close

తాజా వార్తలు

కోర్సు నేర్పించి.. కొలువులో చేర్పించి!

ఉద్యోగం వచ్చిన తర్వాత ఫీజుల చెల్లింపు
ఇన్‌కమ్‌ షేర్‌ అగ్రిమెంట్‌

ఇప్పుడే డిగ్రీ పూర్తి చేసినవారు.. ఎప్పుడో చదువు మానేసినవారు.. ఎవరికైనా ఉద్యోగం కావాలి. మంచి జీతం రావాలి.  ఏం చేయాలి? తగిన నైపుణ్యాలను నేర్చుకోవాలి. అందుకు ఆర్థిక స్తోమత ఉండాలి కదా! అవసరం లేదు.. కోర్సులు నేర్పించి, కొలువులు ఇప్పిస్తాం.. రమ్మంటున్నాయి కొన్ని సంస్థలు. ఉద్యోగంలో చేరిన తర్వాత నెలకు కొంత మొత్తం చొప్పున చెల్లించమని చెబుతున్నాయి. ఎలాంటి వడ్డీ అవసరం లేదంటున్నాయి.

ఉన్నత విద్యకు వెళ్లాలనే ఆశ ఉంది. కానీ తగినంత డబ్బు లేదు. అప్పుడేం చేస్తారు? విద్యారుణం తీసుకుంటారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరి ఆ రుణం చెల్లిస్తారు. ఐఎస్‌ఏ (ఇన్‌కమ్‌ షేర్‌ అగ్రిమెంట్‌) లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. రుణం పద్ధతిలో చెల్లించాల్సిన మొత్తానికి కొంత వడ్డీ జత చేయాల్సి ఉంటుంది. ఐఎస్‌ఏలో వడ్డీ ఉండదు. అభ్యర్థి చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో చేరిన తర్వాత తన సంపాదనలో కొంత మొత్తాన్ని (శాతాన్ని) నిర్ణీత కాలంపాటు చెల్లిస్తే చాలు.

మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విద్య ఒకటి. ఆర్థిక వెసులుబాటు లేకపోవటం వల్ల ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నతవిద్యకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారికి ఐఎస్‌ఏ మంచి అవకాశం. మార్కెటింగ్‌కి వీలున్న కోర్సులకు ఫైనాన్స్‌ చేయడం ద్వారా కొన్ని సంస్థలు రుణదాతలకు భారాన్ని తగ్గిస్తున్నాయి. విద్యార్థులకు రుణ సంబంధమైన ఇబ్బందులను తొలగిస్తున్నాయి. ఇన్‌కమ్‌ షేర్‌ అగ్రిమెంట్‌ ఇప్పుడు నయా ట్రెండ్‌. వాటిని కుదుర్చుకునే సంస్థలు విద్యార్థులకు సరైన ఉద్యోగాన్ని అందించడంలోనూ సాయపడతాయి. ఆ విధంగా ఐఎస్‌ఏ అందరికీ లాభదాయకంగా మారింది. అమెరికాలోని కొన్ని సంస్థలు ఐఎస్‌ఏను ప్రారంభించాయి. మన దేశంలోనూ స్టార్టప్‌లు మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే అభ్యర్థులు వీటిపై ఆసక్తి చూపుతున్నారు. ఇవి తాజా గ్రాడ్యుయేట్లకూ, చదువు మధ్యలో ఆపేసినవారికీ ఎంతో ఉపయోగకరం. ఈ విధానంలో కొన్ని కోర్సులను నేర్పించి, ఉద్యోగావకాశాలను కల్పిస్తారు. ప్రస్తుతానికి ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌కి చెందినవే ఉంటున్నాయి. ఈ రంగంలో స్థిరపడాలనుకునేవారు వీటిని ప్రయత్నించవచ్చు.

ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్‌ కోర్సులు:  AttainU

ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాతో జాబ్‌ మార్కెట్‌లోకి వస్తున్నారు. వారిలో దాదాపు 80 శాతం మందికి ఉద్యోగాలు దొరకడం లేదు. అలాంటివారికి సరైన వేదికను అందిస్తే తప్పక విజయం సాధిస్తారనేది ఈ సంస్థ ఉద్దేశం. వీరు ప్రత్యామ్నాయ సాఫ్ట్‌వేర్‌ కోర్సు అందిస్తారు. కోర్సు ఫీజు లేదు. కోర్సు పూర్తయ్యాక కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కోర్సు కాలవ్యవధి ఏడు నెలలు. ఇందులో చేరటానికి కనీస ఆంగ్ల పరిజ్ఞానం ఉండాలి. ఆన్‌లైన్‌లో బోధన ఉంటుంది. గతంలో గూగుల్‌, ఉబర్‌ల్లో చేసిన నిపుణులు, ఐఐటీ బాంబే నిపుణులు బోధిస్తారు. రియల్‌ లైఫ్‌ ప్రాజెక్టులతోపాటు సాఫ్ట్‌స్కిల్స్‌ను నేర్పిస్తారు. ఇహెచ్‌టీఎంఎల్‌ అండ్‌ సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌, వెబ్‌ ఆర్కిటెక్చర్‌, నోడ్‌, ఎక్స్‌ప్రెస్‌, డేటాబేస్‌, కోర్‌ సాఫ్ట్‌వేర్‌ మొదలైనవాటిని కోర్సులో భాగంగా అందిస్తారు. ఫుల్‌ టైం (ఉదయం 9 గం. - సాయంత్రం 5 గం.) కోర్సుల రూపంలో అందిస్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు తరగతులు సాగుతాయి. కోర్సు పూర్తి చేసినవారికి సర్టిఫికెట్‌ అందజేస్తారు. అభ్యర్థి రూ.5 లక్షలకుపైగా వార్షికాదాయమున్న  ఉద్యోగం పొందిన తర్వాత తిరిగి డబ్బులు తీసుకుంటారు. అలా ఉద్యోగం సంపాదించుకోవడంలోనూ సాయపడతారు.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. రెండు వారాల వ్యవధి ఉన్న వాల్యూ సెలక్షన్‌ ట్రాక్‌కు ఎంపిక చేస్తారు. దానిలోనూ అర్హత సాధిస్తే మెయిన్‌ కోర్సుకు అవకాశం కల్పిస్తారు. ఎంపికైనవారు రూ.50,000 డిపాజిట్‌ కట్టాలి. కోర్సు సెప్టెంబరు 30, 2019 నుంచి ప్రారంభం కానుంది. వెబ్‌సైట్‌:www.attainu.com ను సంప్రదించవచ్చు.

కనీసం ఇంటర్మీడియట్‌ పూర్తిచేసినవారు అర్హులు. మధ్యలో చదువు ఆపేసినవారూ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ నేపథ్యం లేనివారూ దరఖాస్తు చేసుకోవచ్చు. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, విద్యాభ్యాసం చేస్తున్నవారు అనర్హులు.

