close

తాజా వార్తలు

Updated : 27/08/2019 06:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాహో అవకాశం శ్రద్ధతోనే...

సాహో... అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా. ఇందులో తొలిసారి తెలుగు తెరపై మెరవనున్న శ్రద్ధాకపూర్‌ను... మరింత వర్ణరంజితంగా కనిపించేలా చేయడంలో దుస్తుల డిజైనర్‌ లేపాక్షి ఎల్లవాడి పాత్ర ఎంతో ఉంది.  ఇప్పటికే పలు సినిమాలకు పనిచేసిన ఆమెకు... ఈ అవకాశం ఎలా వచ్చిందీ... దానికోసం ఎంత కష్టపడిందీ.. ఆమె మాటల్లోనే.
మాది హరియాణా. అమ్మానాన్నది బోధనా రంగం. చిన్నప్పటి నుంచి నాకు ఫ్యాషన్‌ రంగమంటే ఇష్టం. అదే లక్ష్యంతో పెరిగిన నేను... లండన్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశా. ఇటలీలో ప్రత్యేక కోర్సు చదివి బాలీవుడ్‌లో అవకాశాల కోసం ముంబయికి వచ్చా. నేను ఊహించినట్లుగా సినిమా అవకాశం రాలేదు. ప్రకటనలతో నా కెరీర్‌ మొదలైంది. ఇప్పటివరకు వెయ్యికి పైగా ప్రకటనలకు దుస్తుల డిజైనర్‌గా పని చేశా.
రెండేళ్ల ప్రయాణం... భారీ బడ్జెట్‌ చిత్రం ‘సాహో’లో అవకాశం రావడం అదృష్టంగానే భావిస్తున్నా. శ్రద్ధా కపూర్‌కు నేను చేసిన డిజైన్లంటే చాలా ఇష్టం. ఆమెతో గతంలో ‘ఏక్‌ విలన్‌’కు పనిచేశా. ఆ ప్రయాణం మా ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని పెంచింది. ఆ చిత్రం ఆమెకు మంచి పేరూ తెచ్చిపెట్టింది. సాహో కథ] విన్నప్పుడే శ్రద్ధ తనకు డిజైనర్‌గా పనిచేయమని అడిగింది. ఈ యూనిట్‌తో కలిసి రెండేళ్లు ప్రయాణించా. ఎన్నో అనుభూతుల్ని మిగుల్చుకోగలిగా.
పరిశోధన చేశా... శ్రద్ధకు తెలుగులో ఇది మొదటి చిత్రం. కథనమూ ఉన్నత ప్రమాణాలతో, ఆధునికంగా కనిపించబోతోంది. ఇవన్నీ తెలుసుకున్నాక ఆమెకు దుస్తులు రూపొందించే ముందు  నాదైన పరిశోధన చేశా. చిత్రంలోని సన్నివేశాలను బట్టి ప్రత్యేక దుస్తులుండాలని నిర్మాతలు మొదటే చెప్పారు. అవన్నీ గుర్తుంచుకుని చాలా జాగ్రత్తగా డిజైను చేశా. ప్రతి సందర్భం తెరపై ఓ చిత్రలేఖనంలా కనిపించేలా, ప్రభాస్‌, శ్రద్ధ పోటాపోటీగా ఉండేలా నా వంతుగా ప్రయత్నించా. ఈ సినిమాకు సంబంధించిన దుస్తులు, చెప్పులు, నగలన్నింటినీ ఇటలీ, లండన్‌లో కొన్నాం. రోజూ చిత్రీకరణ పూర్తయిన తరువాత మర్నాడు చేయబోయే సన్నివేశం, ప్రభాస్‌ ధరించబోయే దుస్తులు తెలుసుకుని, దానికి తగ్గట్లుగా శ్రద్ధకు డిజైన్‌ చేసేదాన్ని.

నేనూ ఆ కొండ ఎక్కా: ‘ఏ చోట నువ్వున్నా... ఊపిరిలా నేనుంటా’ పాటను ఆస్ట్రియాలోని మంచు కొండలపై ఏడు రోజులు చిత్రీకరించారు. అభిమానులకు ఈ పాట రంగుల విందే. ప్రభాస్‌ దాదాపు సూట్స్‌లో ఉంటే, శ్రద్ధ 30 నుంచి 40 మీటర్ల పొడవుండే పెద్దపెద్ద గౌనుల్లో కనిపిస్తుంది. ఇందులో హీరోయిన్‌ కోసం 16 సంచుల దుస్తులు, 42 జతల చెప్పుల బ్యాగులు, రెండు సంచుల నగలు మోసుకుంటూ నేనూ కొండెక్కేదాన్ని. విదేశాల్లో చిత్రీకరణ అంటే మన పని మనమే చేసుకోవాలి. ఆ చలిలో వేకువజామునే మా ప్రయాణం మొదలయ్యేది. శ్రద్ధకు ఎరుపు రంగంటే ఇష్టం. ఇందులో విదేశీ పోలీసు అధికారిణిలా కనిపిస్తుంది. దానికి తగినట్లుగా మహిళా పోలీసు అధికారుల ఆహార్యంపై నాదైన హోంవర్క్‌ చేసుకున్నా.  ఎన్నో దేశాలకు చెందిన పోలీసు ఆఫీసర్లను పరిశీలించా. శ్రద్ధ శారీరాకృతికి సరిపోయేలా చాలా ప్రయత్నాలు చేసి చివరకు దుస్తుల్ని డిజైను చేశా. ఇందులో శ్రద్ధ వేసుకున్న తెలుపురంగు డ్రెస్‌, పసుపు రంగు గౌను నాకెంతో నచ్చాయి.

