close

తాజా వార్తలు

రివ్యూ : సాహో

 

చిత్రం: సాహో
తారాగణం: ప్రభాస్‌, శ్రద్ధ కపూర్‌, వెన్నెల కిషోర్‌, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్‌.మది
సంగీతం: తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా, జిబ్రాన్‌ (నేపథ్యం)
కూర్పు: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌ 

నిర్మాణం: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌
కథ, దర్శకత్వం: సుజీత్‌
విడుదల తేదీ: 30-08-2019

ఇది అంతర్జాతీయ స్థాయి సినిమా... 
‘సాహో’ టీజర్‌, ట్రైలర్ చూశాక అందరినోట వినిపించిన మాట ఇది. ఆ రేంజ్‌లో తెరకెక్కిన సినిమా మరి. ‘బాహుబలి’ ప్రభాస్‌, బాలీవుడ్‌ దివా శ్రద్ధ కపూర్‌ ఓ పక్క... భారీ తారాగణం, అంతకుమించిన భారీ యాక్షన్‌ సన్నివేశాలు కలిపి సినిమా ఆసక్తికరంగా రూపొందింది. అందుకే  ‘ఇట్స్‌ షో టైమ్‌...’ అంటూ సాగిన టీజర్‌ వచ్చినప్పటి నుంచే సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత విడుదల చేసిన ప్రతి లుక్‌, వీడియోలతో అది మరింత ఎక్కువైంది. సుమారు ₹300 కోట్లతో తెలుగు, తమిళ, హిందీ, మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకుల అంచనాలను సినిమా అందుకుందా... అందరూ అనుకున్నట్లు సినిమా ప్రభాస్‌ కెరీర్‌లో మరపురాని చిత్రంగా నిలిచిందా!

రూ. రెండు లక్షల కోట్లు చుట్టూ... 

ప్రపంచంలోనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్స్‌ ఉండే వాజీ సిటీలో ‘సాహో’ కథ మొదలవుతుంది. పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటాడు. అయితే పృథ్వీరాజ్‌ చేరదీసిన రాయ్‌ (జాకీ ష్రాఫ్‌)… రాయ్‌ గ్రూప్‌ పేరుతో క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. దీంతో రాయ్‌ మీద దేవరాజ్‌ పగ పెంచుకుంటాడు. ఓసారి రాయ్‌ సొంత ఊరైన ముంబయికి వచ్చి అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. అదే సమయంలో ముంబయిలో రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్‌ పేలిపోతుంది. ఈ నేపథ్యంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా వస్తాడు. పోయిన ఆ రూ.రెండు లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని సవాలు చేస్తాడు. మరోవైపు ముంబయిలో రూ.రెండు వేల కోట్ల దొంగతనం జరుగుతుంది. దాని సంగతి తేల్చడానికి అండర్‌ కవర్‌ కాప్‌గా అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) సీన్‌లోకి వస్తాడు. క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలసి ఈ కేసును విచారిస్తుంటాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇంతకీ రాయ్‌ని ఎవరు చంపారు, విశ్వక్‌ రూ.రెండు లక్షల కోట్లు సంపాదించాడా, అశోక్‌ చక్రవర్తి - అమృతా నాయర్‌ ప్రేమ ఏమైంది, అసలు ఇందులో సాహో ఎవరు అనేదే కథ.

 

ఛేజ్‌లు.. తుపాకులు..ఫైట్లు

గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ప్రాణం యాక్షన్‌ సీన్లు, ట్విస్టులు. ఈ సినిమాలో అవి కావల్సినన్ని ఉన్నాయి. హాలీవుడ్‌ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్‌ సినిమాను తెరకెక్కించాడు. తొలి సన్నివేశం నుంచి ఆఖరి వరకు గ్యాంగ్‌స్టర్లు, తుపాకులు, బాంబులు, ఛేజ్‌లతో సినిమా మొత్తం ఆ ఫీల్‌ కనిపిస్తుంది. మొదట్లోనే గ్యాంగస్టర్‌ లీడర్‌ రాయ్‌ చనిపోవడంతో ఈ సినిమా అండర్‌ వరల్డ్‌ వారసత్వం గురించే అని అర్థమవుతుంది. పోటాపోటీ సీన్లు, డైలాగ్‌లతో సినిమా వేడెక్కుతుంది. వాజీలో డాన్‌ వారసుడిగా విశ్వక్‌ రావడం, మరోవైపు ముంబయిలో వరుస దొంగతనాల విచారణకు అండర్‌ కాప్‌గా ప్రభాస్ రంగంలోకి దిగడంతో సినిమా వేగం పెరుగుతుంది. దొంగతనానికి అసలు కారకుడిని పట్టుకోవడానికి అశోక్‌ చక్రవర్తి వేసే ఎత్తుగడలు, దానికి ప్రత్యర్థి జై (నీల్‌ నితిన్‌ ముఖేశ్‌) ఇచ్చే కౌంటర్లతో సినిమా సాగుతుంది. సినిమా ఆఖరులో వచ్చే ప్రభాస్‌ పాత్రలో రెండో షేడ్‌ ఆసక్తికరంగా ఉంటుంది. చాలావరకు సినిమా ప్రభాస్‌ వన్‌మ్యాన్‌ షోగా నడుస్తుంది. మిగిలిన పాత్రలకు అంతగా అవకాశం లేదు. దీంతోపాటు దేవరాజ్‌ పాత్ర తప్ప మిగిలిన డాన్‌లు అంత పవర్‌ఫుల్‌గా లేకపోవడమూ ఓ లోటు.