ప్రతి నెలా కొత్త బ్యాచ్‌: AltCampus

సాఫ్ట్‌వేర్‌ రంగంపై ఆసక్తి ఉన్నవారికి కోర్సును అందిస్తున్నారు. తాజా గ్రాడ్యుయేట్లు, చదువు మధ్యలో ఆపేసినవారు, గ్యాప్‌ ఇయర్‌లో ఉన్నవారు, కెరియర్‌ మార్చుకోవాలనుకునే ప్రొఫెషనల్స్‌.. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్‌ డెవలప్‌మెంట్‌ నేర్చుకుంటూ సరైన గైడెన్స్‌ కావాలనుకునేవారూ అర్హులే. ప్రోగ్రామింగ్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలనే నిబంధనేమీ లేదు.ఫుల్‌ టైం ఆఫ్‌లైన్‌ కోర్సు. కోర్సు కాలవ్యవధి ఆరు నెలలు. బ్యాచ్‌కి 12 మందిని ఎంపిక చేస్తారు. ప్రతి నెలా ఒకటో తేదీన కొత్త బ్యాచ్‌ మొదలవుతుంది. కోర్సును హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నిర్వహిస్తున్నారు. ఫ్రంటెండ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌, వివిధ టూల్స్‌, బ్యాక్‌ ఎండ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌, అల్గారిథమ్స్‌, డిజైన్‌ పాటర్న్స్‌, డేటా స్ట్రక్చర్స్‌, వ్యక్తిగతంగా, బృందంతో చేయగల ప్రాజెక్టులు కరిక్యులమ్‌లో భాగంగా ఉంటాయి. మెంటర్లతో గ్రూప్‌, 1:1 సెషన్లు నిర్వహిస్తారు. వీటితోపాటు బలమైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడం నేర్పిస్తారు. ఇంటర్వ్యూలకు ఎలా సిద్ధమవ్వాలో శిక్షణ ఇస్తారు.ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తునుబట్టి సంస్థ ప్రతినిధులు ఈ-మెయిల్‌ ద్వారా సంప్రదిస్తారు. ఒక చిన్న టాస్క్‌ను ఇచ్చి పూర్తి చేయమంటారు. దాన్ని పూర్తిచేసిన తర్వాత చిన్న వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది. దీనిలోనూ ప్రతిభ చూపితే కోర్సుకు ఎంపిక చేస్తారు. వివరాలకు https://altcampus.io/ చూడవచ్చు.

ఉద్యోగం పొందిన తర్వాత నెలకు రూ.50,000పైగా పొందితే ఏడాదిపాటు జీతంలో 15% చెల్లించాలి. ధర్మశాలలో నివాస ఖర్చులను చెల్లించడానికీ ఇబ్బందిగా ఉంటే అక్కడి ప్రతినిధులను సంప్రదించవచ్చు.

కనీస వార్షిక ఆదాయం రూ. 15 లక్షలు: Pesto Tech

అభ్యర్థులకు సాఫ్ట్‌వేర్‌ నైపుణ్యాలను నేర్పించి, టాప్‌ టెక్‌ సంస్థల్లో ఉద్యోగాలు పొందే విధంగా చేస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి కాకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనేది సంస్థ ఉద్దేశం. ఇదో ఆఫ్‌లైన్‌ శిక్షణ ప్రోగ్రామ్‌. దిల్లీలో నిర్వహిస్తారు. కాలవ్యవధి 12 వారాలు. కంప్యూటర్‌ సైన్స్‌ ఫండమెంటల్స్‌ ఉన్న ఏ డిగ్రీ విద్యార్థి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి నెలా కొత్త బ్యాచ్‌ను తీసుకుంటారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను బట్టి స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. దీనిలో అభ్యర్థిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ ఫండమెంటల్స్‌, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, నేర్చుకోవాలనే ఉత్సాహం ఉందో లేదో పరీక్షిస్తారు. ఎంపికైన వారికి ట్రెయినింగ్‌ ఇస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారు ప్లేస్‌మెంట్‌ టీం ద్వారా ఇంటర్వ్యూలు, రెజ్యూమెలను రాయడం, శాలరీ నెగోషియేషన్‌ వంటి అంశాలను తెలుసుకుంటారు.
రూ.15 లక్షలకు పైగా వార్షికాదాయం వస్తే  వచ్చిన జీతం నుంచి 17% మూడేళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థికి కనీస వార్షికాదాయం రూ.15 లక్షలు రాకపోతే విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. వెబ్‌సైట్‌:
www.pesto.tech

కోర్సులో భాగంగా లోతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ ప్రాక్టీసెస్‌, యూఎస్‌ ఇంజినీరింగ్‌ మెంటర్లతో కలిసి పనిచేయడం, ఓపెన్‌ సోర్స్‌ ప్రాజెక్టులపై పనిచేయడం, సాఫ్ట్‌స్కిల్స్‌ వంటివి నేర్చుకుంటారు.

