close

తాజా వార్తలు

అమ్మే గెలిచింది

అమ్మే గెలిచింది

తల్లి తనకేమైనా భరిస్తుంది... ఎన్ని కష్టాలైనా పడుతుంది. అదే తన బిడ్డకి ఏదైనా అయితే అస్సలు సహించదు. అందుకు కారణమైన వారి మీద సివంగిలా విరుచుకుపడుతుంది. పులిలా పంజా విప్పుతుంది. ముంబయికి చెందిన మంజేరీ సిన్హా కూడా అలానే చేశారు. తన బిడ్డ వైకల్యానికి కారణమైన ఓ ఆసుపత్రిపై పోరాటం చేశారు. తన ఆవేదనకి మూల్యంగా కోర్టు తీర్పు ద్వారా ముప్ఫై ఒక్క లక్షల రూపాయల నష్టపరిహారం అందుకున్నారు. ఇంతకీ ఎవరీ మంజేరీ... ఏంటా కథ అనుకుంటున్నారు కదా... చదవండి ఆమె మాటల్లోనే!
నిజంగా మేం ఈ కొత్త సంవత్సరాన్ని ఎంతో సంతోషంగా ఆహ్వానించాం. ఎందుకంటే డిసెంబర్‌ 26న వచ్చిన కోర్టు తీర్పు మాలో ఉత్సాహాన్ని నింపింది. ఏ తల్లికీ అలాంటి కష్టం రాకూడదు. కానీ వైద్యులు చేసిన పొరబాట్లకు పిల్లలే కాదు.. తల్లులూ ఎంతో బాధపడతారు. తిరిగి పూడ్చలేనంత నష్టమూ కలుగుతుంది. అందుకే నేను నా బిడ్డ వైకల్యానికి కారణమైన వైద్యుల నిర్లక్ష్యాన్ని భరించలేకపోయా. నా పాపని ఆసుపత్రుల చుట్టూ తిప్పిన ఖర్చును రాబట్టాలని, ఇక మీద ఎవరూ  ఇలాంటి తప్పు చేయకూడదని ప్రసవం చేసిన ఆసుపత్రి మీద కేసు వేసి గెలిచా. అసలేం జరిగిందంటే... నేను ముంబయిలోని సెంట్రల్‌ రైల్వేస్‌లో సీనియర్‌ క్లర్క్‌గా విధుల్లో చేరా. ప్రస్తుతం చీఫ్‌ సూపరింటెండెంట్‌ హోదాలో ఉన్నా. మా వారు కూడా ప్రభుత్వ ఉద్యోగి. 1999లో నేను మొదటిసారి గర్భవతినయ్యా. మా ఇంటికి దగ్గర్లో ఉన్న డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ మెమోరియల్‌ ఆసుపత్రిలో డాక్టర్‌ సక్సేనా వద్ద చూపించుకునేదాన్ని. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నా తోడబుట్టిన వాళ్లకీ ఆడపిల్లలు లేరు. బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నా.

థియేటర్‌ తాళం పోయింది: తొమ్మిది నెలలు నిండాయి. అది 2000 సంవత్సరం ఏప్రిల్‌ 5. తెల్లవారు జామున నొప్పులు మొదలయ్యాయి. దాంతో ఆసుపత్రికి వెళ్లా. అక్కడ నా పరిస్థితి చూసి ‘వెంటనే ఆపరేషన్‌ చేసి బిడ్డను తీయాలి’ అని అన్నారు. అయితే ఆపరేషన్‌ థియేటర్‌కి తీసుకెళ్లడానికి సిద్ధం చేశారు. కానీ అక్కడ థియేటర్‌ తాళాలు ఎంత వెతికినా కనిపించలేదు. దాంతో అక్కడ ఆపరేషన్‌ చేసే పరిస్థితి లేకపోయింది. చివరకు అక్కడున్న సిబ్బంది లేబర్‌ రూంకి తీసుకెళ్లి నార్మల్‌ డెలివరీ చేయడానికి ప్రయత్నించారు. బిడ్డ బయటకు రావడం కష్టమైంది. ఆ సమయంలో ఫోర్సెప్స్‌ ఉపయోగించి బిడ్డను బయటకు తీశారు. ఆడపిల్ల పుట్టిందని ఎంతో సంతోషించా. కానీ ప్రసవ సమయంలో ఫోర్సెప్స్‌ వల్ల బ్రేకియల్‌ ప్లెక్సస్‌.. వ్యవస్థ దెబ్బతింది. అది చేతిలో చాలా కీలక వ్యవస్థ కావడంతో పక్షవాతం వచ్చే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పాప ఎదుగుతున్నా... చేతిలో ఎదుగుదల లేదు.

