close

తాజా వార్తలు

అందుకే కార్ల అమ్మకాలు తగ్గాయి

కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

వ్యాఖ్యలను తిప్పి కొట్టిన కాంగ్రెస్‌

చెన్నై: దేశంలో ఆటోమొబైల్‌ రంగం చతికిలపడడంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మిలీనియల్స్‌ (21వ శతాబ్దపు యువత) కొత్త కారు కొనేందుకు ఆసక్తి చూపడం లేదని,  ప్రయాణం కోసం వారు ఓలా, ఉబర్‌ వంటి సంస్థలను ఆశ్రయిస్తున్నారని వివరించారు. కొత్త కారు కొంటే నెలా నెలా వేల రూపాయలు ఈఎంఐ రూపంలో చెల్లించే బదులు తక్కువ ఖర్చుతో ఓలా, ఉబర్‌ సేవలను వినియోగిస్తున్నారని తెలిపారు. ఆటోమొబైల్‌ రంగంలో రెండంకెల క్షీణత కనిపిస్తున్నందుకు ఈ మార్పు కూడా కారణమని చెప్పారు. ట్రక్కుల విషయంలోనైతే 70 శాతం తక్కువ అమ్మకాలు నమోదవుతున్నాయని, వీటి ప్రభావం వల్ల దాదాపు లక్షలాది ఉద్యోగాలకు ఎసరు ఏర్పడిందని అన్నారు. అయితే సమస్యకు పరిష్కారంగా దేశ వ్యాప్తంగా ఈ రంగంలోని వివిధ విభాగాల వారితో చర్చలు జరిపామని తెలిపారు. మళ్లీ ఆటోమొబైల్‌ రంగం ఊపందుకొనేందుకు ప్రభుత్వం ఆర్థిక పరమైన ఉద్దీపన చర్యలు ప్రవేశపెడుతోందని చెప్పారు. 
‘‘ఆటోమొబైల్‌ రంగం వివిధ అంశాల వల్ల ప్రభావితమైంది. బీఎస్‌-6 శ్రేణి వాహనాల కోసం ప్రయత్నాలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు పెంపు వంటి అంశాల వల్ల ప్రతికూలతలు ఈ రంగంపై పడింది. అంతేకాక యువత కొత్తగా కార్లు కొనకుండా ఓలా, ఉబర్‌ సంస్థలను ఆశ్రయించడం కూడా ఇందుకు కలిసొచ్చింది.’’ అని సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. 
మండిపడ్డ కాంగ్రెస్‌
అయితే, నిర్మల వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మండిపడింది. ‘‘బస్సులు, ట్రక్కుల అమ్మకాల్లో భారీ క్షీణత కూడా యువత కొనకపోవడం వల్లే వచ్చిందా మంత్రి గారూ..?’’ అని ట్విటర్‌ ద్వారా ప్రశ్నించింది.
భారీ వాహన అమ్మకాల్లో భారీ క్షీణత
దేశంలో అతి ముఖ్యమైన ఆటోమొబైల్‌ రంగం దాదాపు మూడు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని క్షీణత ప్రస్తుతం ఈ రంగంలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో తమ అమ్మకాలు 20 శాతం పడిపోయాయని భారత ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటో కార్ప్‌ ప్రకటించింది. ఇదే సమయంలో మారుతీ సుజుకీ 34 శాతం తక్కువ అమ్మకాలతో నెట్టుకొస్తోంది. ఇక ట్రక్కులు, బస్సులు, ట్రాక్టర్లు వంటి భారీ వాహన పరిశ్రమ మరింత క్షీణించింది. అశోక్‌ లేల్యాండ్‌ అమ్మకాలు 70 శాతం పడిపోయాయని ప్రకటించగా, 15 శాతం తమ అమ్మకాల్లో క్షీణత కనిపిస్తోందని మహీంద్రా అండ్‌ మహీంద్రా తెలిపింది. 
ఉద్దీపన చర్యలివీ..
ఈ పరిస్థితికి కొంత ఊరట కల్గించేందుకు గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కొన్ని ఉద్దీపన చర్యలు ప్రకటించారు. ప్రభుత్వ విభాగాల్లో పాత కార్ల స్థానంలో వీలైతే కొత్తవి కొనాలని సూచించారు. ఇంతకుముందు వరకూ కొత్తవాటిని కొనేందుకు అనుమతించలేదు. బీఎస్‌-6 వాహనాలు అరంగేట్రం చేసినప్పటికీ.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనుగోలు చేసిన బీఎస్‌-4 వాహనాలను తర్వాత కూడా నడుపుకొనే వెసులుబాటు కల్పించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.