close

కథనాలు

Updated : 04/04/2021 14:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పంత్‌కే పగ్గాలెందుకు?  

సీనియర్లున్నా దిల్లీ ఎందుకీ నిర్ణయం..

 (Photo: Delhi Capitals Twitter)

ఐపీఎల్‌లో కప్పు సాధించని జట్లలో దిల్లీ క్యాపిటల్స్‌ ఒకటి. శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాక మెరుగైన ఆ జట్టు గతేడాది తొలిసారి ఫైనల్స్‌కు చేరింది. దాంతో ఇప్పుడు కూడా మరింత బాగా ఆడి టైటిల్‌ సాధించాలనే పట్టుదలతో ఉంది. అయితే, ఇంగ్లాండ్‌తో తొలి వన్డే సందర్భంగా శ్రేయస్‌ అనూహ్యంగా గాయపడటంతో ఈ సీజన్‌కు దూరమయ్యాడు. అతడికి ఏప్రిల్‌ 8న శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ క్రమంలోనే దిల్లీ క్యాపిటల్స్‌ రిషభ్‌పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. జట్టులో ధావన్‌, రహానె, అశ్విన్‌, స్మిత్‌ వంటి అనుభవజ్ఞులున్నా ఈ యువ ఆటగాడికే ఎందుకు పగ్గాలిచ్చిందో తెలుసుకుందాం..


యువకుడు+దూకుడు..

 (Photo: Rishabh Pant Twitter)

పంత్‌ 2016 నుంచీ ఐపీఎల్‌ ఆడుతున్నాడు. తొలి సీజన్‌లో ఫర్వాలేదనిపించిన అతడు తర్వాత క్రమంగా మెరుగయ్యాడు. 2018లో ఏకంగా 684 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్చపరిచాడు. దీంతో టీమ్‌ఇండియాకు ఎంపికై ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అదరగొట్టాడు. అక్కడ శతకాలు సాధించడంతో ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే, తర్వాత అతడిపై భారీ అంచనాలు పెరిగిపోవడంతో ఒత్తిడికి గురయ్యాడు. దానికితోడు పేలవ షాట్ల ఎంపిక, ఫామ్‌లేమి కారణాలతో కొద్దికాలం సతమతమయ్యాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్‌ఇండియా క్లిష్టపరిస్థితుల్లో ఉండగా పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దాంతో ఒక్కసారిగా హీరో అయిపోయాడు. తర్వాత ఇంగ్లాండ్‌ సిరీస్‌లో మరోసారి రెచ్చిపోయాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే మరింత మెరుగవుతాడని దిల్లీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు.


కీపింగ్‌ = 360..

 (Photo: Delhi Capitals Twitter)

టీమ్‌ఇండియాలో బ్యాట్స్‌మన్‌గా, వికెట్‌ కీపర్‌గా ధోనీ ఎంత విజయవంతమయ్యాడో తెలిసిందే. దానికి ముఖ్య కారణం వికెట్ల వెనుక నుంచి మైదానం, మ్యాచ్‌ పరిస్థితుల్ని మొత్తం అర్థం చేసుకోవడమే. ఫీల్డింగ్‌ చేసే కెప్టెన్‌ కన్నా కీపర్‌గా ఉండే కెప్టెన్‌కే మైదానంలో పరిస్థితులు బాగా అర్థమవుతాయి. ధోనీ కూడా అదే చేసేవాడు. వికెట్ల వెనుక నుంచే బ్యాట్స్‌మెన్‌ కదలికల్ని గమనించేవాడు. అలా బౌలర్లను, ఫీల్డర్లను సమన్వయం చేసుకొని వికెట్లు రాబట్టేవాడు. ఈ సింపుల్‌ ఫార్ములానే దిల్లీ కూడా అనుసరించి ఉండొచ్చు. అయితే, పంత్‌ ఇదివరకు కీపింగ్‌లో తడబాటు కనిపించేది. దాంతో ఒకానొక సందర్భంలో టీమ్‌ఇండియాలో చోటు కూడా కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. లాక్‌డౌన్‌ తర్వాత బ్యాటింగ్‌తో పాటే కీపింగ్‌ పైనా శ్రద్ధ పెట్టిన అతడు బాగా మెరుగయ్యాడు. అలా యూఏఈలో జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌లో దిల్లీ కీపర్‌గా ఆకట్టుకొని తర్వాత కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. ఇలా వికెట్‌ కీపర్‌గానూ ఇతర ఆటగాళ్లకంటే మ్యాచ్‌ పరిస్థితుల్ని బాగా అర్థం చేసుకుంటాడని దిల్లీ కెప్టెన్సీ అప్పగించి ఉండొచ్చు.


సీనియర్లు = 0..

