close

తాజా వార్తలు

దుబాయి విమానం దూరమే...

జెట్‌ ఎయిర్‌వేస్‌ ఒక్కటే ముందుకొచ్చింది
సంక్షోభంతో ఆ అవకాశం చేజారింది
 మళ్లీ ప్రక్రియ మొదటి కొచ్చింది
ఈనాడు, అమరావతి

దుబాయి విమాన సర్వీసు ఇక ఇప్పట్లో లేనట్టేనని స్పష్టమైపోయింది. విజయవాడ నుంచి దుబాయికి విమాన సర్వీసును నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల కిందట ప్రయత్నాలు ఆరంభించింది. వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్‌) పద్ధతిలో విమాన సంస్థకు టిక్కెట్ల అమ్మకం తక్కువ ఉంటే.. ఆ డబ్బులను ప్రభుత్వం చెల్లించేలా దుబాయి సర్వీసును నడపాలని నిర్ణయించారు. వీజీఎఫ్‌ పద్ధతిలో దుబాయికి సర్వీసును నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకు రావొచ్చని.. టెండర్లను సైతం ఆహ్వానించారు. రెండుసార్లు టెండర్లు పిలవగా.. ఒకే ఒక్క జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థకు దుబాయి సర్వీసు నడిపే అవకాశం ఇవ్వాలని భావించారు. కానీ.. ప్రస్తుతం జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ నష్టాల్లో కూరుకుపోవడంతో ప్రస్తుతం ఆ ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది. దీంతో ఇప్పట్లో దుబాయికి సర్వీసును నడిపే అవకాశం లేదని ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గత జనవరిలో దుబాయి సర్వీసు కోసం రిక్వస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ను ఆహ్వానించారు. ఫిబ్రవరి 12 వరకూ తుది గడువుగా నిర్ణయించారు. అయితే.. ఒక్క సంస్థ కూడా ముందుకొచ్చి దుబాయి సర్వీసును నడిపేందుకు తమ బిడ్లను దాఖలు చేయలేదు. దీంతో చేసేది లేక.. గడువును ఫిబ్రవరి 26 వరకూ పొడిగించారు. ఎట్టకేలకు జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ ముందుకొచ్చి తన బిడ్‌ను దాఖలు చేసింది. బిడ్‌ను తెరిచి.. సదరు సంస్థతో ఒప్పందం చేసుకుని.. దుబాయికి సర్వీసును నడిపే అవకాశం ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ.. ఈలోగానే ఆ సంస్థ ఆర్థికభారంతో మూతపడే పరిస్థితి రావడంతో.. తాజాగా ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది.

సింగపూర్‌ విజయవంతమైనా..
విజయవాడ నుంచి ఇప్పటికే సింగపూర్‌ సర్వీసును వీజీఎఫ్‌ పద్ధతిలో గన్నవరం విమానాశ్రయం నుంచి నడుపుతున్నారు. ఇండిగో సంస్థ ముందుకొచ్చి సింగపూర్‌ సర్వీసును నడుపుతోంది. ఇది అత్యంత విజయవంతంగా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వీజీఎఫ్‌ కింద ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ఊహించిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఉండడంతో.. ఆరంభం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం రాలేదు. గత ఏడాది డిసెంబర్‌ 04 నుంచి మంగళ, గురువారాల్లో రెండు రోజులు గన్నవరం నుంచి నడుస్తున్న సింగపూర్‌ సర్వీసుకు.. రెండు వైపులా రద్దీ బాగా పెరిగింది. సింగపూర్‌ నుంచి వచ్చే సర్వీసుకు, ఇటునుంచి అటు వెళ్లే దానికి.. ప్రయాణికుల రద్దీ 80శాతం పైగా ఉంటోంది. దీంతో ఇదే పద్ధతిలో దుబాయికి సైతం సర్వీసును నడపాలని ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రణాళికలు రూపొందించింది. అయితే.. విమానయాన సంస్థలు దీనిపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఒకే ఒక్క సంస్థ ముందుకొచ్చినా.. అదీ ఇప్పుడు కార్యరూపం దాల్చే పరిస్థితి లేకుండాపోయింది.

అబుదాబీకి నడిపేందుకు..
దుబాయికి సర్వీసులు నడపడం ఆలస్యమైతే.. అబుదాబికైనా నడపాలని ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మళ్లీ బిడ్లను ఆహ్వానించేటప్పుడు దుబాయితో పాటూ అబుదాబీకి సైతం పిలవాలని భావిస్తున్నారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లో దుబాయి తర్వాత ఆ స్థాయిలో అంతర్జాతీయస్థాయి గుర్తింపు ఉన్న నగరం అబుదాబి. దుబాయి మాదిరిగానే అత్యంత ఆధునిక అంతర్జాతీయ విమానాశ్రయం అబుదాబిలో ఉంది. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి 126 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుంచి సైతం ప్రపంచంలోని ఏ నగరానికైనా తేలికగా వెళ్లిపోయేందుకు అనుసంధానం ఉంటుంది. అందుకే.. దుబాయి లేదంటే అబుదాబి ఏదైనా ఫర్వాలేదనే ధోరణిలో అధికారులున్నారు.

దుబాయిలోనూ అవకాశం లేక..
దుబాయి విమానాశ్రయంలోనూ సర్వీసులు రాకపోకలకు అవసరమైన స్లాట్‌ బుకింగ్‌ చాలా కష్టతరంగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. విజయవాడ నుంచి సర్వీసులు రాకపోకలు సాగించేందుకు అక్కడ ఖాళీ లేకపోవడంతో.. ఇప్పటికే దుబాయిలో స్లాట్స్‌ పొందిన విమానయాన సంస్థలు ముందుకొస్తే తప్ప ఇక్కడి నుంచి సర్వీసులు నడిపేందుకు అవకాశం లేదు. కేంద్రం నుంచి అనుమతులు సైతం మళ్లీ పొందాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే.. మరికొంత కాలం వేచి ఉండక తప్పదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. మళ్లీ కేంద్ర పౌరవిమానయాన శాఖతో అనుసంధానం చేసుకుని దుబాయి సర్వీసు ప్రక్రియను ఆరంభించాల్సి ఉంటుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.