అమ్మే గెలిచింది

ఏం చేయాలో అర్థం కాలేదు: పండంటి ఆడపిల్ల పుట్టిందనే సంతోషం లేకపోవడంతో ఎంతో ఏడ్చా. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నా కూతురికి వైకల్యం మిగిలిందా అని బాధపడని రోజులేదు. ప్రసవమైన మొదట్లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. నా కుటుంబం అండంగా ఉండటంతో ఆ డిప్రెషన్‌ నుంచి బయటపడ్డా. దేశంలో పేరున్న ఎన్నో ఆసుపత్రుల్లో చూపించా. ఎక్కడా ఫలితం లేదని చెప్పారు. అయినా వదల్లేదు. అప్పులు చేసి మరీ వైద్యం చేయించేవాళ్లం.

మావారిదే తప్పన్నారు: ఆసుపత్రి మాత్రం తప్పంతా మాదేనంటూ మరో కేసు దాఖలు చేసింది. నా భర్త సంతకం పెట్టడం ఆలస్యం కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. చాలా కాలంపాటు వాదోపవాదాలు జరిగాయి. ముంబయిలో ఓ పేరున్న వైద్యుడి వద్ద పాపకి పరీక్షలు చేయించా. ఆ నివేదికలోనూ వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాపకి వైకల్యం వచ్చిందని తేలింది. దాంతో ఆ వైద్యుడు కూడా మాకు అండగా నిలబడటానికి ముందుకొచ్చారు.  నాకు కొంచెం బలం వచ్చినట్టు అనిపించింది. దాదాపు ఓ పద్నాలుగేళ్లు ఈ కేసు పరిశీలన, వాదోపవాదాలతోనే గడిచింది. నాకు ఒకవైపు బాధ.. మరోవైపు ఏమవుతుందా అనే ఒత్తిడి. అయితే 2014లో నా కేసును రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ పక్కన పెట్టింది. ఆరా తీస్తే ఆసుపత్రి వాళ్ల వల్లే అలా అయిందని తెలిసింది. నేను సహించలేకపోయా. ఎలాగైనా ఈ కేసును గెలిచి వైద్యుల నిర్లక్ష్యం బయట పెట్టాలనుకున్నా.

జాతీయ స్థాయిలో: జాతీయ కమిషన్‌లో ఫిర్యాదు చేశా. నా వాదనను, డెలివరీ సమయంలో ఇచ్చిన మందులు, బిల్లులు, గర్భవతిగా ఉన్నప్పుడు బిడ్డ ఎగుదలకు సంబంధించిన స్కానింగులు, రిపోర్టులు... అన్నీ అందజేశా. నా పోరాటానికి కొందరు వైద్యులు కూడా తోడయ్యారు. నా సమస్య పూర్వాపరాలు పరిశీలించిన జాతీయ కమిషన్‌... మళ్లీ కేసును పునఃప్రారంభించాలని రాష్ట్ర కమిషన్‌ను ఆదేశించింది. 2015 నుంచి కాస్త ముమ్మరంగా కేసు వాదోపవాదనలు జరిగాయి. చివరికి వినియోగదారుల ఫోరం ఇద్దరు వైద్యులతో ఓ కమిటీ వేసింది. ఆ వైద్యులు రెండు వైపులా వాదనలు విన్నారు. నా కూతురి పరిస్థితిని గమనించారు. నా వైపే న్యాయం ఉందని తేల్చారు. అంతేకాదు పన్నెండు లక్షల నష్టపరిహారాన్ని తొమ్మిది శాతం వడ్డీతో ఇరవై ఏళ్లకు ఎంత అవుతుందో అంత మొత్తం అందివ్వాలనీ, వ్యాజ్యం కింద పాతిక వేల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌ ఆసుపత్రిని ఆదేశించింది. నిజంగా ఆ తీర్పు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నన్ను హేళన చేసినవారంతా... ఇప్పుడు పొగుడుతుంటే ఎంతో గర్వంగా ఉంది.