భారీ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్లు  కెన్నీ బేట్స్‌, పెంగ్‌ జాంగ్‌, స్టీఫెన్‌ రిట్చెర్‌, బాబ్‌ బ్రౌన్‌తోపాటు దిలీప్‌ సుబ్బరాయన్‌, స్టంట్‌ శివ, రామ్‌ లక్ష్మణ్‌ అదుర్స్‌ అనిపించారు. ఎడారిలో భారీకాయులతో ప్రభాస్‌ చేసిన ఫైట్‌ సినిమా అదనపు ఆకర్షణ. ముంబయి నగరంలో శ్రద్ధ కపూర్‌తో కలసి చేసిన గన్‌ ఫైట్లు బాగుంటాయి. శ్రీలంక అందం జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో ప్రభాస్‌ ఆడిపాడిన ‘బ్యాడ్‌ బాయ్‌...’ పాట కుర్రకారుకి కిక్‌ ఇస్తుంది. సినిమా హాలీవుడ్‌ స్టైల్‌లో ఉన్నా మన నేటివిటీ పోకుండా దర్శకుడు సుజిత్‌ జాగ్రత్తపడ్డాడు. ఇంగ్లిష్‌ స్టైల్‌కి తెలుగు నేటివిటీని జోడించి తీర్చిదిద్దాడు. హీరో- హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు, సగటు అమ్మాయిగా శ్రద్ధ కపూర్‌ ఆలోచనలు, ఆఖరులో చూపించిన దాతృత్వానికి సంబంధించిన అంశాలు ఇలా అన్నీ మన స్టైలే. అయితే తెర మొత్తం బాలీవుడ్ విలన్లు, ఇంగ్లిష్‌ రౌడీలతో నిండిపోవడంతో అప్పుడప్పుడు ఇది డబ్బింగ్‌ సినిమానా అనిపిస్తుంది.

 

డార్లింగ్‌ వన్‌ మ్యాన్‌ షో

ప్రభాస్‌ అండర్‌ కవర్‌గా కాప్‌గా అదరగొట్టాడు. సెటిల్డ్‌గా కనిపిస్తూ, యాక్షన్‌ సన్నివేశాల్లో తనదైన ఈజ్‌ను చూపించాడు. సినిమా ద్వితీయార్ధంలో షేడ్స్‌ మార్చడంలో పరిణితిని చూపించాడు. యాక్షన్‌ సన్నివేశాల్లో కొన్ని చోట్ల హాలీవుడ్‌ హీరోలను తలపించాడు. ప్రేమ సన్నివేశాల్లో ‘మిర్చి’ రోజులను గుర్తు చేశాడు. పోలీసు అధికారిణిగా శ్రద్ధ కపూర్‌ చక్కగా ఒదిగిపోయింది. సగటు అమ్మాయిలా కనిపిస్తూ... అవసరమైనప్పుడు ఫైట్లు చేస్తూ పాత్రకు న్యాయం చేసింది. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు బాగా పండాయి. యాక్షన్‌ - ప్రేమను మిళితం చేయడంతో దర్శకుడు విజయం సాధించాడనే చెప్పాలి. గ్యాంగ్‌స్టర్‌ నాయకుడిగా చుంకీ పాండే చక్కటి నటన కనబరిచాడు. డాన్‌ లుక్‌లో తన స్టైల్‌ మేనరిజమ్స్‌తో అదరగొట్టాడు. కల్కిగా మందిరా బేడీ బాగా చేసింది. జాకీ ష్రాఫ్‌, టిను ఆనంద్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మురళీ శర్మ తమ పాత్రల మేరకు నటించారు. 

 

నిర్మాణ విలువలు.. యాక్షన్‌ సన్నివేశాలు

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది స్టంట్‌ మాస్టర్ల గురించి. భారీ యాక్షన్‌ సీన్లతో తెలుగు తెరను హాలీవుడ్‌ స్టైల్‌ ఫైట్లతో నింపేశారు. జిబ్రాన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఫర్వాలేదు. శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ సినిమాకు అదనపు బలం. యూవీ క్రియేషన్స్‌ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. వాళ్లు పెట్టిన ప్రతి రూపాయి తెర మీద కనిపించేలా సినిమాటోగ్రాఫర్‌ మది చాలా కష్టపడ్డారు. డాన్‌ సిటీని క్యాప్చర్‌ చేయడంతో చక్కటి పనితనం చూపించారు. యాక్షన్‌ సన్నివేశాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు. కమల్‌ కణ్నన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, సాబు సిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ బాగుంది. సుజీత్‌ యాక్షన్‌ సన్నివేశాల రూపకల్పన మీద పెట్టిన శ్రద్ధ కథనం మీద కూడా చూపించాల్సింది. డైలాగ్స్‌ కూడా అంతగా పేలలేదు. 

 

బలాలు
ప్రభాస్‌ 
యాక్షన్‌ సన్నివేశాలు
నిర్మాణ విలువలు
బలహీనతలు  
వినోదం
పాటలు 
స్క్రీన్‌ ప్లే

చివరగా: యాక్షన్‌ ప్రియులు ‘సాహో’ అంటారు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.