close

తాజా వార్తలు

నా బాబు నాకు కావాలంటే?

పన్నెండేళ్ల క్రితం నాకు పెళ్లయ్యింది. మాకు పదేళ్ల బాబు ఉన్నాడు. నాకు, మావారికి మధ్య వచ్చిన మనస్పర్థల వల్ల నాలుగేళ్లక్రితం అత్తింటిని వదిలి బయటికి వచ్చేశా. అప్పటికే మా అత్తింటివారిపై 498ఎ కేసు వేశా. వారు బెయిల్‌పై బయటికి వచ్చారు. ఆ తరువాత మెయింటెనెన్స్‌ కేసు వేశా. అది నడుస్తుండగానే ఉద్యోగం రావడంతో విత్‌డ్రా చేసుకుని విడాకులు కోరుతూ మరో కేసు పెట్టా. అయితే మా వారు దానికి ఒప్పుకోవడం లేదు. తన మీద ఉన్న 498ఎ కేసు తీసేస్తేనే విడాకులు ఇస్తానని అంటున్నాడు.జైలుకైనా వెళ్తాను కానీ విడాకులు ఇవ్వనంటున్నాడు. ఇప్పుడు మా అబ్బాయి నా తల్లిదండ్రుల దగ్గరే పెరుగుతున్నా... వాడి అవసరాలు మా వారే తీరుస్తున్నారు. మొదట్లో నేను కూడా కొంతకాలం పుట్టింట్లోనే ఉన్నా కానీ ఇప్పుడు ఉద్యోగం చేస్తూ వేరేచోట ఉంటున్నా. నాలుగేళ్లుగా నేను నా కొడుకుని పట్టించుకోకపోవడం నిజమే. ప్రస్తుతం వాడిని పోషించుకోగలను. కానీ నా భర్త, నా తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోవడం లేదు. నా బాబుని నేనెలా పొందగలనో దయచేసి వివరించగలరు?

- ఓ సోదరి

మీరు మీ అబ్బాయిని తెచ్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ అతడు ఎవరి దగ్గర క్షేమంగా ఉంటాడన్న దానిమీద పిల్లల కస్టడీ పిటిషన్‌ని కోర్టు నిర్ణయిస్తుంది. ఇన్నాళ్లు మీ బాబు మీ తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు కాబట్టి వాళ్లకి చేరువై ఉండొచ్చు. ఇప్పుడు అతడి కస్టడీ కోసం కోర్టులో గార్డియన్స్‌ అండ్‌ వార్డ్స్‌ యాక్ట్‌ కింద కేసు దాఖలు చేయండి. అప్పుడు కోర్టు మీ తల్లిదండ్రులను, భర్తను పిలిపించి వారి అభ్యంతరాలను పరిగణిస్తారు. మీ అబ్బాయి అభిప్రాయాన్నీ తెలుసుకుంటారు. ఆ సమయంలో అతడు అమ్మమ్మ, తాతల దగ్గర ఉంటానని చెబితే మీకు ఇబ్బంది ఎదురవుతుంది. అందుకే ముందు కొన్నాళ్లు మీరు మీ పుట్టింట్లో  ఉండి బాబుతో సఖ్యత ఏర్పరుచుకోండి.   మీకు దగ్గరకావొచ్చు. అలా అని బాబుని పూర్తిగా మీకే ఇవ్వడం కుదరదు. తల్లి, తండ్రి ఇద్దరూ కూడా పిల్లలకు సహజంగా గార్డియన్స్‌ అవుతారు. ఒకవేళ వారిద్దరు విడిపోయి వేరే పెళ్లి చేసుకుంటే పిల్లలను పోషించగల స్థోమతను గమనిస్తుంది కోర్టు. ఎవరిదగ్గర వారు ప్రేమగా, క్షేమంగా ఉంటారో దాన్ని బట్టి నిర్ణయిస్తుంది. అయినప్పటికీ వారాంతంలో భర్త/భార్యకు ఆ పిల్లలను చూసుకునే అవకాశం ఉంటుంది. ఇక మీరు నాలుగేళ్లుగా బాబుని చూడలేదు అంటున్నారు కాబట్టి తిరిగి పొందడానికి కోర్టులో తప్పనిసరిగా పిటిషన్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. మీరు మీ కాళ్ల మీద నిలబడి భర్త ఇచ్చే భరణం మీద ఆధారపడకుండా జీవిస్తున్నారు. మీ పిల్లాడిని పోషించుకునే స్థోమత ఉందని కోర్టుకి తెలియజేయండి. వాస్తవానికి తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు ఇతరులెవరికీ పిల్లల బాధ్యతను తీసుకునే హక్కులేదు. ఇకపోతే మీ భర్త 498ఎ కేస్‌ విత్‌డ్రా చేసుకుంటేనే విడాకులు ఇస్తాను అంటున్నారు కాబట్టి మీకు విడాకులు తప్పనిసరిగా కావాలనుకుంటే వెనక్కి తీసుకోవడమే మేలు. ఎందుకంటే అప్పుడు జరిగిన వేధింపులు ఇప్పుడు లేవు కదా!  అలా కాకుండా మీకు విడాకులూ కావాలి... అతనికి శిక్షా పడాలి అనుకుంటే విడాకుల కేసు, 498ఎ కేసు... రెండూ కొనసాగించండి. క్రూరత్వం కింద కేసు నిరూపితమైతే మీ వారు ఒప్పుకోకపోయినా మీకు విడాకులు మంజూరు అవుతాయి.

- మీ సందేహాలను, సమస్యల్ని vasulegal@eenadu.net కు పంపించగలరు.

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.