close

తాజా వార్తలు

అమ్మ మనసు హాయిగా!

ఇంటికి దీపం ఇల్లాలు! ఎవరన్నారో గానీ ఎంత గొప్ప మాటో. అవును... అమ్మతోనే ఇంటికి కళ. అమ్మతోనే ఆనందం. అమ్మతోనే ఆహ్లాదం. ఆ మాటకొస్తే అమ్మ నవ్వులతోనే ఇల్లు పొదరిల్లు అవుతుంది. అమ్మ సంతోషంతోనే గృహం స్వర్గసీమగా మారుతుంది. అమ్మ ఏమాత్రం చిన్నబోయినా పిల్లల ముఖాలు వాడిపోతాయి. నవ్వుల గలగలలు ఆగిపోయి ఇల్లంతా బోసిపోతుంది. మరి అమ్మ ఆనందంగా ఉండాలంటే?

1 ప్రేమతో వండితే..

అమ్మ పెరుగు ముద్ద తినిపించినా అమృతంలా ఉంటుంది. అందుకే అమ్మ చేతి వంటంటే పిల్లలకు అంత ఇష్టం. ప్రేమతో వండి పెట్టే తిండి పిల్లలకు బాగా ఒంట పడుతుంది. బయటి తిండిలో ఇలాంటి ప్రేమ, ఆప్యాయతలేవీ ఉండవు. పైగా కొవ్వులు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తాయి. వీటికి ఖర్చూ ఎక్కువే అవుతుంది. కాబట్టి ఇంట్లోనే వండి పెట్టడం మంచిది. పిల్లలు ఇష్టంగా తింటే అమ్మ తన కడుపే నిండినంత సంబరపడుతుంది. అంతకు మించిన ఆనందం ఇంకెక్కడ్నుంచి లభిస్తుంది? వంట చేయటం కాలక్షేపంగానూ, హాబీగానూ ఆమెకు ఉపయోగపడుతుంది. ఇదీ ఆనందాన్ని కలిగించేదే.

2 కాసింత విరామం

ఏ పనైనా అదే పనిగా చేస్తుంటే విసుగొస్తుంది. అదే కాస్త విరామం తీసుకుంటే కొత్త ఉత్సాహం పుంజుకుంటుంది. కాబట్టి ఇంటి పనుల నుంచి వారానికి ఒకసారైనా అమ్మకు విరామం అవసరం.  వీలైతే ఇంటిల్లిపాదీ కలిసి సినిమాకో, షికారుకో, విహార యాత్రకో వెళ్లొచ్చు. లేదంటే ఇంటి పనుల్లో భర్త లేదా పిల్లల సాయం తీసుకోవచ్చు. దీంతో పనుల నుంచి కొంత విరామం లభిస్తుంది. విసుగు, చిరాకు తగ్గుతాయి. 

3 అభిరుచి అవసరం

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి  ఉండడం సహజమే. కుట్లు, అల్లికలో.. పాటలు పాడుకోవటమో.. కవితలు, కథలు రాయటమో.. ఇలా ఏదో ఒక ఆసక్తి ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంలో పడిపోయి చాలామంది తల్లులు వీటిని పక్కన పెట్టేస్తుంటారు. కానీ సమయం దొరికినప్పుడల్లా వీటిని కొనసాగించడం మంచిది. ఇలాంటి హాబీలు సృజనాత్మకతను పెంచడమే కాదు.. మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  వీలైతే శిక్షణ తీసుకుంటే మరీ మంచిది.

4 వ్యాయామం తప్పనిసరి

శరీరం ఫిట్‌గా ఉంటేనే ఏ ఆనందమైనా. కాబట్టి వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం తగదు.  చాలామంది ఇంటి పనుల్లో పడిపోయి వ్యాయామాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇది మంచిది కాదు. క్రమం తప్పకుండా చేసే వ్యాయామం మూలంగా మెదడులో ఎండార్ఫిన్లనే రసాయనాలు విడుదలవుతాయి. ఇవి హాయి భావనను కలగజేస్తాయి. ప్రస్తుతం మధ్యాహ్నలు నడిచే జిమ్‌లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వాటిల్లో చేరొచ్చు. వీలైతే యోగా, ధ్యానం వంటివీ సాధన చేయొచ్చు. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి

5 అల్పాహారం మానొద్దు

ఉదయం పూట పనుల హడావిడిలో చాలామంది మహిళలు అల్పాహారం  మానేస్తుంటారు. దీంతో త్వరగా అలసట, నీరసం ముంచుకొస్తాయి. కాబట్టి అల్పాహారం తప్పకుండా తినాలి. దీంతో చురుకుగా ఉండటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. పోషకాలు ఎక్కువగా అందే అల్పాహరం తీసుకుంటే ఇంకా మంచిది. ఇది మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. ఎలాంటి జబ్బులు లేకుండా, ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటుంటే అంతకన్నా ఆనందం మరేముంటుంది!

6 గౌరవభావం సడలనీయొద్దు

మనల్ని ఎవరైనా చులకనగా చూస్తే మనసు కలుక్కుమంటుంది. ఉత్సాహం ఆవిరవుతుంది. అదే గౌరవం లభిస్తే ఎక్కడలేని హుషారు కలుగుతుంది. కాబట్టి కుటుంబసభ్యులు, పిల్లలు తమను చులకనగా చూస్తున్నట్టు, తీసేసినట్టు మాట్లాడినట్టు గమనిస్తే తల్లి గట్టిగానే మందలించాలి. అమ్మ అయినంత మాత్రాన అన్నీ భరిస్తుందనుకోవడం పొరపాటని తెలియజేయాలి. మహిళలను గౌరవించటం తమ విధి అని కుటుంబం.. ముఖ్యంగా పిల్లలు తెలుసుకుని, మసలుకునేలా చూసుకోవాలి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరికొకరు గౌరవం, మర్యాద ఇచ్చిపుచ్చుకుంటుంటే ఇంట్లో నిజంగానే ఆనందాలు వెల్లివిరుస్తాయి.

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.