close

తాజా వార్తలు

నకిలీ ఉద్యోగాలు.. రూ.లక్షల్లో వసూళ్లు!

పురపాలక శాఖలో వెంకటేశ్వర్‌ నాయక్‌ లీలలు
నేతలు తెలుసంటూ నిరుద్యోగులకు గాలం
బదిలీలు చేయించేందుకు.. నిలిపేందుకూ వసూళ్లు
ఈనాడు, హైదరాబాద్‌

పురపాలకశాఖ ప్రాంతీయ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్‌ నాయక్‌ లీలలు అవినీతి నిరోధకశాఖ అధికారుల పరిశీలనలో ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. లంచం తీసుకుని గతనెలలో అనిశాకు పట్టుబడిన కేశంపేట మాజీ తహసీల్దార్‌ లావణ్య భర్త వెంకటేశ్వర్‌ నాయక్‌ మూడు, నాలుగేళ్ల నుంచి అవినీతి, అక్రమాలు చేస్తున్నాడని అనిశా అధికారులు గుర్తించారు. తనకున్న రాజకీయ నేతల పరిచయాలు, ఒకరిద్దరు ఉన్నతాధికారులతో ఉన్న సత్సంబంధాలతో పురపాలక శాఖలో పర్యావరణ ఇంజినీర్‌, ఇతర ఉద్యోగాలిప్పిస్తానంటూ ఉద్యోగార్థుల నుంచి రూ.లక్షల్లో నగదు పుచ్చుకొంటున్నాడు. నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన నిరుద్యోగులను ప్రలోభపెట్టేందుకు వెంకటేశ్వర్‌ నాయక్‌ మధ్యవర్తులనూ నియమించుకున్నాడు. ఉద్యోగార్థుల నుంచి రూ.లక్షలు తీసుకుని మధ్యవర్తులకు కమీషన్‌ ఇస్తున్నాడని అనిశా అధికారులు ఆధారాలు సేకరించారు.

పొరుగుసేవల ఉద్యోగం..  రూ.3 లక్షలు..
పొరుగుసేవల ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగులకు చెబుతున్న వెంకటేశ్వర్‌ నాయక్‌ ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు వసూలు చేసేవాడని అనిశా అధికారులు తెలుసుకున్నారు. డబ్బు వ్యవహారాలను మాట్లాడుకునేందుకు మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయాన్నే వేదికగా చేసుకున్నాడు. ఉద్యోగార్థులను మధ్యవర్తులు తీసుకుని కార్యాలయానికి రాగానే వారంరోజుల్లో డబ్బులివ్వాలని, 15 రోజుల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ వివరించేవాడు. నిరుద్యోగులు నగదు చెల్లించినా నాలుగైదు నెలలు వారిని తనచుట్టూ తిప్పుకొన్నాక అప్పుడు వారికి ఉద్యోగాలను ఇప్పించేవాడు. ఫలానా రాజకీయ నాయకుడి బంధువు, ఫలానా వారికి చుట్టం అంటూ నిరుద్యోగుల వివరాలను ఉన్నతాధికారులకు వివరించడంతో వారు కూడా నిజమేనని నమ్మి వెంకటేశ్వర్‌రావు సూచించిన వారికి ఖాళీల ఆధారంగా ఉద్యోగాలను ఇచ్చారు. ఈక్రమంలోనే తన సొంత బంధువుకు జీహెచ్‌ఎంసీలో పర్యావరణ ఇంజినీర్‌గా ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పించుకున్నాడు. ఇలా ఏడాది వ్యవధిలో పదిమందికిపైగా ఉద్యోగాలు ఇప్పించుకున్నట్లు అనిశా అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా తన కార్యాలయం నుంచి ఎవరైనా బదిలీ అయినా వాటిని ఆపేందుకు, ఎవరినైనా బదిలీ చేసేందుకూ చక్రం తిప్పినట్లు కూడా అధికారులు గుర్తించారు.

ఉత్తుత్తి ఉత్తర్వులు.. బాధితులకు బెదిరింపులు
డబ్బులు చెల్లించిన నిరుద్యోగులు అతన్ని నిలదీసినా.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినా తన అవినీతి, అక్రమాల వ్యవహారాలు బయటకు రాకుండా వెంకటేశ్వర్‌ నాయక్‌ మరిన్ని నేరాలు చేశాడు. పురపాలకశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్టు కొందరికి ఉత్తుత్తి ఉత్తర్వులు ఇచ్చాడు. వాటిని అందుకున్నవారు ఎప్పటి నుంచి ఎక్కడ పనిచేయాలంటూ అడిగితే తన కార్యాలయంలోనేనంటూ చెప్పేవాడు. ఈక్రమంలోనే హన్మకొండకు చెందిన రణధీర్‌కు ఉత్తుత్తి నియామక పత్రాలు ఇచ్చాడు. అవి చెల్లవని తెలియడంతో రణధీర్‌తోపాటు ఇద్దరు, ముగ్గురు యువకులు నిలదీయగా వెంకటేశ్వర్‌ నాయక్‌ వారిని బెదిరించాడు. తనకు ఓ మంత్రి తెలుసునని, ఆయనతో ఇప్పుడే ఫోన్‌ చేయిస్తానంటూ హెచ్చరించాడు. వెంకటేశ్వర్‌ నాయక్‌ తమను బెదిరించినప్పుడు అతని మాటలను రికార్డ్‌ చేసిన బాధితుడొకడు వీటిని అనిశా అధికారులకు ఇచ్చాడు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అనిశా అధికారులు పక్కా ప్రణాళికతో వెంకటేశ్వర్‌ నాయక్‌పై ఉచ్చు బిగించి శుక్రవారం రాత్రి ఆయనతోపాటు మధ్యవర్తి ప్రకాశ్‌ను అరెస్ట్‌ చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.