రెండు రకాలు: : MasaiSchool

మంచి డిమాండ్‌, ఎక్కువ జీతంతోపాటు దీర్ఘకాలం ఉపయోగకరమైన కోర్సులను ఈ సంస్థ అందిస్తోంది. ఆండ్రాయిడ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కంప్యూటర్‌సైన్స్‌ ప్రోగ్రామ్‌, ఫుల్‌ స్టాక్‌ వెబ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ప్రోగ్రామ్‌ అవుట్‌లైన్‌ అనే రెండు రకాల ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు. కోర్సుల కాలవ్యవధి 20 వారాలు. ఆఫ్‌లైన్‌ బోధన ఉంటుంది. కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లతోపాటు పరిశ్రమ ఆధారిత నైపుణ్యాలనూ నేర్పిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థి ప్రతిభ, ఆత్మవిశ్వాసాన్ని బట్టి ఎంపిక చేస్తారు. కోర్సు తర్వాత ఉద్యోగావకాశాలను కల్పిస్తారు. నెలకు కనీసం రూ.50,000 సంపాదిస్తున్నప్పుడు 15% జీతాన్ని మూడేళ్లపాటు తీసుకుంటారు. బోధన ఆంగ్లంలో ఉంటుంది. వివరాలకు- ‌www.masaischool.com చూడవచ్చు.

కనీసం ఇంటర్‌ పూర్తిచేసిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌ నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదు.

ఆరు నెలల కోర్సు: InterviewBit

టెక్నాలజీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను ఇక్కడ నేర్చుకోవచ్చు. వీరు కాలేజీ గ్రాడ్యుయేట్లతోపాటు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌కూ అవకాశం కల్పిస్తున్నారు. నైపుణ్యాలకు మెరుగులద్దడంతోపాటు ఉద్యోగానికీ సిద్ధం చేస్తారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు కాలవ్యవధి ఆరు నెలలు. ఆన్‌లైన్‌లో బోధన ఉంటుంది. రోజుకు 3 గంటలు (సాయంత్రం 7 గం.- 10 గం. వరకు) కేటాయించాలి. సమయాన్ని మార్చుకునే వీలు లేదు. కోర్సు సమయంలో పరీక్షలు ఉన్న విద్యార్థులకు మిగిలిన సిలబస్‌ను తరువాత బోధిస్తారు. కోర్సు పూర్తిచేసుకున్నవారికి సర్టిఫికెట్‌ సౌకర్యం ఉంది. విద్యార్థులకూ, ఫ్రొఫెషనల్స్‌కీ వేర్వేరుగా బ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లో బేసిక్స్‌ తెలిసి ఉండాలి. ప్రవేశపరీక్ష నిర్వహించి, అర్హులను ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా కోడింగ్‌ సంబంధిత ప్రశ్నలను అడుగుతారు. డేటా స్ట్రక్చర్‌/ అల్గారిథమ్స్‌, హై లెవల్‌ డిజైన్‌, లో లెవల్‌ డిజైన్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, డేటాబేసెస్‌, అడ్వాన్స్‌డ్‌ డేటా స్ట్రక్చర్స్‌, కాన్‌కరెన్సీ టెస్టింగ్‌, అడ్వాన్స్‌డ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌లను కోర్సులో భాగంగా నేర్పిస్తారు. వీటితోపాటుగా మాక్‌ ఇంటర్వ్యూలు, పజిల్స్‌, ఆన్‌లైన్‌ టెస్ట్‌లు, గ్రూప్‌ డిస్కషన్‌, ప్రాజెక్ట్‌ ప్రెజెంటేషన్‌ వంటి అంశాలపైనా శిక్షణనిస్తారు.1:1 మెంటర్‌షిప్‌ అవకాశం ఉంటుంది. మెంటర్లను సొంతంగా ఎంచుకునే వీలు కల్పిస్తారు. వివరాలకు- ‌www.interviewbit.com/ సందర్శించవచ్చు.

కోర్సు పూర్తి చేసుకున్నవారికి రిఫరెన్స్‌లు ఇస్తారు. ఏడాదిలోపు సంస్థ చూపిన దేనిలోనూ విద్యార్థి ఉద్యోగం పొందలేకపోతే ఎలాంటి డబ్బులూ చెల్లించాల్సిన అవసరం ఉండదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.