విధేయత.. అనుభవం.. సామాజిక సమీకరణాలు
close

ప్రధానాంశాలు

Updated : 06/05/2021 05:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విధేయత.. అనుభవం.. సామాజిక సమీకరణాలు

మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు తెరాస ప్రామాణికాలు

ఈనాడు, హైదరాబాద్‌: విధేయత, అనుభవం, సామాజిక సమీకరణాల ప్రాతిపదికన రాష్ట్రంలోని వరంగల్‌ మహా నగరపాలక సంస్థ, ఖమ్మం నగరపాలికల్లో మేయర్లు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, కొత్తూరు, నకిరేకల్‌ పురపాలక సంఘాల్లో ఛైర్‌పర్సన్లను ఎంపిక చేయాలని తెరాస అధిష్ఠానం నిర్ణయించింది. శుక్రవారం ఎన్నికలు జరగనుండగా.. ఏకాభిప్రాయ సాధన, ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను పరిశీలకులుగా నియమించారు. ఇప్పటికే వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నల్గొండ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారు సూచించిన పేర్లతో పాటు పార్టీ శ్రేణుల నుంచీ సమాచారం తీసుకున్నారు. ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా ఆరా తీశారు. ఇద్దరు లేదా ముగ్గురు అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్‌ కవర్లను అధిష్ఠానం గురువారం పార్టీ పరిశీలకులకు అందజేస్తుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పరిశీలకులు సమావేశమై వారి అభిప్రాయాలను సేకరిస్తారు. అధిష్ఠానం ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేసి, శుక్రవారం ఉదయం వారికి తెలియజేస్తారని తెలుస్తోంది.
పరిశీలకులు వీరే..
* వరంగల్‌- మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌
* ఖమ్మం- మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, తెరాస ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి
* సిద్దిపేట- రవీందర్‌సింగ్‌ (కరీంనగర్‌ మాజీ మేయర్‌), వంటేరు ప్రతాప్‌రెడ్డి (అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌)
* కొత్తూరు- మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌
* అచ్చంపేట- మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
* నకిరేకల్‌- తెరాస ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్‌రావు
*  జడ్చర్ల- శ్రీనివాస్‌రెడ్డి (పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌)Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన