close

తాజా వార్తలు

కొలువుకు కొత్త భాష!

ఆంగ్లం వచ్చేస్తే చాలు.. ప్రపంచంలో ఎక్కడైనా రాణించవచ్చు అనేది ఒకప్పటి మాట. ఫ్రెంచి, స్పానిష్‌లాంటి ఎన్నో భాషలకు ప్రాధాన్యం పెరుగుతోంది. విదేశీ భాషానైపుణ్యం.. కెరియర్‌గానూ విస్తృత ఉపాధి అవకాశాలను అందిస్తోంది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో బహుళజాతి సంస్థలు విదేశీ భాషానిపుణులను నియమించుకుంటున్నాయి. ట్రాన్స్‌లేటర్లుగా, ఇంటర్‌ప్రెటర్లుగా, లాంగ్వేజ్‌ ట్రెయినర్లుగా, కంటెంట్‌ రైటర్లుగా, ఫారిన్‌ లాంగ్వేజ్‌ నిపుణులుగా విభిన్న మార్గాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. కొలువులనో, అందుకు తగ్గ అర్హతలనో అందించే మార్గమిది! ఉద్యోగ వేటలో సరికొత్త భాషాజ్ఞానం రెజ్యూమె విలువను పెంచుతోంది. అందుకే యువతరం విదేశీ భాషలు నేర్చుకోవడంపై దృష్టిపెట్టడం లాభదాయకం!

భావ ప్రకటనలో భాషది ప్రముఖ స్థానం. సామాజికం, ఆర్థికం, రాజకీయం.. ఇలా ఏ అంశమైనా దీనిదే ప్రధాన పాత్ర. విద్యాపరంగానూ మన విద్యార్థులు ఎన్నో దేశాలకు వెళుతున్నారు. కొన్నిసార్లు ఉదా: జర్మనీ వంటి దేశానికి వెళ్లడానికి ఆ భాష తెలిసుండటం తప్పనిసరి. అన్నింటికీ మించీ ఒక కొత్త భాష నేర్చుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. 
మన దేశంలోనే దాదాపుగా 200 చైనా, 5000 జపాన్‌ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని అంచనా. ప్రస్తుతం రెండు లక్షలకుపైగా విదేశీ భాషా నిపుణుల అవసరముందని ఒక సర్వే తెలియజేసింది. ఏటా వీరి అవసరం 20% పెరుగుతూనే ఉండటం విశేషం. అమేజాన్‌, ఇన్ఫోసిస్‌, శామ్‌సంగ్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌, ఎల్‌జీ, ఎల్‌ అండ్‌ టీ, ఐబీఎం, జెన్‌పాక్ట్‌ మొదలైన సంస్థలు ఇతర భాషల్లో ఉన్న నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగులను నియమించుకుంటున్నాయి.  

ఈ విదేశీ భాషలకు గిరాకీ... 

ఫ్రెంచ్‌ 
మన విద్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటున్న విదేశీ భాషల్లో ఇది ముందుంటుంది. కొన్ని పాఠశాలల్లో ఇది కరిక్యులమ్‌లో భాగంగానూ ఉంది. 30కిపైగా దేశాల్లో, దాదాపుగా అయిదు ఖండాల్లో ఈ భాషను మాట్లాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్‌ తరువాత ఎక్కువగా చదువుతున్న భాష కూడా ఇదే. కార్పొరెట్‌ విభాగంలో కెరియర్‌ను మలచుకోవాలనుకునేవారు దీనిని ఎంచుకోవచ్చు. ఫ్యాషన్‌, ఎడ్యుకేషన్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్‌, ట్రావెలింగ్‌, ఆటోమేటివ్‌, ఏరోనాటిక్స్‌ మొదలైన విభిన్న రంగాలకూ ఇది అవసరమవుతుంది. చాలావరకూ కోర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలు కోడింగ్‌తోపాటుగా ఫ్రెంచ్‌ నైపుణ్యాలు ఉన్నవారినే తీసుకుంటున్నాయి.

అరబిక్‌ 
ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే భాషల్లో అయిదో స్థానంలో ఉంది. 300 మిలియన్ల మందికిపైగా ఇది ప్రాంతీయ భాష. 26 దేశాల్లో దీనిని మాట్లాడుతున్నారు. ఆర్థికంగానైనా, సహజ వనరులపరంగా చూసినా అరబ్‌ దేశాలు ముందుంటాయి. ఈ భాషపై పట్టు ఉన్నవారికి వివిధ వ్యాపారాలు, ప్రభుత్వ, లాభాపేక్షలేని సంస్థలు, విద్య ఇంకా ఎన్నో రంగాల్లో మంచి అవకాశాలుంటాయి. మధ్య ప్రాచ్య దేశాలైన యూఏఈ, కేఎస్‌ఈ, బహ్రియాన్‌, ఖతార్‌, ఒమన్‌, కువైట్‌ మొదలైన దేశాలకు విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వెళ్లాలనుకునేవారు దీనిని నేర్చుకోవచ్చు.

జపనీస్‌ 
భారత్‌, జపాన్‌ల మధ్య సంబంధాలు బలపడుతుండటం, ఈ దేశం తమ కార్యకలాపాలను భారత్‌లో విస్తృతం చేస్తుండటంతో ఈ భాషను నేర్చుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సాంకేతికత విషయంలో జపాన్‌ ఎప్పుడూ ముందుంటుంది. నాణ్యతపరంగానూ దీనికి మంచి పేరు. టెక్నాలజీ సంబంధిత కోర్సులను ఎంచుకోవాలనుకున్నా, ఆ రంగంలో స్థిరపడాలనుకున్నా దీనిపై దృష్టిసారించవచ్చు. నిజానికి ఈ భాష కాస్త కష్టమన్న పేరుంది. నేర్చుకునేవారి సంఖ్య తక్కువయినా నేర్చుకుని పట్టు సాధించివారికి ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఎక్కువ.

రష్యన్‌ 
ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల మంది ఈ భాషను మాట్లాడుతున్నారు. యూరప్‌ దేశాల్లో ఈ భాషను ఎక్కువగా మాట్లాడుతుంటారు. భారత్‌ రష్యాల మధ్య కొన్ని దశాబ్దాలుగా ఇంజినీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రక్షణ రంగాల్లో సంబంధ బాంధవ్యాలు కొనసాగుతున్నాయి. ఈ రంగాల్లో అభివృద్ధి చెందాలనుకునేవారు దీనిపై దృష్టిసారించొచ్చు. ప్రైవేటు రంగం విస్తృతంగా విస్తరిస్తుండటంతో ఈ భాషను నేర్చుకున్న వారి అవసరం పెరుగుతోంది.

స్పానిష్‌ 
ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ఈ భాషను మాట్లాడుతున్నారు. మన విద్యార్థులు ఎక్కువగా ఎంచుకుంటున్న భాషల్లో మూడో స్థానంలో ఉంది. యూఎస్‌లోని దక్షిణ, మధ్య అమెరికా ప్రాంతాల్లో ఎక్కువ మాట్లాడే భాష కూడా ఇది. మన విద్యార్థులకు ఆసక్తి కలగడానికి గల కారణాల్లో ఇదీ ఒకటి. ట్రావెల్‌ అండ్‌ టూరిజం, ఫారెన్‌ సర్వీసెస్‌, బీపీఓ/ కేపీఓ, ఇంటర్‌ప్రిటేషన్‌, అంతర్జాతీయ వ్యాపారాలకు ఈ భాషపై పట్టున్నవారు అవసరం. ఈ రంగాలపై ఆసక్తి ఉన్నవారు దీనిని ఎంచుకోవచ్చు.

జర్మన్‌ 
మన విద్యార్థులు ఎంచుకుంటున్న విదేశీ భాషల్లో రెండో స్థానంలో ఉంది. జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌, ఇంకొన్ని దేశాల్లో ఇది ప్రాంతీయ భాష. ఆర్థికపరంగా బలమైన దేశాల్లో ఇదొకటి. ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌, సైన్స్‌ రంగాలకు ఈ దేశం ప్రసిద్ధి. ఈ రంగాల్లో అంతర్జాతీయంగా అభివృద్ధి చెందాలనుకునేవారు జర్మన్‌ను నేర్చుకోవచ్చు. విద్యాపరంగానూ జర్మనీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. అక్కడి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునేవారికీ ఈ భాష నేర్చుకోవడం తప్పనిసరి. 


ఏమేం కోర్సులు? 

విదేశీ భాషలను మన విద్యార్థులు నేర్చుకోవడానికి రెండు ముఖ్య కారణాలున్నాయి. అవి: 1. కెరియర్‌ పరంగా అభివృద్ధి, మంచి ఉద్యోగావకాశాలు 2. ఇతర దేశాలకు వలస వెళ్లాలనుకునేవారు, వివిధ ప్రదేశాలను పర్యటించాలనుకునేవారు, వివిధ భాషల్లో సాహిత్య కోర్సులు చేయాలనుకునేవారికి ఉపకరించటం. ఎన్నో సంస్థలు వివిధ కోర్సులను అందుబాటులో ఉంచాయి. ప్రముఖ విదేశీ భాషల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులున్నాయి.

డిగ్రీ 
బీఏ, బీఏ ఆనర్స్‌ కోర్సులున్నాయి.కాలవ్యవధి మూడేళ్లు. గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌ పూర్తిచేసినవారు అర్హులు.

పీజీ స్థాయి 
ఎంఏ, పీజీ డిప్లొమా కోర్సులున్నాయి. కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. సెమిస్టర్లు ఉంటాయి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారు అర్హులు.

డాక్టొరల్‌ కోర్సులు 
ఏదేని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తిచేసినవారు అర్హులు. కాలవ్యవధి మూడేళ్లు.

డిప్లొమా, సర్టిఫికెట్‌ 
సర్టిఫికెట్‌ కోర్సులకు ఇంటర్‌/ తత్సమాన విద్య, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులకు ఏదేని డిగ్రీ పూర్తిచేసినవారూ, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాలకు ఎంచుకున్న భాషలో డిప్లొమా చేసినవారూ అర్హులు.

ఈ కోర్సుల్లో ప్రవేశానికి సంస్థలు ప్రకటనలు విడుదల చేస్తాయి. సాధారణంగా దరఖాస్తుల ఆధారంగా నేరుగా ఎంపిక చేస్తారు. చాలా కొద్ది సంస్థలు మాత్రమే ప్రవేశపరీక్ష/ వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి. సాధారణంగా ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఫిబ్రవరి నుంచి మే వరకూ విడుదలవుతుంటాయి. డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను నేరుగాకానీ, పార్ట్‌ టైం విధానంలో రెండు రకాలుగా చేసే వీలుంది. కొన్ని సంస్థలు ఏడాదికి రెండు నుంచి నాలుగుసార్లు అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో రామకృష్ణమఠం లాంటివి ఏడాది పొడవునా విదేశీభాషలను నేర్పుతున్నాయి. 
కళాశాలల్లో, శిక్షణ సంస్థల్లోనే కాకుండా ఆన్‌లైన్‌లోనూ నేర్చుకో వచ్చు. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఒక భాషనే ఉదా: గోతే- జర్మనీ swww.goethe.de/ins/in/en/spr/kur/fer.htmlz నేర్పుతున్నాయి. కోర్స్‌ ఎరా, యుడెమి, ఇటాలికీ, డుయోలింగో, రైప్‌, ప్రిపల్షన్‌ మొదలైన వేదికలు ఆన్‌లైన్లో కోర్సులను నిర్వహిస్తున్నాయి. 


అందిస్తున్న ప్రముఖ సంస్థలు 

* ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ), హైదరాబాద్‌* ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌* అలహాబాద్‌ యూనివర్సిటీ* లఖ్‌నవూ యూనివర్సిటీ * జేఎన్‌యూ, దిల్లీ * బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి*జమియా మిలియా ఇస్లామియా * యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి *యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ *ఎంబసీలకు అనుబంధంగా పనిచేసే సంస్థలు (ముంబయి, పుణె, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, జయపుర, అహ్మదాబాద్‌, చండీగఢ్‌, హైదరాబాద్‌ మొదలైన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి). 


ప్రావీణ్యముంటే... అవకాశాల వెల్లువ 

విదేశీ భాషల్లో డిగ్రీతోపాటు మంచి నైపుణ్యాలను సంపాదించినవారికి అనేక రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. టూరిజం, డిప్లొమాటిక్‌ సర్వీసెస్‌, ఎంబసీలు, జర్నలిజం, మాస్‌కమ్యూనికేషన్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఆర్ట్స్‌, పబ్లిషింగ్‌, ట్రాన్స్‌లేషన్‌..మొదలైనవాటిని ప్రముఖంగా చెప్పొచ్చు. ఈ కోర్సులు చేసినవారు ఎంఎన్‌సీలు, ప్రభుత్వ సంబంధిత ప్రత్యేక ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థల్లో కొలువులు దక్కించుకోవచ్చు. జీతభత్యాలు సంస్థ, రంగాన్ని బట్టి మారుతుంటాయి.

ఇంటర్‌ప్రెటర్‌/ ట్రాన్స్‌లేటర్‌ 

విదేశీ భాషలో ప్రావీణ్యం ఉన్నవారు అనువాదకుడిగా పనిచేయొచ్చు. ఫ్రీలాన్సర్‌ అవకాశాలూ ఉంటాయి. దేశంలో రానురానూ విదేశీ చిత్రాలకూ, సాహిత్యానికీ ప్రాముఖ్యం పెరుగుతోంది. నైపుణ్యం ఉన్నవారు మీడియా హౌజ్‌లు, టూరిస్ట్‌ ప్రదేశాలు, స్పోర్ట్స్‌ క్లబ్‌లు.. మొదలైన వాటిల్లో చేరొచ్చు. ఎడిటర్‌, ప్రూఫ్‌రీడర్‌, కంటెంట్‌ రైటర్‌, టీచర్‌, కార్పొరేట్‌ శిక్షకులుగానూ ప్రయత్నించవచ్చు. 


హాస్పిటాలిటీ, టూరిజం 

ఏటా మనదేశాన్ని సందర్శిస్తున్న విదేశీయుల సంఖ్య బాగా పెరుగుతోంది. వీరిలో చాలామంది ఆంగ్లేతరులే. పైగా మన భాష తెలియనివారు. ప్రముఖ సందర్శన ప్రాంతాలు, షాపింగ్‌ మాళ్లు, హోటళ్లకు వీరితో స్పష్టంగా మాట్లాడేవారి అవసరం ఉంటుంది. అందుకే ఈ రంగంలో విదేశీ భాషలు తెలిసినవారికి ప్రాముఖ్యం ఎక్కువ. మంచి జీతంతో వీరిని తీసుకుంటారు.

కస్టమర్‌ సర్వీసెస్‌ 
ఎంబసీ, ప్రభుత్వ ఏజెన్సీలైన ఇమిగ్రేషన్‌, కస్టమ్‌ డిపార్ట్‌మెంట్లలో వీటికి ప్రయత్నించొచ్చు. ఏటా నోటిఫికేషన్లు విడుదలవుతుంటాయి. తగిన అర్హతలుంటే మంచి జీతంతో తీసుకుంటున్నాయి. 

 


ఎంఎన్‌సీ, కేపీఓ, బీపీఓ, ఐటీ ఉద్యోగాలు 

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎనేబుల్డ్‌ సర్వీస్‌, అవుట్‌ సోర్సింగ్‌ల్లో విదేశీ భాషలు తెలిసినవారికి ప్రాముఖ్యం ఉంది. రెజ్యూమెలో విదేశీ భాషలు జోడించుకున్నవారికి బీపీఓ, కేపీఓ, ఐటీ, ఎంఎన్‌సీల్లో ఆదరణ ఉంటోంది. మాట్లాడే నైపుణ్యాలు, సమాచార సేకరణ, డాక్యుమెంట్లపై పని చేయడం, డేటా ప్రాసెసింగ్‌, ఇమిగ్రేషన్‌, ఈ-మెయిల్‌ సపోర్ట్‌ మొదలైన పనులన్నీ ఇందులో భాగం.Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.