ఎయిమ్స్‌లో చికిత్స

తొమ్మిదినెలలు కష్టపడ్డాక దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స చేస్తారని తెలిసి వెళ్లాం. అక్కడ మా అమ్మాయి పరిస్థితి ఆపరేషన్‌తో మెరుగవుతుంది అని చెప్పడంతో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. అక్కడ ఆపరేషన్‌ విజయవంతమైంది. పాప చేయి మామూలుగా పెరిగింది. కానీ ఆ చేయి ఏ పని చేయడానికీ సహకరించదని తరువాత తెలిసింది. నేను పాపని బాగు చేసుకునే క్రమంలో సెలవులు పెట్టాల్సి వచ్చేది. కొన్నిసార్లు లాస్‌ ఆఫ్‌ పే కూడా అయింది. కానీ బిడ్డ కోసం తప్పలేదు. మా ఉన్నతాధికారులు నన్ను అర్థం చేసుకున్నారు. ఎలాంటి రిమార్కు పరిగణించకుండా సెలవు ఇచ్చేవారు. అయితే నా బిడ్డకు అలాంటి పరిస్థితి తెచ్చిన వారిని వదలకూడదని ఆ ఆసుపత్రి మీద ముంబయిలోని రాష్ట్ర వినియోగదారుల పరిష్కార కమిషన్‌లో కేసు వేశా. ఓ న్యాయవాదిని నియమించుకున్నా. చాలామంది ‘నీకెందుకు... బిడ్డ ఎంతో కొంత మెరుగైంది కదా’ అని అన్నారు. కానీ నాలా మరే తల్లికీ ఇలాంటి బాధ కలగకూడదు. వైద్యుల నిర్లక్ష్యం జీవితాలను తల్లకిందులు చేస్తుంది. అందుకే నేను ఆలోచించకుండా కేసు వేశా.
అమ్మే గెలిచిందినా పాపకి నిధి అని పేరు పెట్టుకున్నా. తనకిప్పుడు ఇరవై ఏళ్లు. ముంబయిలోని సెయింట్‌ జేవియర్స్‌ కాలేజీలో బీఏ చదువుతోంది. ఎయిమ్స్‌లో చికిత్స తరువాత చేయి మామూలుగా ఎదిగింది కానీ... పక్షవాతం వచ్చింది. ఎడమ చేయి ఉన్నా లేనట్టే. ఈ కేసు కోసం నేను ఎంత వ్యయ ప్రయాసలు పడ్డానో. నా జీతమంతా దీనికోసమే కేటాయిస్తే మా వారి జీతంతోనే కుటుంబం గడిచింది. నాభర్త ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించా. మరోవైపు నేను పోరాటం చేస్తూ ఉద్యోగినిగా నా విధుల్ని సక్రమంగా నిర్వహించా. చాలా తక్కువ కాలంలోనే పదోన్నతులు వరించాయి. ఈ కేసు గెలవడం వల్ల అందే ముప్ఫై ఒక్క లక్షల రూపాయల నష్టపరిహారాన్ని మా నిధి చదువు కోసమే ఉపయోగిస్తా. దాన్ని ప్రయోజకురాల్ని చేసి తన ఆత్మన్యూనతను దూరం చేయాలనుకుంటున్నా.
- పద్మ వడ్డె

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.