close

కథనాలు

Updated : 10/04/2021 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ధోనీ×పంత్‌: గురుశిష్యుల్లో గెలుపెవరిది?

దిల్లీలో జోష్‌.. చెన్నైకి ప్రాక్టీస్‌ లేమి

ఒకవైపు సాధించేందుకు ఇంకేమీ లేని దిగ్గజం.. ఇంకోవైపు నిరూపించుకోవాలని ఆరాట పడుతున్న యువ కెరటం. ఒకరేమో 3 ఐసీసీ, 3 ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచిన నాయకుడు. ఇంకొకరేమో తన జట్టుకు తొలి ఐపీఎల్‌ ట్రోఫీ అందించాలని కంకణం కట్టుకున్న కొత్త సారథి‌.

ఇద్దరూ వికెట్‌ కీపర్లే.. ఇద్దరూ కెప్టెన్లే.. ఇద్దరూ ఫినిషర్లే. ఇద్దరిలో ఒకరేమో గురువు. మరొకరేమో శిష్యుడు. ఒకరంటే ఒకరికి ప్రేమాభిమానాలే. వారే ఎంఎస్‌ ధోనీ, రిషభ్‌ పంత్‌. ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్లుగా తలపడుతున్న వీరి పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఏ జట్టు పరిస్థితి ఏంటి?


ఆధిపత్యం చెన్నైదే

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ మధ్య ఆసక్తికరమైన పోరాటాలు జరిగాయి. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 23 సార్లు తలపడటం గమనార్హం. వీటిలో 15 విజయాలతో ధోనీసేనదే పైచేయి. దిల్లీ 8 గెలిచింది. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. కాగా చివరి ఐదు మ్యాచులు మాత్రం హోరాహోరీగా సాగాయి. 2020లో రెండు మ్యాచుల్లోనూ దిల్లీ విజయ దుందుభి మోగించింది. 2019లో పూర్తిగా ధోనీసేనదే ఆధిపత్యం. రెండు లీగు మ్యాచులు, రెండో క్వాలిఫయర్‌లో దిల్లీని చిత్తు చేసింది.


దిల్లీ ఆటగాళ్లలో జోష్‌

ప్రస్తుతం యువకులు, సీనియర్లతో దిల్లీ పటిష్ఠంగా ఉంది. జట్టు మేళవింపు, కోచింగ్‌ అద్భుతంగా ఉన్నాయి. ఆటగాళ్లంతా జోరు మీదున్నారు. ఇంగ్లాండ్‌ వన్డేల్లో శిఖర్‌ ధావన్‌ దంచికొట్టాడు. మరో ఓపెనర్‌ పృథ్వీ షా తప్పుల్ని సరిదిద్దుకొని వీరోచిత ఫామ్‌లో ఉన్నాడు. విజయ్‌ హజారేలో 4 శతకాలతో 827 పరుగులు చేశాడు. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై ఏకంగా సిరీసులే గెలిపించాడు. మునుపెన్నడూ లేనంత ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. గతేడాది రాణించిన స్టాయినిస్‌, హెట్‌మైయిర్‌కు ఈసారి సామ్‌ బిల్లింగ్స్‌ జత కలిశాడు. ఇక విలువైన సీనియర్లు జింక్య రహానె, స్టీవ్‌స్మిత్‌ అండగా ఉన్నారు.

బౌలింగ్‌ పరంగానూ దిల్లీకి తిరుగులేదు. దక్షిణాఫ్రికా ద్వయం కాగిసో రబాడా, ఆన్రిచ్‌ నార్జె గతేడాది ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. వేగవంతమైన బంతులు విసిరారు. కొన్ని రోజుల క్రితమే భారత్‌కు చేరుకున్న వీరిద్దరూ క్వారంటైన్‌లో ఉన్నారు. బహుశా తొలి మ్యాచ్‌ ఆడకపోవచ్చు. ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, క్రిస్‌వోక్స్‌ కొత్త బంతిని పంచుకుంటారు. కరోనాతో అక్షర్‌ పటేల్‌ ఐసోలేషన్‌లో ఉండటంతో స్పిన్‌ విభాగంలో అశ్విన్‌ కీలకమవుతాడు. ధోనీపై అతడు మంచి వ్యూహాలు రచించగలడు.


ధోనీసేన.. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేమి

కాగితంపై చెన్నై బలంగా కనిపిస్తున్నా బరిలోకి దిగాక ఎలా ఉంటుందో తెలియదు. వ్యూహరచనలో అగ్రగామి ఎంఎస్ ‌ధోనీకి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేదు. అందుకే గతేడాది మ్యాచ్‌ ఫినిషర్‌ పాత్రను రవీంద్ర జడేజా పోషించాడు. ఆ తర్వాత గాయపడటంతో టీమ్‌ ఇండియాకు దూరమయ్యాడు. మళ్లీ ఇప్పుడే మైదానంలో అడుగుపెట్టాడు. సురేశ్‌ రైనా రాకతో జట్టు బలం పెరిగింది. అంబటి రాయుడు ఆడితే తిరుగులేదు. కానీ వీరిద్దరూ జనవరిలో ఆఖరి మ్యాచ్‌ ఆడటం గమనార్హం. డుప్లెసిస్‌ చివరగా పీఎస్‌ఎల్‌లో ఆడాడు. డ్వేన్‌ బ్రావో పరిస్థితీ అంతే. మొయిన్‌ అలీ టీమ్‌ఇండియా సిరీస్‌కు ఎంపికైనా తుది జట్టులో సరైన అవకాశాలు రాలేదు. కేవలం సామ్‌ కరన్‌, శార్దూల్‌ ఠాకూర్‌ మాత్రమే ఫామ్‌లో ఉన్నారు. దీపక్‌ చాహర్‌కూ అవకాశాలు రాలేదు. కోట్లు పెట్టి కొన్న కృష్ణప్ప గౌతమ్‌ ఏం చేస్తాడో చూడాలి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన