close

కథనాలు

Published : 10/04/2021 12:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరంభ ఓటమి ముంబయికి వరమా!

వరుసగా తొమ్మిదో సీజన్లో కొనసాగిన బలహీనత

ఇంటర్నెట్‌ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఎదురేలేని జట్టు. ఇంకా చెప్పాలంటే ఐదుసార్లు విజేత. ఈ సీజన్‌లోనూ డిఫెండింగ్‌ ఛాంపియనే ఫేవరెట్‌ అనడంలో ఎవ్వరికీ సందేహాల్లేవు. అదెంత బలమైన జట్టే అయినా ఓ బలహీనతను మాత్రం వదల్లేకపోతోంది.

లీగ్‌లో ఏ జట్టైనా శుభారంభం చేయాలని భావిస్తే రోహిత్‌ సేన మాత్రం ఓటమితో మొదలుపెడుతోంది. ఒకటో.. రెండో కాదు. ఏకంగా తొమ్మిదోసారి వరుసగా ఆరంభ పోరులో ఓడిపోయింది. బెంగళూరు చేతిలో ఓడి తమకు అచ్చొచ్చిన (బహుశా!) దారినే అనుసరించింది!

ఎందుకంటే గతంలో ఎనిమిది సార్లు తొలి మ్యాచులో ఓటమి పాలైన ముంబయి ఏకంగా ఐదుసార్లు విజేతగా అవతరించింది. 2013 నుంచి తొలిపోరులో ఆ జట్టు గెలిచిందే లేదు. సెంటిమెంట్‌ను కొనసాగించిన నేపథ్యంలో ఈ సారీ ట్రోఫీ రోహిత్‌ సేనదేనని అభిమానుల విశ్వాసం!

ఆరంభం.. ఎప్పుడెలా?

* 2013లో బెంగళూరు నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఛేదించలేదు. దినేశ్‌ కార్తీక్‌ (60; 37 బంతుల్లో 3×4, 4×6) పోరాడినా 20 ఓవర్లకు 154/5 మాత్రమే చేసింది. ఈ ఏడాది ముంబయి తొలి ట్రోఫీ ముద్దాడింది.

* 2014లో అబుదాబి వేదికగా కోల్‌కతాతో తలపడింది. గంభీర్‌ సేన నిర్దేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో 122/7కే పరిమితమైంది. అంబటి రాయుడు (48; 40 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. ఎలిమినేటర్లో చెన్నై చేతిలో ఓడింది.

* 2015లో ఈడెన్‌ వేదికగా కోల్‌కతాతో తలపడింది. రోహిత్‌ (98; 65 బంతుల్లో 12×4, 4×6) మెరవడంతో 168/3తో నిలిచింది. గంభీర్‌ సేన ఈ లక్ష్యాన్ని 18.3 ఓవర్లకే ఛేదించింది. గౌతీ (57), మనీశ్‌ (40), సూర్యకుమార్‌ (46) రాణించారు. ఫైనల్లో చెన్నైని ఓడించిన ముంబయి రెండో ట్రోఫీ అందుకుంది.

* 2016లో రైజింగ్‌ పుణె సూపర్ ‌జెయింట్స్‌ చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడింది. వాంఖడేలో ముంబయి నిర్దేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని పుణె 14.4 ఓవర్లకే ఛేదించింది. ఈ ఏడాది ముంబయి ప్లేఆఫ్స్‌ చేరుకోలేదు.

* 2017లో మళ్లీ రైజింగ్‌ పుణె చేతిలోనే 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ముంబయి నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని పుణె ఒక బంతి మిగిలుండగా 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫైనల్లో ఇదే పుణెపై పరుగు తేడాతో గెలిచి మూడోసారి ట్రోఫీని ముద్దాడింది.

* 2018లో చెన్నై చేతిలో వికెట్‌ తేడాతో ఓడింది. ముంబయి నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని చెన్నై ఛేదించింది. ఒక బంతి మిగిలుండగా ఒక వికెట్‌ తేడాతో గెలుపొందింది. ఈ సారీ ముంబయి ప్లేఆఫ్స్‌ చేరుకోలేదు.

* 2019లో తొలి మ్యాచులో దిల్లీతో తలపడింది. 37 పరుగుల తేడాతో ఓడింది. రిషభ్‌ పంత్‌ (78; 27 బంతుల్లో 7×4, 7×6) చెలరేగడంతో దిల్లీ 213/6 చేసింది. ఛేదనలో యువీ (53; 35 బంతుల్లో 5×4, 3×6) చెలరేగినా 176 పరుగులకే ఆలౌటైంది. ఫైనల్లో చెన్నైపై పరుగు తేడాతో గెలిచి నాలుగో టైటిల్‌ గెలిచింది.

* 2020లో బలహీనంగా ఉన్న చెన్నై చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడింది. అబుదాబి వేదికగా జరిగిన మ్యాచులో తొలుత ముంబయి 162/9తో నిలిచింది. అంబటి రాయుడు (71), డుప్లెసిస్‌ (58) ఆ లక్ష్యాన్ని ఛేదించారు. ఫైనల్లో దిల్లీని 5 వికెట్ల తేడాతో ఓడించిన ముంబయి ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఐదో ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

* తాజా (2021) సీజన్లో తొలి మ్యాచులోనూ ముంబయిది అదే దారి. రోహిత్‌సేన నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆఖరి బంతికి ఛేదించింది. ఏబీ డివిలియర్స్‌ (48), మాక్స్‌వెల్‌ (39) రాణించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన