close

తాజా వార్తలు

వాళ్లిద్దరికి సంబంధం  ఉందేమో!

నేనిప్పుడు బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. మా క్లాస్‌లో నలుగురైదుగురు స్నేహితులు ఉన్నారు. బీటెక్‌ సెకండ్‌ ఇయర్‌లో ఉన్నప్పుడు క్లాస్‌మేట్‌తో ప్రేమలో పడ్డా. ఆ విషయం మా ఇంట్లో తెలియదు కానీ నా మిత్ర బృందానికి తెలుసు. ఈ మధ్య నా స్నేహితురాలు నేను ప్రేమిస్తోన్న అబ్బాయితో ఎక్కువగా మాట్లాడటానికి ప్రయత్నిస్తోంది. చాలా చనువుగా మెలుగుతోంది. నా ముందు మాత్రం మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. తరచూ ఫోన్లు, ఛాటింగ్‌ చేస్తోంది. ఆ అబ్బాయిని అడిగితే ‘నాకేం తెలియదు. అందరిలానే క్యాజువల్‌గా మాట్లాడుతోంది’ అని అంటాడు. నా స్నేహితురాలిని కూడా అడగాలని ఉంది కానీ... గొడవలు అవుతాయని ఆలోచిస్తున్నా. వాళ్లిద్దరి మధ్య సంబంధం ఉందని అనుమానంగా ఉంది. కానీ తొందరపడలేను. అలాగని ఏం చేయాలో అర్థంకావడంలేదు. ఏదయినా పరిష్కారం ఉందా?

- ఓ సోదరి

 

మీరు విద్యార్థిని. వ్యక్తిగతంగా, కెరీర్‌పరంగా ఎంతో ఎదగాల్సి ఉంది. ప్రస్తుతం మీరు అలాంటి విషయాల మీద దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. అలా కాకుండా స్నేహితులు, ప్రేమ గురించి మీరు మరీ ఎక్కువగా ఆలోచించి... ఆందోళన పడుతున్నారని అర్థమవుతోంది. ప్రేమ, పెళ్లి అనేవి మన జీవితంలో భాగం మాత్రమే అని మీరు అర్థం చేసుకోవాలి. మీరు, మీ సహధ్యాయిని ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారు. అలానే ఇద్దరిమధ్యా అనుబంధం గాఢంగా ఉందని నమ్ముతున్నారు. ఏ అనుబంధానికైనా పునాదులు ముఖ్యం. అవి ఉంటేనే బంధం ెట్టింపవుతుందని గుర్తించండి. మీ బంధంలో నమ్మకం, గౌరవం, విలువలు అనేవి... ముఖ్యం. మీ ఇద్దరి మధ్యా సరైన అవగాహన ఉంటే పరస్పరం పారదర్శకంగా ఉంటారు. ఏం జరుగుతోంది... ఏం చేయాలనేది ఇద్దరూ కలిసి చర్చించుకుంటారు. కానీ ఇక్కడ మీ స్నేహితురాలి తీరు అనుమానాలకు తావిస్తోంది. పైగా మీ ఒక్కరిలోనే ఆందోళన కనిపిస్తోంది. ఆ అబ్బాయిలో స్పష్టత ఉంది. మీరు అడిగితే ఏమీ లేదని చెబుతున్నాడు. మీరు అతను నిజం చెప్పట్లేదు అని అనుకోవడం వల్లనే మీకా ఆందోళన. ఒకవేళ అతను మీకు అనుమానం వచ్చేలా ఏమైనా ప్రవర్తిస్తున్నాడా.. అది మీరు గమనించారా...! ఏది ఏమైనా అతడిని మాత్రం పూర్తిగా నమ్మడంలేదు.

ఇక్కడ మీ ఇద్దరూ బాగుండాలంటే కావల్సింది పరస్పర అవగాహన. ఆ స్పష్టత, అవగాహన ఉండి, ఒకరినొకరు అర్థం చేసుకుంటే గనుక.... మీ స్నేహితురాలే కాదు, అతనిపట్ల ఎవరు ఆకర్షణకు లోనైనా మీ బంధం బీటలు వారదు. చాలా సందర్భాల్లో గొడవలకు కారణం సరైన కమ్యూనికేషన్‌ లేకపోవడమే. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఒకరికొకరు మనస్ఫూర్తిగా మాట్లాడుకోండి. అప్పుడే స్పష్టత వస్తుంది. అలానే మీ వంతుగా ఇద్దరి మధ్యా అనుబంధం పెంచుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టండి.
మీ ఆత్మన్యూనత, అభద్రత, విశ్వాసలేమి, అవగాహన రాహిత్యానికి ఏ కారణాలు దోహదం చేస్తున్నాయో ఇద్దరూ కలిసి చర్చించుకోండి. ఇద్దరూ కలిసి ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించుకోండి. ఇద్దరూ ఒకటే మాట మీద ఉంటే గనుక ఇటువంటి గొడవలకు తావుండదు. మూడో వ్యక్తి చనువు వల్ల మీ బంధం బీటలు వారకుండా ఉండాలంటే... ఏం చేయాలో కలిసి కూర్చుని ప్రణాళిక వేసుకోండి. మీరు చెప్పిన వాటన్నింటికీ అతను సుముఖంగా ఉండి... చేయడానికి సిద్ధపడితే మాత్రం మీరు కూడా కొంత మారాల్సి ఉంటుంది. మీ మధ్యలోకి ఎవరు వచ్చినా... ఇరువురి అనుబంధంలో తేడా రాదు అనే స్పష్టత తెచ్చుకోవాలి. నమ్మకాన్ని పెంచుకోవాలి. బంధానికి కట్టుబడి ఉండాలి. అతనికీ అదే ధైర్యమివ్వాలి. అప్పుడే మీ ఆందోళన తగ్గుతుంది. సంతోషం సగం బలం అవుతుంది.

మీ ప్రశ్నలు ఇకపై vasupsych@eenadu.netకు పంపించగలరు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.