరిస్తారు. అతడు దూకుడుగా ఉంటే బృందమంతా సై.. సై అంటుంది. అతడికి నిరుత్సాహం ఆవహిస్తే జట్టంతా కుంగిపోతుంది. మరికొద్ది రోజుల్లో ఆరంభమవుతున్న ఐపీఎల్‌లో జట్ల సారథులే కీలకం కానున్నారు. మరి ఏ కెప్టెన్‌ పరిస్థితి ఎలా ఉంది?


(Images:IPL)

‘హిట్‌’ కెప్టెన్‌ రోహిత్‌

ఐపీఎల్‌లో తిరుగులేని జట్టు ముంబయి ఇండియన్స్‌. దానిని నడిపిస్తున్న సారథి రోహిత్‌ శర్మ. ఒకటో రెండో కాదు ఏకంగా ఐదు సార్లు ముంబయిని విజేతగా నిలిపాడు. 116 మ్యాచులకు నేతృత్వం 70 సార్లు గెలిపించాడు. అతడి విజయాల శాతం 60.34. ఇక లీగ్‌ మొత్తంలో 200 మ్యాచుల్లో 31.31 సగటు, 130 స్ట్రైక్‌రేట్‌తో 5,230 పరుగులు సాధించాడు హిట్‌మ్యాన్‌. ఒక శతకం, 39 అర్ధశతకాలు, 213 సిక్సర్లు బాదేశాడు. 2021లో ఫామ్‌ సైతం బాగుంది. సిడ్నీ, బ్రిస్బేన్‌ టెస్టుల్లో అర్ధశతకాలు, చెన్నైలో కష్టతరమైన పిచ్‌పై శతకం బాదేశాడు. టీ20ల్లో అర్ధశతకం అందుకున్నా వన్డేల్లో మెరుగైన స్కోరు చేయలేదు. అతడి లయ మాత్రం బాగుంది.


‘పంత్‌’  కిరీటంలో మరో వజ్రం

అటు శిఖర స్థాయి.. ఇటు పతన స్థాయి.. రెండింటినీ తక్కువ వయసులో చూసిన ఆటగాడు రిషభ్‌ పంత్‌. శ్రేయస్‌ గాయపడటంతో ఈ సారి దిల్లీ క్యాపిటల్స్‌కు సారథిగా ఎంపికయ్యాడు. గతంలో దేశవాళీ క్రికెట్లో దిల్లీకి నాయకత్వం వహించిన అనుభవం అతడి సొంతం. ఐపీఎల్‌లో 68 మ్యాచులాడిన పంత్‌ 35.23 సగటు, 151 స్ట్రైక్‌రేట్‌తో 2,079 పరుగులు చేశాడు. ఒక శతకం, 12 అర్ధశతకాలు, 103 సిక్సర్లు ఖాతాలో ఉన్నాయి. ప్రత్యర్థి బౌలర్‌ ఎవరైనా భారీ హిట్టింగ్‌తో దడపుట్టించే అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే 2021 ఆరంభం నుంచి పంత్‌ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. సిడ్నీ, బ్రిస్బేన్‌ టెస్టుల్లో 97, 89*తో సిరీస్‌ అందించాడు. చెన్నైలో ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో 91, 58*తో అదరగొట్టాడు. అహ్మదాబాద్‌లోనైతే శతకం బాదేశాడు. టీ20ల్లో ఫర్వాలేదనిపించి.. ఆఖరి రెండు వన్డేల్లో 77, 78తో చుక్కలు చూపించాడు.


ఐపీఎల్‌ ‘కింగ్‌’ ఎప్పుడవుతాడో!

ఛేదన రారాజు విరాట్‌ కోహ్లీ ఆట, నాయకత్వం గురించి విశ్లేషణలు అవసరం లేదు. అంతర్జాతీయ వేదికపై టీమ్‌ఇండియా సారథిగా గొప్ప విజయాలు అందించాడు. ఐపీఎల్‌లో మాత్రం బెంగళూరుకు ట్రోఫీ అందించలేకపోతున్నాడు. సారథిగా 125 మ్యాచుల్లో 57 గెలిచి 64 ఓడాడు. 4 ఫలితం తేల్లేదు. ఆటగాడిగా 192 మ్యాచుల్లో 38.16 సగటు, 130 స్ట్రైక్‌రేట్‌తో 5,878 పరుగులు చేశాడు. 5 శతకాలు, 39 అర్ధశతకాలు, 201 సిక్సర్లు బాదేశాడు. 2021లో ఫామ్‌ అందుకున్నాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 72, 62తో అలరించాడు. ఆ తర్వాత రెండు డక్‌లతో నిరాశ కలిగించినా టీ20ల్లో 73*, 77*, 80*, వన్డేల్లో 56, 66తో దుమ్మురేపాడు.


‘రాహుల్‌’ భల్లే.. భల్లే

ఇప్పటి వరకు ట్రోఫీ గెలవని పంజాబ్‌ పేరు సహా అన్నీ మార్చేసుకుంది. కొత్తరూపు సంతరించుకుంది. కేఎల్‌ రాహుల్‌ నాయకత్వంపై ఆశలెన్నో పెట్టుకుంది. గతేడాది సారథిగా 14 మ్యాచుల్లో 6 గెలిచి 8 ఓడాడు. వరుసగా ఐదు ఓటముల తర్వాత ఐదు విజయాలు నమోదు చేయడం ప్రత్యేకం. కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా దుమ్మురేపాడు. 670 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. మొత్తం 81 మ్యాచులాడిన రాహుల్‌ 44.86 సగటు, 135 స్ట్రైక్‌రేట్‌తో 2,647 పరుగులు చేశాడు. 2 శతకాలు, 21 అర్ధశతకాలు, 104 సిక్సర్లు ఖాతాలో ఉన్నాయి. గాయంతో ఆసీస్‌ నుంచి వచ్చేసిన రాహుల్‌ ఇంగ్లాండ్‌తో టీ20ల్లో 1, 0, 0, 14తో ఇబ్బంది పడ్డాడు. కానీ వన్డేల్లో 62*, 108తో అదరగొట్టి ఫామ్‌ అందుకున్నాడు.


‘సంజు’ గుభాళించేనా?

అనుభవజ్ఞులున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు సంజు శాంసన్‌ సారథిగా ఎంపికయ్యాడు. అత్యంత పిన్న వయసులో కేరళ రంజీ జట్టుకు నాయకత్వం అందించిన అనుభవం ఉంది. కెప్టెన్‌ అయ్యాక పరుగులు వరద పారించాడు. కండబలంతో భారీ సిక్సర్లు బాదే సంజు ఐపీఎల్‌లో మొత్తం 107 మ్యాచులాడి 27.78 సగటు, 133 స్ట్రైక్‌రేట్‌తో 2,584 పరుగులు సాధించాడు. 2 శతకాలు, 13 అర్ధశతకాలు, 115 సిక్సర్లు బాదేశాడు. కీపింగ్‌ (52 క్యాచులు, 6 స్టంపౌట్లు)లోనూ అదరగొట్టాడు. తనదైన రోజున విధ్వంసం సృష్టించే శాంసన్‌ ప్రధాన లోపం నిలకడ కోల్పోవడం. పోటీ వల్ల జాతీయ జట్టులో అవకాశాలు రావడం లేదు. 2021లో దేశవాళీ క్రికెట్లో భారీ పరుగులేమీ చేయలేదు. టీ20ల్లో హరియాణాపై 51, లిస్ట్‌-ఏలో రైల్వేస్‌పై 61 మాత్రమే చేశాడు.


‘ధోనీ’కి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేమి

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రెండో జట్టు చెన్నై సూపర్‌కింగ్స్‌. అందుకు కారణం ఎంఎస్‌ ధోనీ నాయకత్వమే. సారథిగా 3 సార్లు ట్రోఫీ అందించాడు. గతేడాది మినహాయిస్తే ప్రతిసారీ ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. అందరి కన్నా ఎక్కువగా 174 మ్యాచులకు సారథ్యం వహించాడు. 105 గెలిచి 68 ఓడాడు. 1 మ్యాచ్‌ ఫలితం తేల్లేదు. మొత్తంగా 204 మ్యాచుల్లో 40.99 సగటు, 136.75 స్ట్రైక్‌రేట్‌తో 4,632 పరుగులు సాధించాడు. 23 అర్ధశతకాలు, 216 సిక్సర్లు ఖాతాలో ఉన్నాయి. కీపర్‌గా 113 క్యాచులు, 39 స్టంపౌట్లు చేశాడు. అన్ని ఫార్మాట్లలో క్రికెట్‌కు గుడ్‌బై చేప్పేసిన ధోనీకి సరైన మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదు. గతేడాది 14 మ్యాచుల్లో 200 మాత్రమే చేశాడు. అప్పటి నుంచి పోటీ క్రికెట్‌ ఆడలేదు.


‘వార్నర్‌’ బాహుబలి

తన విధ్వంసకర బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తొలి ట్రోఫీ అందించాడు డేవిడ్‌ వార్నర్‌. 2016లో విరాట్‌ కోహ్లీ దూకుడును నిలువరించాడు. బాల్‌ ట్యాంపరింగ్‌తో ఒక ఏడాది టోర్నీకి దూరమైన అతడు.. తిరిగి పగ్గాలు అందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడు అతడే కావడం గమనార్హం. మొత్తం 142 మ్యాచుల్లో 42.71 సగటు, 141.54 స్ట్రైక్‌రేట్‌తో 5,254 పరుగులు చేశాడు. 4 శతకాలు, 48 అర్ధశతకాలు 195 సిక్సర్లు బాదేశాడు. కెప్టెన్‌గా 61 మ్యాచుల్లో 34 గెలిచి 26 ఓడాడు. స్వదేశంలో టీమ్‌ఇండియా సిరీస్‌లో అతడు గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అయితే మార్చిలో లిస్ట్‌-ఏ, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడాడు. 87, 24, 69, 108తో ఫామ్‌లోకి వచ్చాడు. సరైన మ్యాచ్‌ ప్రాక్టీసూ లభించింది!


‘మోర్గాన్’ మోత మోగిస్తాడా?

రెండు సార్లు విజేత కోల్‌కతా నైడర్స్‌ ఇంగ్లాండ్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించిన ఇయాన్‌ మోర్గాన్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. తమకు మూడో కప్పు అందిస్తాడని ధీమాగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో నాయకుడిగా మోర్గాన్‌కు మంచి అనుభవం ఉంది. ప్రత్యర్థిని చక్కగా అంచనా వేసి బౌలర్లను ప్రయోగించడంలో దిట్ట. ప్రశాంతంగా ఉంటాడు. బ్యాటింగ్లోనూ తిరుగులేదు. ఐపీఎల్‌లో 66 మ్యాచులాడిన అతడు 25.44 సగటు, 126.31 స్ట్రైక్‌రేట్‌తో 1,272 పరుగులు చేశాడు. 5 అర్ధశతకాలు, 58 సిక్సర్లు బాదేశాడు. గతేడాది సారథిగా 7 మ్యాచుల్లో 3 గెలిచి 4 ఓడాడు. 2021లో అతడి ఫామ్‌ సాధారణమే. కోహ్లీసేనతో 5 టీ20ల్లో రెండింట్లో బ్యాటింగ్‌కు రాలేదు. మిగతా మ్యాచుల్లో 28, 4, 1 మాత్రమే చేశాడు. తొలి వన్డేలో 22 మాత్రమే చేశాడు. గాయంతో ఆఖరి రెండు వన్డేలకు దూరమయ్యాడు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన