close

తాజా వార్తలు

ఒక్క చెక్కు బౌన్స్‌తో కుంభకోణం బయటకు..

 సీజీ పవర్‌ వ్యవహారం బయటపడిన వైనం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ఒక్క చెక్కు బౌన్స్‌తో రూ.3,000 కోట్ల విలువైన కుంభకోణం బయట పడింది. సీజీ పవర్‌లో ఇటీవల జరిగిన అవకతవకలపై వైష్‌ అసోసియేట్స్‌ నిర్వహించిన దర్యాప్తులో పలు ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ఉన్నత స్థాయి పదవుల్లోని వ్యక్తులు విచ్చలవిడిగా నిధులను మళ్లించి  కంపెనీలను గుల్ల చేసిన వైనం చూసి దర్యాప్తు సంస్థ కూడా నోరెళ్లబెట్టింది. దర్యప్తులోని కీలక విషయాలను ప్రముఖ ఆంగ్లపత్రిక  ఎకనామిక్‌ టైమ్స్‌ బయటపెట్టింది. 

ఆరోపణలు ఇవీ..

సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌లోని ఉన్నత స్థాయి వ్యక్తులు కనీసం కంపెనీ నిబంధనలు పాటించకుండా నిధులను మళ్లించారు. ఈ క్రమంలో బోర్డు అనుమతులు కూడా తీసుకోలేదు. ఈ అవకతవకల విలువ రూ.3,000 కోట్ల మేరకు ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ లావాదేవీల నుంచి అవంత హోల్డింగ్స్‌ లబ్ధిపొందింది. దీంతోపాటు కంపెనీ బయటి మార్గాల ద్వారా కూడా నిధులను మళ్లించింది. 

లావాదేవీలు ఇవే..

* 2016లో సీజీ పవర్‌కు చెందిన నాసిక్‌లోని భూమి, కర్మాగారాన్ని బ్లూగార్డెన్‌ ఎస్టేట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు రూ.200 కోట్లకు విక్రయించారు. ఈ నిధుల్లో రూ.145 కోట్లను అవంత హోల్డింగ్స్‌(ఏహెచ్‌ఎల్‌)కు,  రూ.53 కోట్ల నిధులను యాక్టాన్‌ అనే కంపెనీకి బదలాయించారు. ఇక్కడ  నిధులు బదిలీ చేసిన కంపెనీలు రెండూ ఎటువంటి వ్యాపారాలు చేయవని తేలింది. దీంతో వీటిని డమ్మీ కంపెనీలుగా భావిస్తున్నారు. ఈ రెండు కంపెనీలను 2016 మార్చిలో ఒకే చిరునామాతో ప్రారంభించినట్లు తేలింది. ఈ రెండిటి మూలధనం రూ.1,00,000 మాత్రమే. 
* 2017లో సీజీ పవర్‌కు చెందిన ముంబయిలోని కంజూర్‌ మార్గ్‌లోని భూమిని బ్లూగార్డెన్‌ ఎస్టేట్‌కు రూ.190 కోట్లకు విక్రయించింది. దీనికి బోర్డు అనుమతులు లేవు. వాస్తవానికి అప్పటికే ఈ భూమిని రూ.499 కోట్లకు విక్రయించేందుకు ఒక కంపెనీతో ఒప్పందం చేసుకొంది.. కానీ, ఆ తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండానే దీనిని బ్లూగార్డెన్‌కు విక్రయించడం గమనార్హం. వచ్చిన డబ్బును మళ్లీ  యాక్టాన్‌ కంపెనీకి మళ్లించింది. వీటిలో  ఇద్దరు సీజీ ఉద్యోగులకు ఒకరికి రూ.3కోట్లు, మరొకరికి రూ.కోటి చెల్లించింది. కంపెనీ నుంచి నిధులకు బయటకు మళ్లించడానికి ఈ మార్గాన్ని ఎంచుకొన్నట్లు వైష్‌ అసోసియేట్స్‌ పేర్కొంది.  ఈ లావాదేవీలకు బోర్డు అనుమతలు కానీ, రిస్క్‌ అండ్‌ ఆడిట్‌ కమిటీ అనుమతులు కానీ లేవు. 

బయటపడింది ఇలా..

అవంతి హోల్డింగ్స్‌ సంస్థ యస్‌ బ్యాంక్‌లో రూ.500 కోట్ల రుణం తీసుకొని రీపేమెంట్‌ కోసం పోస్టు డేటెడ్‌ చెక్కులను ఇచ్చింది. ఏప్రిల్‌ 2న యస్‌బ్యాంక్‌కు సీజీ పవర్‌ జారీ చేసిన ఒక చెక్కు బౌన్స్‌ అయింది. అప్పటికే మార్చి నుంచి  సీజీ పవర్‌ మాతృ సంస్థ అవంత హోల్డింగ్స్‌ రుణదాతలు వద్ద తాకట్టు పెట్టిన షేర్లను జప్తు చేసుకోవడం మొదలైంది. ఈ క్రమంలో చెక్‌ బౌన్స్‌ కావడంతో ఆపరేషన్స్‌ కమిటీ దృష్టికి ఈ విషయం వచ్చింది. ఆ చెక్కును గమనించి కమిటీ ఒక విషయం గుర్తించింది. సీజీ బోర్డు అనుమతి లేకుండానే ఈ చెక్కును జారీ చేసినట్లు తేల్చింది. దీంతో యస్‌బ్యాంక్‌ బౌన్స్‌ అయిన చెక్‌ స్థానంలో మరో చెక్కును ఇవ్వాలని కోరింది. దీనికి సీజీ బోర్డు నిరాకరించింది. దీంతో యస్‌బ్యాంక్‌ న్యాయ పోరాటానికి దిగింది. చెక్‌పై సంతకం చేసిన కంపెనీ డైరెక్టర్లు, మాజీ సీఎఫ్‌వో వి.ఆర్‌. వెంకటేష్‌, బి.హరిహరన్‌లకు లీగల్‌ నోటీసులు జారీ చేసింది. బోర్డు అనుమతులు లేకుండా ఇటువంటివి ఐదు లావాదేవీలు జరిగినట్లు ఆపరేషన్స్‌ కమిటీ గుర్తించింది. 
నిధులను మళ్లించడానికి  సీజీ సంస్థకు విదేశాల్లోని అనుబంధ విభగాలను వాడుకున్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. గౌతమ్‌ థాపర్‌ ప్రమోటర్‌గా ఉన్న అవంత ఇంటర్నేషన్‌ అనే సంస్థకు సీజీ నుంచి భారీ ఎత్తున వడ్డీ రహిత రుణం మంజూరైనట్లు తేలింది. దీనికి కూడా బోర్డు అనుమతులు లేవు. సీజీ మిడిల్‌ ఈస్ట్‌ అనే సంస్థ 40మిలియన్‌ డాలర్ల టర్మ్‌ లోన్‌ తీసుకొని ఆ మొత్తాన్ని సోలార్సీస్‌ అనే అవంత గ్రూప్‌ అనుబంధ సంస్థకు మళ్లించింది. ఇటువంటి మరిన్ని లావాదేవీలు బయటకు వస్తున్నాయి.  ఈ అక్రమాలు బయటకు రావడంతో ఛైర్మన్‌  గౌతమ్‌ థాపర్‌, సీఎఫ్‌వోలను రాజీనామా చేయాలని బోర్డు కోరింది. ఇక కంపెనీ సీఈవోను దీర్ఘకాలం సెలవుపై పంపింది. 
ఈ పరిణామాలపై మాట్లాడేందుకు యస్‌బ్యాంక్‌ నిరాకరించింది. మిగిలిన  నాలుగు లావాదేవీలపై కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇక సీజీ పవర్‌, దాని ప్రమోటర్‌ గౌతమ్‌ థాపర్‌లు ఈ వ్యవహారంపై నోరు మెదపలేదు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.