close

తాజా వార్తలు

ముఖేశ్‌ అంబానీ అభిరుచులేంటో తెలుసా?

తండ్రి నుంచి వేల కోట్ల ఆస్తి వారసత్వంగా వచ్చింది. కావాలంటే లాభాల కోసం ఖండాలు దాటి వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పొచ్చు. కానీ ఆయన ఆ మార్గం ఎంచుకోలేదు. తండ్రి నేర్పిన విలువల్ని తూ.చ తప్పకుండా పాటిస్తూ సొంతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ సాంకేతిక యుగంలో నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలకు దూరంగా ఉన్న భారతీయులకు ప్రపంచంలోనే అత్యంత చౌకగా మొబైల్‌ డేటాను అందించి సంచలనం సృష్టించారు. శ్రమనే నమ్ముకుని ఏ రంగంలో ప్రవేశించినా.. విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే ఆయనెవరో అర్థమయ్యే ఉంటుంది. భారతీయుల వ్యాపార విలువల్ని, చతురతను ప్రపంచానికి చాటిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ. తండ్రి ధీరూభాయ్‌ అంబానీ ఇచ్చిన రూ.వేల కోట్ల ఆస్తిని రూ.లక్షల కోట్లుగా మార్చారు. లక్షల మందికి ఉపాధి కల్పించి వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. కానీ అవేవీ తన ఆహార్యంలో కనిపించనివ్వరు. నిరాడంబరంగా ఉంటూ తన కంపెనీలోని సగటు ఉద్యోగిలాగే నిరంతరం కష్టపడతారు. అలాంటి వ్యక్తి జీవన శైలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి ఉంటుంది కదా! మరి ఓసారి ఆయన అభిరుచులు, ఆహారపు అలవాట్ల లాంటి అంశాలపై లుక్కేద్దామా..!

పుట్టింది యెమెన్‌లో..

ఉద్యోగం కోసం యుక్త వయసులోనే ధీరూభాయ్‌ అంబానీ యెమెన్‌ వెళ్లారు. అక్కడ ఉండగానే ముఖేశ్‌ అంబానీ జన్మించారు. ఆయన పుట్టిన సంవత్సరమే.. ధీరూభాయ్‌ ముంబయికి తిరుగు పయనమయ్యారు. ఇక ఇక్కడే వారి వ్యాపార సామ్రాజ్యానికి బీజం పడడంతో ముఖేశ్‌ బాల్యం, విద్యాభ్యాసం అంతా ముంబయిలోనే గడిచింది. హిల్‌ గ్రాంజ్ హై స్కూల్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం ఎంబీఏ కోసం స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. కానీ, తండ్రి ప్రారంభించబోయే కొత్త వ్యాపారానికి సారథ్యం వహించడం కోసం మధ్యలోనే తిరిగి వచ్చారు. 

క్రమశిక్షణే ఆయన బలం

అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడపాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉండాలి. అది క్రమశిక్షణ వల్లే సాధ్యం. ఈ లక్షణాన్ని ధీరూభాయ్‌ అంబానీ తన వారసుల్లో పుష్కలంగా నింపారు. చిన్నప్పుడు వారి తండ్రి నేర్పిన విలువల్ని ముఖేశ్‌ ఇప్పటికీ పాటిస్తున్నారు. ఓసారి ముఖేశ్‌ ఆయన సోదరుడు అనిల్‌ అంబానీ ఇంటికి వచ్చిన అతిథుల ముందు కాస్త అల్లరి చేయడంతో తండ్రి వారిని కఠినంగా శిక్షించారట. ఇంటి గ్యారేజ్‌లోనే రెండు రోజుల పాటు ఉంచారట. అంతటి కఠిన నిబంధనల మధ్య పెరిగిన ముఖేశ్‌కి చిన్నతనం నుంచే క్రమశిక్షణ అలవడింది. ఆయన సక్సెస్‌కి కారణాల్లో క్రమశిక్షణే ముఖ్య కారణమని అనేక సందర్భాల్లో చెప్పారు. వ్యక్తిగత క్రమశిక్షణతో పాటు ఆర్థిక క్రమశిక్షణ ఉండాలంటారాయన. ప్రతిపనిలో సమయపాలన పాటిస్తారు. ఉదయం 10గంటలకు ఆఫీస్‌కి వెళ్లే ముఖేశ్‌ రాత్రి 9గంటల వరకు సమావేశాలు, సమీక్షలతో తీరిక లేకుండా గడుపుతారు. ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తారు. ఆయన చేసే ప్రతి పనికి స్వయంగా ఆయనే ప్రణాళికలు రచించుకుంటారు.

రోడ్డు మధ్యలో నీతాకు ప్రపోజ్‌..

నీతా అంటే ముఖేశ్‌కు అమితమైన ప్రేమ. ఆమె 44వ పుట్టిన రోజుకి రూ.250కోట్ల విలువ చేసే ఎయిర్‌బస్‌ ఏ319 విమానాన్ని బహూకరించారు. వీరిద్దరిది చాలా భిన్నమైన ప్రేమ కథ. నీతా సాంప్రదాయ నృత్యకారిణి. ఓ ప్రదర్శనలో ఆమెను చూసిన ముఖేశ్‌ తల్లి కోకిలా బెన్‌ తన ఇంటి కోడల్ని చేసుకోవాలని నిశ్చయించుకున్నారట. ఈ విషయాన్ని ఆమె ధీరూభాయ్‌, ముఖేశ్‌కి చెప్పారు. తొలుత ధీరూభాయ్‌ నీతా కుటుంబాన్ని సంప్రదించారు. ఆ తరువాత ఆమెని తన కార్యాలయానికి పిలుపించుకొని విషయం చెప్పారు. అప్పటికి పెళ్లికి సిద్ధంగా లేని ముఖేశ్‌ని ఏదోలా ఒప్పించారు. అలా వారిద్దరు కలుసుకున్నారు. మొదట్లో స్నేహితులుగానే మెలిగారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఓరోజు కారులో వెళుతుండగా.. రోడ్డు మధ్యలో కారు ఆపిన ముఖేశ్‌ ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా’’ అని అడిగారు. నీతా సమాధానం చెప్పకపోవడంతో.. చెప్పేవరకు కదిలేదిలేదని మొండికేశారట. రోడ్డుపై ట్రాఫిక్‌ పెరిగిపోయింది. వాహనాల హారన్‌ల మోత మోగుతోంది. అప్పటికే ముఖేశ్‌ని ఇష్టపడుతున్న నీతా..కాస్త ఆలస్యం చేసినా ఓకే చెప్పారంట. అలా ఇరు కుటుంబాల ఇష్ట ప్రకారం ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు వెళ్లింది. అప్పటి నుంచి వారి వివాహ జీవితం అన్యోన్యంగా సాగుతోంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు. వారంతా ఇప్పుడు వ్యాపారాల్లో భాగస్వాములయ్యారు.

ఇడ్లీ, సాంబార్‌ అంటే ఇష్టం..

ముఖేశ్‌ అంబానీ పూర్తి శాకాహారి. మద్యం మాటే ఎరుగరు. దక్షిణాది వంటకాలని బాగా ఇష్టపడతారు. ఇడ్లీ సాంబార్‌ని మహా ఇష్టంగా తింటారు. ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లో స్నేహితులతో కలిసి తరచూ వెళ్లే మైసూర్‌ కేఫేకి ఇప్పటికీ వెళుతుంటారు. అక్కడ ఆయనకి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. అన్ని రకాల వంటకాలు చేసే చెఫ్‌లు ఇంట్లో ఉంటారు. రాత్రి కుటుంబ సభ్యులందరితో కలిసే భోంచేస్తారు. 

తల్లి ఆశీర్వాదం లేనిదే అడుగు బయట పెట్టరు

సాంప్రదాయ ఉమ్మడి కుటుంబంలో పెరిగిన ముఖేశ్‌కి కుటుంబ విలువలంటే ఎంతో గౌరవం. కుటుంబసభ్యులకి, బంధువులకు కచ్చితంగా సమయం కేటాయిస్తారు. ఇంట్లో జరిగే శుభకార్యాలకి అందరినీ పిలుస్తారు. కూతురు ఇషా అంబానీ, తల్లి కోకిలా బెన్‌ అంటే అమితమైన ప్రేమ. ప్రతి రోజు తల్లి ఆశీర్వాదం తీసుకోనిదే ఇంటి నుంచి అడుగు బయటపెట్టరు. అలాగే ఇషాను అత్తారింటికి పంపుతూ ముఖేశ్‌ కన్నీటి పర్యంతమయ్యారు. కూతురంటే ఎంత ప్రేమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తన పెద్ద కోడలు, ఆకాశ్‌ అంబానీ భార్య శ్లోకా మెహతా పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులందరి శుభాకాంక్షలతో కూడిన వీడియోని విడుదల చేసి ఆమెని ఆశ్చర్యపరిచారు. ఇలా బంధాలకు బాగా విలువిచ్చే ముఖేశ్‌ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. 

సాంప్రదాయాలంటే మహా గౌరవం

ముఖేశ్‌ది గుజరాతీ హిందూ కుటుంబం. సాంప్రదాయాలంటే మహా గౌరవం. తన ఇద్దరు పిల్లలు ఆకాశ్‌, ఇషా పెళ్లిళ్లు హిందూ సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. దేవుడి మీద ముఖేశ్‌కి అపార విశ్వాసం. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు. మన కృషి, పట్టుదలకు దేవుడి అనుగ్రహం తోడైతే విజయం ఖాయమంటారు. ఇంట్లోనే పెద్ద దేవాలయం నిర్మించారు. ప్రతి పండగని సాంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు. ఇటీవల వినాయక చవితిని అతిరథమహారథులందరినీ పిలిచి ఘనంగా నిర్వహించారు. 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు

ముంబయిలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ముఖేశ్‌ ఇల్లు ఉంటుంది. ఆంటిలియా పేరుతో నిర్మించిన ఈ భవనం భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. 27 అంతస్తుల ఈ ఇంట్లో అత్యాధునిక హంగులతో కూడిన థియేటర్‌, స్విమ్మింగ్‌ ఫూల్‌, ఒక మినీ బార్‌(అతిథుల కోసం), 160 కార్లు పట్టే గ్యారేజ్, రెస్టారెంట్‌, ఐస్‌క్రీం పార్లర్‌, మూడు హెలిప్యాడ్‌లు ఉంటాయి. అన్ని రకాల వంటకాలు చేసే చెఫ్‌లు ఉంటారు. దీని నిర్వహణకే దాదాపు 600మంది సిబ్బంది అవసరం అంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఓ పెద్ద పార్క్‌ కూడా ఇంట్లోనే ఉంటుంది. ఖాళీ సమయాల్లో ముఖేశ్‌ ఇక్కడే సేద తీరుతారు. ఇక కార్లంటే ముఖేశ్‌కి మహా సరదా. డ్రైవర్లున్నప్పటికీ.. ఆఫీస్‌కి సొంతంగా డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లడానికే ఇష్టపడతారు. ఆయన వద్ద ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు చాలా ఉన్నాయి. మెర్సిడెస్‌ మేబ్యాక్‌ 600గార్డ్‌, మేబ్యాక్‌ 62, బీఎండబ్ల్యూ 760ఎల్‌ఐ, రోల్స్‌ రాయిస్‌ ఫాంటమ్‌ ఆయన వద్ద కార్ల జాబితాలో కొన్ని. 

వారానికి మూడు సినిమాలు.. 

విశ్రాంతి కోసం ముఖేశ్‌ బాలీవుడ్‌ సినిమాల్ని బాగా చూస్తారు. ఇంట్లోనే థియేటర్‌ ఉండడంతో ఖాళీ సమయాల్లో అలా ఓ లుక్కేస్తుంటారు. అలా వారానికి కనీసం మూడు సినిమాలైనా చూస్తారట. ఇక ఆటలన్నా ముఖేశ్‌కి మహా ఇష్టం. ఐపీఎల్‌లోని ముంబయి ఇండియన్స్‌ జట్టు వీరిదే. స్వయంగా మైదానానికి వెళ్లి ఆటని ఆస్వాదిస్తారు. కాలేజీ రోజుల్లో హాకీ బాగా ఆడేవారట. ఇక బిజినెస్‌లో రాణించాలంటే కొత్త తరం అభిరుచులెలా ఉన్నాయో గమనించాలంటారాయన. అందుకోసం ఆయన తన పిల్లలు, వారి స్నేహితులు, కంపెనీలోని యువ ఉద్యోగులతో మాట్లాడుతుంటారు. నిరంతరం అప్‌డేట్‌గా ఉండడం కోసం పుస్తకాలు బాగా చదువుతారు. 

అడుగుపెట్టిన ప్రతి రంగంలో విజయం సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు ముఖేశ్‌ అంబానీ. పిల్లలు పెద్దవారవడంతో క్రమంగా వారిని వ్యాపారాల్లో భాగస్వాములని చేస్తున్నారు. రానున్న 20ఏళ్లు భారత్‌దేనని.. దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపే బాధ్యత యువతపైనే ఉందంటారాయన. అందుకోసం లక్ష్యాల్ని నిర్దేశించుకొని దేశాభివృద్ధిలో భాగం కావాలని యువకులకు సందేశం ఇస్తుంటారు ముఖేశ్‌.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.