మహర్షిలోనూ... సాహో మాత్రమే కాదు... గతంలోనూ కొన్ని తెలుగు సినిమాలకు పనిచేశా. నా మొదటి సినిమా జూనియర్‌ ఎన్‌టీఆర్‌ నటించిన శక్తి. ఇందులో ఇలియానాకు దుస్తులు డిజైన్‌ చేశా. ‘బుడ్డా హోగా తేరా బాప్‌’లో అమితాబ్‌కి డిజైనింగ్‌ చేసే అవకాశం వచ్చింది. మహేశ్‌బాబు ‘మహర్షి’లో పూజాహెగ్డేకి దుస్తులు డిజైను చేయగలిగా కానీ.. మహేష్‌కి కాదు. ఆయనతో పనిచేస్తే బాగుంటుందని చాలాసార్లు అనుకున్నా. ఆ కల ప్రకటనల రూపంలో నెరవేరింది. వీళ్లే కాదు... కాజల్‌, సాయిధరమ్‌తేజ్‌, రాణా దగ్గుబాటి వంటివారికీ పనిచేశా.   బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చేసిన అనుభవం ఉంది.
క్రికెటర్లకూ: భారత క్రికెటర్లు ధోని, సచిన్‌, యువరాజ్‌, శిఖర్‌ధావన్‌, సెహ్వాగ్‌ తదితరులందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. వాళ్లు నటించిన ప్రకటనలకు దుస్తులు రూపొందించా. అన్నింట్లో నాకంటూ గుర్తింపు తెచ్చుకోవడం వెనుక నేను చేసే హోంవర్క్‌ ఎంతో ఉంటుంది. ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్‌ను అనుసరిస్తుంటా. ఈ రంగంలో పోటీ ఎక్కువ. దాన్ని తట్టుకోవాలంటే... కొంత కష్టపడటం తప్పదు. సమయం దొరికినప్పుడల్లా ప్రయాణాలు చేస్తూ... అక్కడి ఫ్యాషన్లు గమనిస్తుంటా. నటీనటులతో పనిచేస్తున్నప్పుడు వాళ్లనుంచి ఎన్నో కొత్త విషయాలూ నేర్చుకుంటా. ఇప్పుడు వాళ్లూ ఫ్యాషన్లపై అవగాహన పెంచుకుంటున్నారు. పాత్రలకు తగినట్లుగా కొన్ని సలహాలూ ఇస్తుంటారు. ఆ సలహాలూ పరిగణిస్తా. వస్త్రాలు, రంగులు, డిజైన్లు... ప్రతి సినిమాకు దుస్తులు ఒకేలా లేకుండా చూడటానికి ఎంత కష్టమైనా పడతా. నేను చేపట్టిన ప్రాజెక్టు ఏదైనా నటీనటులు భిన్నంగా కనిపించేలా చేయడమే నా లక్ష్యం.

ఆ భోజనం మరువలేను...

విదేశాల్లోనే కాదు... హైదరాబాద్‌లోనూ ‘సాహో’ షూటింగ్‌ జరిగింది. ప్రతిరోజూ ప్రభాస్‌ ఇంటినుంచి భోజనం వచ్చేది. దాదాపు 12 నుంచి 16 రకాల వంటకాలు తెప్పించేవారు.   కాస్త ఘాటుగా ఉన్నా... ఆ రుచిని మరవలేను. ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి. స్నేహానికి ప్రాణమిస్తారు. అందరినీ మర్యాదగా పలకరిస్తారు. 

అవార్డు అందుకున్నా...

‘సుల్తాన్‌’లో అనుష్కా శర్మ భిన్నంగా కనిపించేందుకు రోహతక్‌లోని రోడ్లు, బజార్లు తిరిగేదాన్ని. ఆ అమ్మాయిల ఆహార్యం, నగలు, జీవనశైలిని పరిశీలించా. అక్కడి నుంచే అనుష్క కోసం కొన్ని దుస్తులు, యాక్సెసరీలూ తీసుకొచ్చా. ఇందులో ఆమె మొత్తం మూడు జతల డెనిమ్‌లు, దాదాపు ఆరు సల్వార్‌ కమీజులు మాత్రమే వేసుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ దుస్తుల డిజైనర్‌గా అవార్డును అందుకున్నా.

 


Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని