
తాజా వార్తలు
ఒక్క రోజే రూ. 1,113 పెరిగిన ధర
దిల్లీ: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగా డిమాండ్ ఊపందుకోవడంతో పసిడి ధర జీవనకాల గరిష్ఠానికి చేరింది. ఇవాళ ఒక్కరోజే రూ. 1,113 పెరిగి రూ. 38వేల మార్క్‌కు చేరువైంది. దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం ధర బుధవారం రూ. 37,920 పలికింది. అటు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో నేడు రూ. 650 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 43,670కి చేరింది.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో స్టాక్‌మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఇలాంటి సమయంలో పసిడిలో పెట్టుబడులు పెట్టడమే శ్రయేస్కరమని మదుపర్లు భావిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర ఆకాశాన్నంటుతోందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దేశీయ విపణిలో బంగారం ధర 38వేలకు చేరువవడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగానూ ఈ లోహల ధరలు పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం 1,487.20 డాలర్లు, ఔన్సు వెండి 16.81 డాలర్లు పలికింది.