close

తాజా వార్తలు

త్వరలో 2.66 లక్షల ఉద్యోగాలు

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం 

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి జగన్‌

విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌  మైదానంలో 73వ స్వాతంత్ర్యవేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అంతకుముందుకు ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతాక ఆవిష్కరణ అనంతరం విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు సీఎం జగన్‌ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేశారు. మన తలరాతలను మనమే మార్చుకోవాలన్నారు. స్వాతంత్య్ర సాధనకు ఎన్ని పోరాటాలు చేయాలో మన స్వాతంత్ర్య ఉద్యమం చెబుతోందన్నారు. ప్రధానంగా శాంతి, అహింసా ఆయుధాలుగా స్వాతంత్ర్యం తెచ్చుకున్నామని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం ఓ నినాదం కాకుండా ప్రభుత్వ విధానం కావాలని అన్నారు. ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ వంటివని అంబేడ్కర్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా నవరత్నాలు

ప్రజల అవసరాలకు అనుగుణంగా నవరత్నాలను రూపొందించామని ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పేలా సామాజిక న్యాయానికి చట్టాలు తీసుకొచ్చామన్నారు. అవినీతి రూపుమాపేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ రూపురేఖలు మార్చేందుకు గ్రామసచివాలయాలు తీసుకొచ్చామని, రైతలుకు, పేదలకు ఉచితంగా విద్యుత్‌ ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని జగన్‌ అన్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇస్తామన్నారు. పరిశ్రమలకు దరఖాస్తు చేస్తున్నప్పుడే స్థానికులకు శిక్షణ ఇచ్చి వెన్నదన్నుగా నిలబడాలని నిర్ణయించామన్నారు. సామాజిక న్యాయం చరిత్రలోనే లేని విధంగా బడుగు, బలహీన వర్గాల మహిళలకు పెద్దపీట వేశామన్నారు. బీసీ కమిషన్‌ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని గట్టిగా చెప్పగలనన్నారు. ‘‘బీసీ కులాలు అంటే భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాక్‌ బోన్‌ క్లాసులుగా చూస్తామని చెప్పాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నామినేటెడ్‌ పదవులకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం. బీసీ,ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు నామినేటెడ్‌ పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు ఇస్తూ చట్టం చేశాం’’ అని సీఎం జగన్‌ అన్నారు.

కౌలు రైతులకు అండగా..

భూ యజమాని హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా కౌలు రైతుల కోసం వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి అన్నారు. దీంతోపాటు ఉచితంగా పంటల బీమా కల్పించామన్నారు. కార్పొరేట్ సంస్కృతిని మార్చేందుకు పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ చేశామన్నారు. పేద, మధ్య తరగతి కుంటుంబాలకు అండగా నిలిచిన ప్రభుత్వం మనదని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం జగన్‌ అన్నారు. మానవ అభివృద్ధి సూచీలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాలని సూచించారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాల్లో ఎంత అభివృద్ధి ఉందో చూడాలన్నారు. వీటికంటే దళారీ వ్యవస్థ, అవినీతి అంతకంటే వేగంగా బలపడిందన్నారు.కమీషన్లు, దోపిడీలుగా మారిన వ్యవస్థను మారుస్తున్నామని తెలిపారు. టెండర్‌ పనుల ఖరారు ప్రక్రియను హైకోర్టు జడ్జి ముందు పెడుతున్నామని, దీంతో దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టెండర్ల ప్రక్రియలో అత్యుత్తమ విధానాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం, సాంకేతిక నైపుణ్యాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

జీడీపీ ఒక్కటే కాదు..

కేవలం జీడీపీని మాత్రమే కాకుండా మానవ అభివృద్ధి సూచికను కూడా మెరుగు పరచాలని నిర్ణయించామని సీఎం జగన్‌ అన్నారు. పల్లెల్లో ఉన్నవారికి కూడా సంక్షేమాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ‘‘గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్ముతున్నా. పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. శాశ్వత ఉద్యోగాలతోపాటు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ని నియమించాం. వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభానికి ఇవాళే శ్రీకారం చుడుతున్నాం. మరో 2.66 లక్షల ఉద్యోగాలను ఇవ్వబోతున్నాం’’ అని సీఎం చెప్పారు.

ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం

గోదావరి జలాలను సాగర్‌, శ్రీశైలానికి తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెట్ట ప్రాంత రైతుల కోసం 200 రిగ్గులు కొనుగోలు చేసి ఉచితంగా బోర్లు వేయబోతున్నామన్నారు. అప్పుల పాలవుతున్న రైతులకు అండగా ఉండాల్సిన అవసరముందని, పొగాకు ధరలు తగ్గుతున్నాయని తెలిసీ ధరల స్థిరీకరణకు వెంటనే చర్యలు తీసుకున్నామని సీఎం వెల్లడించారు.

పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం

రానున్న మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నామని సీఎం ప్రకటించారు. బడులు ప్రారంభించేనాటికి విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు, బూట్లు అందిస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రతి స్థాయిలోనూ పేద కుటుంబాల పిల్లలకు అండగా ఉంటామన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రూ.1000 ఉన్న పింఛన్‌ సొమ్మును రూ.2,250కి తీసుకెళ్లామన్నారు. ఏటా రూ.250 పెంచుకుంటూ భవిష్యత్‌లో దీనిని రూ.3వేలు చేస్తామన్నారు. పింఛన్‌ అర్హత వయస్సును 65 నుంచి 60 ఏళ్లకే తగ్గించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు.Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.