close

తాజా వార్తలు

ఈ కొలువులకు ఇంటర్‌ చాలు!

ఇంటర్‌ తర్వాత..
ఉద్యోగాలు

ఇంటర్మీడియట్‌ పూర్తయింది. ఇప్పుడేం చేయాలి? ఇక డైరెక్ట్‌గా జాబ్‌లోకి వెళ్లిపోవచ్చు. విద్యార్హత చిన్నదే అయినా పెద్ద జీతాలిచ్చే కొన్ని ఉద్యోగాల్లో చేరవచ్చు.  అంతేకాదు నాణ్యమైన ఉన్నత విద్యతోపాటు కొలువులను ఇచ్చే అవకాశాలనూ అందిపుచ్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు త్రివిధ దళాలు,  ఇంకా ఎన్నో సంస్థలు ప్రకటించే పోస్టుల భర్తీకి పోటీపడవచ్చు.


ఇంటర్మీడియట్‌ అర్హత సాధించిన వారికి కొన్ని రకాల ఉద్యోగాలు ఆహ్వానం పలుకుతున్నాయి. సొంత ఖర్చు లేకుండా ఉన్నత చదువులు, కొలువులు అందించే మార్గాలూ ఎదురు చూస్తున్నాయి. ఆ అవకాశాలను అందుకొని యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీలు నిర్వహించే పరీక్షలతో కేంద్రప్రభుత్వ విభాగాల్లో చేరవచ్చు. రాష్ట్రస్థాయిలో కానిస్టేబుల్‌, వీఆర్వో, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ తదితర ఉద్యోగాలు,  ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు ప్రకటించే పలు పోస్టుల పరీక్షలకు హాజరుకావచ్చు.

 

యూపీఎస్‌సీ: ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ

నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ) అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌ఏ) పరీక్షను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇంటర్‌ అర్హతతో లభించే ఉన్నతస్థాయి ఉద్యోగం ఇదే. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌లలో ఆఫీసర్‌ ఉద్యోగాలకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపీసీ విద్యార్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ అన్ని విభాగాలకూ అర్హులు. 
ఆర్మీకి ఎంపికైతే బీఎస్సీ/బీఏ;  నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ విభాగంలో చేరితే బీటెక్‌ కోర్సులను నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ), పుణెలో అభ్యసిస్తూ, శిక్షణ పొందుతారు. నేవల్‌ అకాడమీ(ఎన్‌ఏ)లో చేరితే ఎజిమాలలో బీటెక్‌ చదువుతోపాటు శిక్షణ అందిస్తారు. వీరందరికీ జేఎన్‌యూ, న్యూదిల్లీ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తుంది. అనంతరం ఆయా విభాగాలవారీ సంబంధిత కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.56,100 స్ట్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌/ సబ్‌ లెఫ్టినెంట్‌ / ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదాతో ఆర్మీ/  నేవీ/ ఎయిర్‌ ఫోర్స్‌ల్లోకి తీసుకుంటారు. ఈ పరీక్ష ద్వారా ఎయిర్‌ ఫోర్స్‌లో చేరినవారు పైలట్‌గా సేవలు అందించవచ్చు. బాలురు మాత్రమే అర్హులు. వయసు 16 1/2 - 19 1/2 ఏళ్లలోపు ఉండాలి. కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండడం తప్పనిసరి. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ప్రకటన ఏటా రెండుసార్లు వెలువడుతుంది. ఈ సంవత్సరం రెండో నోటిఫికేషన్‌ ఆగస్టులో వస్తుంది.

 

రాష్ట్ర స్థాయిలో...

వీఆర్వో: విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌ (వీఆర్వో) ఉద్యోగానికి ఇంటర్‌ విద్యార్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టును రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు భర్తీచేస్తాయి.  పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు ప్రకటనలు వెలువడతాయి.
స్టేట్‌ పోలీస్‌: పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కానిస్టేబుల్‌ పోస్టులను ఇంటర్‌ అర్హతతో భర్తీ చేస్తుంది. వీటిలో వివిధ విభాగాల్లో పోలీస్‌ ఉద్యోగాలతోపాటు, జైళ్ల శాఖలో వార్డర్స్‌...మొదలైన పోస్టులుంటాయి. మొదట ప్రిలిమ్స్‌ నిర్వహించి ఇందులో అర్హత సాధించినవారికి  ఫిజికల్‌ ఎఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. చివరగా మెయిన్స్‌ నిర్వహించి అందులో పొందిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఆయా రాష్ట్రాల పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డులు ఈ ప్రకటనలు విడుదలచేస్తాయి.
ఎఫ్‌బీవో, ఏబీవో: ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌బీవో), అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ (ఏబీవో) పోస్టులను రాష్ట్రాల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఇంటర్‌ అర్హతతో భర్తీచేస్తాయి. రాతపరీక్షతో పాటు నడకలో అభ్యర్థి ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తారు. కనీస ఎత్తు తప్పనిసరి. 

 

ఎస్‌ఎస్‌సీ: సీహెచ్‌ఎస్‌ఎల్‌ 

కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవెల్‌ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) పరీక్ష ద్వారా స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌/ జూనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, పోస్టల్‌ / సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులను సీహెచ్‌ఎస్‌ఎల్‌ ద్వారా భర్తీ చేస్తారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌లోని డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఖాళీలకు మాత్రం మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా సైన్స్‌ స్ట్రీమ్‌లో ఇంటర్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. మిగతా పోస్టులకు ఏ గ్రూప్‌ వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-27 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థుల ఎంపిక మూడు అంచెల్లో జరిగే పరీక్షల ద్వారా ఉంటుంది. సాధారణంగా ఏటా డిసెంబర్‌ లేదా జనవరిల్లో ప్రకటన వెలువడుతుంది. 

 

ఎంపీసీ అభ్యర్థులకు ఎన్నో అవకాశాలు

ఆర్మీలో 
10+2 టెక్నికల్‌ ఎంట్రీ: ఇంటర్‌ ఎంపీసీ గ్రూప్‌ విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్యతోపాటు లెఫ్టినెంట్‌ ఉద్యోగాన్ని అందిస్తోంది ఇండియన్‌ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సులో అర్హత సాధించాలి.. షార్ట్‌ లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారికి  బీటెక్‌తో పాటు శిక్షణ నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస ఎత్తు 157.5 సెం.మీ. ఉండాలి.
సోల్జర్‌ టెక్‌: ఈ ఉద్యోగానికి ఇంటర్‌లో ఎంపీసీ గ్రూప్‌ తప్పనిసరి. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. అలాగే ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు ఉండాలి. 17 1/2 - 23 ఏళ్లలోపు వయసువారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్‌ టెస్టు, రాతపరీక్ష, వైద్యపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రాంతాల వారీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీల ద్వారా పోస్టుల భర్తీ జరుగుతుంది. ఏటా నియామకాలుంటాయి.

 

నేవీలో...
10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం: 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ స్కీం ద్వారా ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు కేరళలోని నేవల్‌ అకాడమీ- ఎజిమాలలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ లేదా మెకానికల్‌ బ్రాంచీల్లో నాలుగేళ్లపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఉచితంగా అభ్యసించవచ్చు. అనంతరం నేవీలోనే సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరవచ్చు. జేఈఈ మెయిన్స్‌లో సాధించిన స్కోర్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏడాదికి రెండుసార్లు ప్రకటన వెలువడుతుంది.
ఎస్‌ఎస్‌ఆర్‌, ఏఏ: సెయిలర్‌-సీనియర్‌ సెకండరీ రిక్రూటర్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌), ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ)  పోస్టులకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. రాతపరీక్ష, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఇంటర్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఆర్టిఫీషర్‌ అప్రెంటిస్‌ పోస్టులకు ఈ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు తప్పనిసరి. పురుష అభ్యర్థులే అర్హులు. ఏడాదికి రెండు సార్లు ప్రకటన వెలువడుతుంది. 
కోస్ట్‌ గార్డు: సముద్ర తీర రక్షణ దళంలో కోస్ట్‌ గార్డ్‌ నావిక్‌ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్‌ /10+2 ఎంపీసీ గ్రూప్‌లో ఉత్తీర్ణత పొందినవారు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. ఏడాదికి రెండు సార్లు ప్రకటన వెలువడుతుంది. 
ఎయిర్‌ ఫోర్స్‌
గ్రూప్‌ ఎక్స్‌: ఎయిర్‌ ఫోర్స్‌లోని అన్ని టెక్నికల్‌ విభాగాల్లో పని చేయడానికి గ్రూప్‌-ఎక్స్‌ ఉద్యోగులను తీసుకుంటారు. ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులతో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఉత్తీర్ణులు గ్రూప్‌ ఎక్స్‌ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

రైల్వేలోనూ..

కమర్షియల్‌ క్లర్క్‌ కం టికెట్‌ క్లర్క్‌, అకౌంట్స్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌, జూనియర్‌ క్లర్క్‌ కం టైపిస్ట్‌, జూనియర్‌ టైం కీపర్‌, ట్రెయిన్స్‌ క్లర్క్‌ పోస్టులకు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. రెండంచెల్లో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా నియామకాలు చేపడతారు. ప్రకటనలు రెండు మూడేళ్లకు ఒకసారి వెలువడతాయి. 

 

బైపీసీ గ్రూప్‌కి ప్రత్యేకం

ఆర్మీ: సోల్జర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ / టెక్‌ పోస్టులను ఆర్మీ భర్తీ చేస్తుంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ప్రతి సబ్జెక్టులోనూ 40 శాతం మార్కులు తప్పనిసరి. వయసు 17 1/2 - 23 ఏళ్లలోపు ఉండాలి.   ప్రాంతాలవారీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీల ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. 
ఎయిర్‌ ఫోర్స్‌: గ్రూప్‌ -వై మెడికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బైపీసీ గ్రూప్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. ఆంగ్లంలో 50 శాతం మార్కులుండాలి. వయసు 17-21 ఏళ్లలోపు ఉండాలి.

 

(ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌, ఆర్మీలో సోల్జర్‌/ స్టోర్‌ కీపర్‌, ఎయిర్‌ఫోర్స్‌లో నాన్‌టెక్నికల్‌ ఉద్యోగాల వివరాలు www.eenadupratibha.net  లో)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.