 (Photo: Delhi Capitals Twitter)

దిల్లీ జట్టులో శిఖర్‌ ధావన్‌, స్టీవ్‌స్మిత్‌, అజింక్య రహానె, రవిచంద్రన్‌ అశ్విన్‌ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. వీరికి ఐపీఎల్‌లో పలు ఫ్రాంఛైజీలకు కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది. అయితే, వీరు అక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయారనే విషయం గమనించాల్సి ఉంది. దాంతో ఆయా ఫ్రాంఛైజీలు వారిని తొలగించి ఇతర కెప్టెన్లను పెట్టుకున్నాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ధావన్‌ గతంలో కెప్టెన్‌గా పని చేయగా, స్మిత్‌, అజింక్య రాజస్థాన్ రాయల్స్‌కు కొనసాగారు. ఈ సీజన్‌కు ముందు రాజస్థాన్‌ స్మిత్‌ను వదిలేసుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఇదే జట్టు రహానేను సైతం కెప్టెన్‌గా ఎంపిక చేసి తొలగించింది. ఈసారి ఆ జట్టు కూడా యువ ఆటగాడు సంజూశాంసన్‌కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఇక అశ్విన్‌ పంజాబ్‌ కింగ్స్‌కు సారథిగా పనిచేశాడు. అతడూ పెద్దగా రాణించకపోవడంతో గతేడాది ఐపీఎల్‌కు ముందు పంజాబ్‌ వదిలేసుకుంది. ఈ నేపథ్యంలోనే దిల్లీ ఆ సీనియర్లను కాదని పంత్‌ను పరిగణనలోకి తీసుకొందని చెప్పొచ్చు.


పాంటింగ్‌ అండా దండ..

 (Photo: Ricky Ponting Twitter)

కొన్నేళ్లుగా దిల్లీ జట్టుకు రికీ పాంటింగ్‌ కోచ్‌గా కొనసాగుతున్నాడు. ఇంతకుముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ సైతం ఆ జట్టుకు మెంటార్‌గా వ్యవహరించాడు. దాంతో ఆ ఇద్దరి దిగ్గజాలతో పంత్‌కు సాన్నిహిత్యం పెరిగింది. ఈ యువ బ్యాట్స్‌మన్‌ టీమ్‌ఇండియాలో కొద్దికాలం విఫలమైనా ఐపీఎల్‌లో నిలకడగా ఆడాడు. ఇప్పటి వరకు ఏ సీజన్‌లోనూ నిరాశపర్చలేదు. అయితే, దానికి కారణం ఆ ఇద్దరు దిగ్గజాలనే భావించవచ్చు. తర్వాత పంత్‌ టీమ్‌ఇండియాలో ఎప్పుడు బాగా ఆడినా దాదా, పాంటింగ్‌ ప్రశంసల జల్లులు కురిపిస్తారు. అతడు ప్రతిభావంతుడని, సరైన రీతిలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తాడని నమ్ముతారు. దీంతో శ్రేయస్‌ లేని ఈ సీజన్‌కు పంత్‌ను కెప్టెన్‌గా చేయడంలో కోచ్‌ అండదండలుండటం కొట్టిపారేయలేని అంశం.


దిల్లీకి ఇదివరకే కెప్టెన్‌..

 (Photo: Rishabh Pant Twitter)

పంత్‌ దేశవాళీ క్రికెట్‌లో 2015లో అడుగుపెట్టాడు. అక్కడ దంచికొట్టడమే పనిగా పెట్టుకున్న అతడు స్వల్పకాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చేరిన రెండేళ్లకే దిల్లీ రంజీ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2017-18 సీజన్‌లో దిల్లీ జట్టుకు కోచ్‌గా ఉన్న భాస్కర్‌.. పంత్‌ను బాగా ప్రోత్సహించాడు. దాంతో అతడా సీజన్‌లో దిల్లీకి కెప్టెన్‌గా చేశాడు. ఈ క్రమంలోనే ఆ జట్టును రంజీ ట్రోఫీ ఫైనల్స్‌కు తీసుకెళ్లాడు. తర్వాత అనివార్య కారణాలతో కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. రంజీ అనుభవం కూడా పంత్‌కు ఇప్పుడు కలిసి వచ్చిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ కారణలన్నీ సహేతుకంగా ఉన్న నేపథ్యంలో మరి యువ ఆటగాడు జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. సీనియర్ల సలహాలు, సూచనలతో నెట్టుకొస్తాడా, సొంత నిర్ణయాలతో అదరగొడతాడా అనేది తెలియాలంటే వేచి చూడాలి. ఏదేమైనా పంత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం సరైన నిర్ణయమేనని పలువురు మాజీలు ఇదివరకే అభిప్రాయపడటం గమనార్హం.

-ఇంటర్నెట్‌డెస్క్‌


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన