close

తాజా వార్తలు

నాకు లాగి కొట్టడమే అలవాటు.. తగిలితే సిక్సరే

‘సాహో’ ప్రెస్‌మీట్‌లో ప్రభాస్‌

హైదరాబాద్‌: ‘సాహో’ ట్రైలర్‌ చూసిన తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి తనతో మాట్లాడారని, గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారని కథానాయకుడు ప్రభాస్‌ పేర్కొన్నారు. ఆయన నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రచార చిత్రానికి యూట్యూబ్‌లో అద్భుతమైన స్పందన లభించింది. సుజీత్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. ఆగస్టు 30న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా యూనిట్‌ మీడియాతో మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రభాస్‌, శ్రద్ధా సమాధానాలు చెప్పారు.

తెలుగు ట్రైలర్‌ చూశా కదా! ఎలా అనిపించింది?
శ్రద్ధా: చాలా సంతోషంగా అనిపించింది. ఇది భారీ యాక్షన్‌ సినిమా. ఈ సినిమా ట్రైలర్‌ చూసినప్పుడు ఎగిరి, గంతులు వేయాలనిపించింది. ఈ చిత్రం కోసం తెలుగు డైలాగ్‌లు నేర్చుకున్నా. ఇకపై తెలుగు కూడా నేర్చుకోవాలని ఉంది.

ప్రభాస్‌.. శ్రద్ధా గురించి చెప్పండి?
ప్రభాస్‌: శ్రద్ధా ఓ గొప్ప నటి. ఇంత వరకూ ప్రేమకథలు చేసింది. కానీ, తొలిసారి యాక్షన్‌ చిత్రంలో నటించింది. ఈ సినిమాను యాక్షన్‌-లవ్‌ స్టోరీ అనొచ్చు. ఈ చిత్రం విడుదల కోసం బాలీవుడ్‌ వాళ్లు కూడా ఉత్సుకతగా ఉన్నారు. శ్రద్ధా చాలా క్యూట్‌గా, అందంగా ఉంటుంది. కానీ గన్‌ పట్టుకుని ఎలా ఉంటుందో అనుకున్నాం. కానీ గన్‌తో తన పోజు చూసి మేమంతా ఆశ్చర్యపోయాం.

మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
ప్రభాస్‌: ఇది స్క్రీన్‌ప్లే మీద ఆధారపడే సినిమా. ‘బాహుబలి’ తర్వాత నేను నటించిన సినిమా ఇది. దాని కంటే పెద్ద సినిమా తీయడం చాలా కష్టం కదా. కాబట్టి దీని స్క్రీన్‌ప్లే మీద దృష్టిపెట్టాం. సినిమాను మీరు థియేటర్‌లోనే చూడాలి.

‘బాహుబలి’ ఒత్తిడి సుజీత్‌పై ఉందా?
ప్రభాస్‌: ఆ ఒత్తిడి మా అందరిపై ఉంది. అందుకే నాణ్యత కోసం కాస్త సమయం తీసుకున్నాం. సుజీత్ ఇంత చిన్న వయసులో ఇలాంటి సినిమా చేయడం గొప్ప విషయం. రెండో చిత్రాన్నే ఈ స్థాయిలో తీయడం ఆశ్చర్యంగా అనిపించింది. సెట్‌లో ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. తను కోపంగా ఏ రోజూ కనిపించలేదు.

ట్రైలర్‌ విషయంలో ఎలాంటి శ్రద్ధ పెట్టారు?
ప్రభాస్‌: సినిమాపై అంచనా రావాలంటే.. ట్రైలర్‌ చాలా ముఖ్యం. ఈ ట్రైలర్‌ కోసం 137 కట్‌లు చేశారు. దీన్ని కట్‌ చేయడం ఎంత కష్టమో మీకు సినిమా చూసిన తర్వాత అర్థమవుతుంది. మీలాగే నేనూ థియేటర్‌లో సినిమా చూడాలని ఎదురుచూస్తున్నా.

బాలీవుడ్‌లో లేనిది.. టాలీవుడ్‌లో ఉన్నది ఏంటి?
శ్రద్ధా: ఏదైనా కొత్త ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఎలా ఉంటుందో అన్న భయం ఉంటుంది. కానీ ‘సాహో’ టీం తొలిరోజున నాకు చాలా బాగా స్వాగతం చెప్పారు. నాకు కొత్త ప్రదేశానికి వచ్చిన భావన కలగలేదు. ఇంటికి వచ్చినట్లు అనిపించింది. అంతేకాదు ఇంటి భోజనాన్ని నా కోసం ప్రత్యేకంగా రోజూ తెప్పించారు. చాలా రుచిగా ఉండేది.

ఒక్క సినిమాను మాత్రమే చేసిన సుజీత్‌పై ఎలా నమ్మకం కలిగింది?
ప్రభాస్‌: షూటింగ్‌లో తొలిరోజు చాలా కష్టమైన సీన్ షూట్‌ చేశాం. అలాంటి సన్నివేశాన్ని చిత్రీకరించడం అంత సులభమైన పనికాదు. అయినప్పటికీ సుజీత్‌ చాలా తెలివిగా తీశాడు. అప్పుడు నాకు అతడిపై నమ్మకం కలిగింది. ఈ ప్రాజెక్టు అతడు చేయగలడు అనిపించింది.

ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. మీరు భవిష్యత్తులో బాలీవుడ్‌ బాద్‌షా అవుతారని మేం అనుకోవచ్చా?
ప్రభాస్‌: ఫ్యాన్స్‌కు వినోదం పంచడానికి మేం ‘సాహో’ సినిమా తీశాం. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు మించిన సినిమా తీస్తారా? అంటున్నారు. ప్రేక్షకుల తీర్పుపై మొత్తం ఆధారపడి ఉంటుంది.

మీరు ఎప్పుడైనా సిక్సర్‌ కొట్టారా?
ప్రభాస్‌: నాకు లాగి కొట్టడమే అలవాటు. తగిలితే సిక్సరే.

ఇది మీ కెరీర్‌లో సిక్సర్‌ అవుతుంది అనుకుంటున్నారా శ్రద్ధా?
శ్రద్ధా: అది మీపై(ప్రేక్షకులు) ఆధారపడి ఉంటుంది.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌తో కలిసి పనిచేయాలని చాలా మంది నటీమణులు అనుకున్నారు. అలాంటిది ‘సాహో’ కోసం మిమ్మల్ని తీసుకోవడం ఎలా అనిపించింది?
శ్రద్ధా: ఈ ప్రశ్నకు సమాధానం మాటల్లో వర్ణించడం చాలా కష్టం. నేను ఈ సినిమా స్క్రిప్టు విన్నప్పుడు ఆశ్చర్యపోయా. అందులోనూ ప్రభాస్‌ నటిస్తున్నాడు, నా పాత్ర బాగుంది. మరోపక్క ఒకే సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అవుతాను. దీనికి మించి ఇంకేం కావాలి. ఇలాంటి ప్రాజెక్టులో చిన్న పాత్ర అయినా సంతోషమే. ప్రభాస్‌ ఓ అద్భుతమైన సహనటుడు. ఈ మాట నేను చెబితే అతడు సిగ్గుపడుతాడు (నవ్వుతూ) తను చాలా నిజాయతీగా ఉంటాడు.

రాజమౌళితో సినిమా చేసిన హీరో ఆయన సినిమా ‘బాహుబలి’ స్థాయిని మించిన చిత్రంలో నటించాడు. ఇప్పటి వరకు అలా జరగలేదు. మీకు ఎలా అనిపిస్తోంది?
ప్రభాస్‌: సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు దాని స్థాయిని నిర్ణయించాలి.

హిందీలో మీరే డబ్బింగ్‌ చెప్పారా?
ప్రభాస్‌: అవును.. నాకు హిందీ చదవడం, రాయడం వచ్చు. కానీ మాట్లాడటం రాదు. కష్టపడి మాస్టర్‌ని పెట్టుకుని డబ్బింగ్‌ చెప్పా.

‘బాహుబలి’కి ఐదేళ్లు, ‘సాహో’కు మూడేళ్లు.. మీ సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఎదురుచూస్తున్నారు. వారికి మీరేం చెబుతారు.
ప్రభాస్‌: ఇప్పటికే చెప్పాను. ఇప్పుడు ఏం మాట్లాడకూడదు.. సినిమా త్వరగా చేసి ఇవ్వాలి (నవ్వుతూ).

ఈ సినిమా యాక్షన్‌ సీన్ల కోసం భారీగా ఖర్చు చేశారు. మీకు ఎలా అనిపించింది?
ప్రభాస్‌: అవును.. అన్నీ యాక్షన్‌ సీన్లు రియల్‌గా తీసినవే. చాలా ఖర్చు చేశారు. నేను, శ్రద్ధా చాలా సాధన చేశాం. ఈ సినిమా కోసం ప్రముఖ యాక్షన్‌ డైరెక్టర్లు పనిచేశారు. దీన్ని బాధ్యతగా తీసుకున్నాం.

పోలీసు పాత్ర కోసం మెంటల్‌గా ఎలా సిద్ధమయ్యారు?
శ్రద్ధా: ఈ పాత్ర నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. నేను నా దర్శకుడు సుజీత్‌ను చాలా నమ్మాను. ఆయన చెప్పినట్లు చేశా. నేను ఆయన్ను వందల ప్రశ్నలు అడిగి ఉంటారు. ఆయన ఓపికగా సమాధానాలు చెప్పారు (నవ్వుతూ).

జిబ్రాన్‌ సంగీతం ఎలా ఉంది?
ప్రభాస్‌: జిబ్రాన్‌ టీజర్‌ కోసం 80 లేయర్స్‌ చేయించాడు. అందుకే అంత మంచి సౌండ్‌ వచ్చింది. ఈ సినిమా కోసం అతడు ఎంత కష్టపడ్డాడో మీకు సినిమా చూసిన తర్వాత అర్థం అవుతుంది.

‘బాహుబలి’ విజయం తర్వాత మీరు ‘సాహో’లో నటించారు. ఇది ఇంత పెద్ద యాక్షన్‌ సినిమా అవుతుంది అనుకున్నారా?
ప్రభాస్‌: ‘బాహుబలి 1’ ముందే సుజీత్‌ నాకు ఈ కథ చెప్పాడు. అప్పుడే నాకు ‘బాహుబలి’ కథ మొత్తం తెలుసు. కానీ ఆ సినిమా అంత పెద్ద హిట్‌ అవుతుంది అనుకోలేదు. కానీ... ‘సాహో’ స్క్రీన్‌ప్లే మాత్రం గొప్పగా ఉండాలని ముందే ప్లాన్ చేసుకున్నాం. ‘బాహుబలి’ ప్రపంచ వ్యాప్తంగా హిట్‌ అయ్యింది. అలా ఇది ఇంకా పెద్ద యాక్షన్‌ చిత్రంగా మారింది.

ట్రైలర్‌ చూసిన తర్వాత రాజమౌళి ఫీలింగ్‌ ఏంటి?
ప్రభాస్‌: ఆయనకు చాలా నచ్చింది, సంతోషపడ్డారు. నిన్న చిరంజీవి గారు ఫోన్‌ చేశారు. నేను షాక్‌ అయ్యా. నాకు ఒళ్లుగగుర్పొడిచింది. ముందు మెసేజ్‌ చేశారు. తర్వాత నేను ఫోన్‌ చేశా. అది గొప్ప ఫీలింగ్‌.

ప్రభాస్‌ మీరు బాలీవుడ్‌లో ఖాన్స్‌కు పోటీగా నిలిచినట్లేనా?
ప్రభాస్‌: ఖాన్స్‌.. అనేక చిత్రాలతో భారత్‌లో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. కాబట్టి వారిని బీట్‌ చేయడం గురించి మనం ఆలోచించకూడదు, అది తప్పు. నేను బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత చాలా మంది చక్కగా స్వాగతం చెప్పారు. రణ్‌వీర్‌ సింగ్‌లాంటి గొప్ప నటులు ‘బాహుబలి’ నచ్చిందని మెసేజ్‌లు కూడా చేశారు.

 

 Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.