close

తాజా వార్తలు

అమ్మకోసం కారులో ప్రయాణం!

సృష్టికి ఆధారం అమ్మ...  కుటుంబానికి, సమాజ శ్రేయస్సు పాటుపడేది ఆమే. భావితరానికి చక్కటి పౌరులను తయారు చేసేదీ కూడా అమ్మే. అందుకే  అటువంటి అమ్మ గురించి తెలుసుకోవాలనుకుంది మహారాష్ట్ర సంగ్లికి చెందిన మాధురి సహస్రబుద్ధి. ఇందుకోసం ఇరవైదేశాల్లో, 23,654 కిలోమీటర్లు కారులో ప్రయాణించింది.  ఇప్పుడు మరో యాత్రకు సిద్ధమవుతోంది. ఆ వివరాలేంటంటే...!

ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము కశ్మీర్‌ విద్యార్థులపై గతంలో జరిగిన దాడులకు కారణాలు అన్వేషించాలనుకుంది మాధురి సహస్రబుద్ధి. దానిలో భాగంగా అరుణాచల్‌ప్రదేశ్‌ మినహా ఈశాన్యంలోని అన్ని రాష్ట్రాలను కారులో చుట్టేసింది. అక్కడ ఎన్నో విషయాలను తెలుసుకుంది. ‘నేను ఒకప్పుడు ఉద్యోగరీత్యా 20 ఏళ్లు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఉన్నా. అప్పుడక్కడ హింసాత్మక వాతావరణం ఉండేది. అక్కడున్న కొన్ని ఆచారాలు, పరిస్థితులతో తల్లులు పిల్లలతో సరిగ్గా గడిపేవారు కాదు. అవన్నీ వారిపై ప్రభావం చూపించేవి. కానీ ఇప్పుడక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి తల్లి తన పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచుతోంది. విలువలు నేర్పిస్తోంది. అవన్నీ గమనించాకే అసలు ఏ ప్రాంతాల్లో అమ్మ ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నా. అందుకే మొదట జమ్ము కశ్మీర్‌కి వెళ్లొచ్చా...’ అంటోంది మాధురి.

 మదర్స్‌ ఆన్‌ వీల్స్‌ ఇలా...
అక్కడితో ఆమె తన ప్రయాణాన్ని ఆపేయలేదు. కశ్మీర్‌లోనే కాదు...ప్రపంచ వ్యాప్తంగా తల్లుల స్థితిగతులు ఏంటో తెలుసుకోవాలనుకుంది. ఆమె పుణెలో పనిచేసినప్పుడు పరిచయమైన శీతల్‌ దేశ్‌పాండే, ఊర్మిళ జోషిలతో తన ఆలోచన పంచుకుంది. వారికీ ఈ ఆలోచన నచ్చడంతో ఆమెకు తోడయ్యారు. ఆ తరువాత గ్వాలియర్‌కు చెందిన మాధవిసింగ్‌ తోమర్‌ కూడా కలిసింది.  అంతా కలసి కారుకు మరమ్మతులు చేయడం కూడా తెలుసుకుని ‘మదర్‌ ఆన్‌ వీల్స్‌’గా ఏర్పడ్డారు. గతేడాది నవంబర్‌లో ప్రపంచ సాహస యాత్ర మొదలుపెట్టారు. దీనిని అప్పటి విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ జెండా ఊపి ప్రారంభించారు. చైనా, కజకిస్థాన్‌, ఇరాన్‌, జార్జియా, టర్కీ, బల్గేరియా, సెర్బియా, క్రోటియా, జెర్మనీ, బెల్జియం, ఫ్రాన్స్‌ నుంచి లండన్‌ వరకు వీరి యాత్ర సాగింది. మొత్తం 20 దేశాల్లో 23,654 కిలోమీటర్లు ప్రయాణించారు.

 అన్ని చోట్ల ఒకే సమస్య...
ప్రపంచవ్యాప్తంగా తల్లులందరూ ఒకే రకమైన సమస్యలతో బాధపడుతున్నారని చెబుతోంది మాధురి. ‘అమ్మ శ్రమకు విలువ లేదు. ఇంటిల్లిపాదీ అవసరాలు తీర్చినా ఆమె కష్టాన్ని గుర్తించడం లేదు. ఉద్యోగం చేసే అమ్మల పరిస్థితి మరింత దారుణం. రెండు బాధ్యతల్నీ సమన్వయం చేసుకోవడం కత్తిమీద సామే. కనీసం విశ్రాంతి కూడా లేకపోవడంతో  చాలామంది తల్లులు మానసిక సమస్యలతో కుంగిపోతున్నారు’ అని చెబుతుంది మాధురి.

రోడ్డుపై ప్రయాణమే ఇబ్బంది...
‘రోజుల తరబడి ప్రయాణం చేయడం నిజంగా సవాలే. కొన్ని చోట్ల రోడ్డు మార్గం కొండలు, పర్వతాలతో ఉండి, ప్రయాణానికి అనుకూలంగా ఉండదు. మేమందరం శాకాహారులం. ఐరోపాతో పాటు మరికొన్ని చోట్లా సరైన ఆహారం లభించేది కాదు. అలానే కొన్ని దేశాలు సమావేశాలు ఏర్పాటు చేయడానికి ఒప్పుకోలేదు. ఒప్పించి ముందుకు సాగాల్సి వచ్చేది. ఇప్పుడు మరో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాం. సౌత్‌ఈస్ట్‌ ఆసియా, ఆస్ట్రేలియాలో మా పర్యటన సాగనుంది. మా యాత్రకు హోలిస్టిక్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ అకాడమిక్‌ ఫీల్డ్‌(ఎఫ్‌హెచ్‌డీఎఫ్‌) సంస్థ సహకారం అందించింది. ఇది జమ్ముకశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు సహృద్భావ వాతావరణంలో జీవించడానికి పాటుపడుతోంది. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మాకు ఆర్థిక సహాయాన్ని అందించింది. సాహస యాత్ర చేపట్టడానికి హ్యుందాయ్‌ సంస్థ ఐ20 కారును సమకూర్చింది...’ అని చెబుతుందామె.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.