close

తాజా వార్తలు

కాలికి వైద్యం కోసం వస్తే.. చేయిని పోగొట్టారు

విజయవాడ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో యువకుడికి వైకల్యం

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: కాలికి దెబ్బ తగిలిందని యువకుడు వస్తే వైద్యులు  నిర్లక్ష్యంగా చేసిన చికిత్స వికటించి అతని చేయి చచ్చుబడిపోయిన సంఘటన విజయవాడలో వెలుగుచూసింది. ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. చేయి పనిచేయడం లేదంటూ మళ్లీ ఆసుపత్రికి వస్తే.. ఎగతాళిగా మాట్లాడి మరీ తీసుకెళ్లి నరాల సమస్యకు పిండి కట్టుకట్టి పంపించేశారు. బాధితుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కె.కొత్తపూడికి చెందిన గుమ్మడి రాజు(27) విజయవాడలోని ఒక దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. మూడు నెలల కిందట ద్విచక్రవాహన స్టాండ్‌ కాలికి తగలగడంతో అతనికి గాయమైంది. విజయవాడ ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వెళ్లగా.. విధుల్లో ఉన్న వైద్యుడు కాలు గాయానికి కట్లు వేసి కట్టు కట్టాడు. ఆ తర్వాత ఇద్దరు సిబ్బంది వచ్చి రెండు ఇంజక్షన్లను ఒకేసారి రెండు చేతులకూ చేశారు. ఇంటికి వెళ్లిన రాజుకు మరుసటి రోజు ఒక చేయి కదపడానికి వీలులేకుండా వేలాడుతోంది. దీంతో మళ్లీ ఆసుపత్రికి వచ్చి వైద్యులకు విషయం చెప్పగా ‘మేం ఇంజక్షన్‌ ఇవ్వడం వల్లే ఇలా అయ్యిందా ఏంటి’ అంటూ  ఓ వైద్యుడు ఎగతాళిగా మాట్లాడారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఎముకలు, నరాల విభాగ వైద్యులు సెలవులో ఉండడంతో సిబ్బంది తీసుకెళ్లి పిండికట్టు వేస్తే తగ్గిపోతుందంటూ తీసుకెళ్లి కట్టారు. అయితే ఎముకలు విరిగినప్పుడు కట్టే పిండికట్టు ఎందుకు కట్టారో తెలియక.. అనుమానంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి రాజు చూపించుకున్నాడు.  న్యూరాలజీ వైద్యుడు పరీక్షించి.. నరాలకు సంబంధించిన సమస్య ఏర్పడితే పిండికట్టు కట్టడం ఏంటని అనుమానించారు. ఆ తర్వాత కట్టు విప్పేసి.. పరీక్షలు నిర్వహించగా ఇంజక్షన్‌ను సరిగా ఇవ్వకపోవడంతో నరాలకు తగిలి చేయి పనిచేయడం లేదని చెప్పారు. చేయి తిరిగి మామూలుగా అయ్యే పరిస్థితి ఉండదని తెలిపారు. దీంతో బాధితుడిని తీసుకుని అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వచ్చి వైద్యులను నిలదీయగా ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, తాము ఆరు నెలల పాటు న్యూరాలజీ వైద్యునితో చికిత్స అందిస్తామని, ఫిజియోథెరఫీ చేయిస్తామంటూ నమ్మబలికారు. ఆ తర్వాత కూడా మందులను ఇస్తామని, ఒకవేళ చేయి అప్పటికీ పనిచేయకపోతే మాత్రం అంగవైకల్య ధ్రువపత్రం ఇప్పించి.. పరిహారంగా రూ.లక్ష ఇస్తామంటూ ఓ వైద్యుడు బేరసారాలు ఆడాడంటూ బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. తనకు డబ్బులు అవసరం లేదని, తన చేయిని తిరిగి బాగు చేయాలంటూ బాధితుడు, అతని బంధువులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట శుక్రవారం ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనిపై కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఎ.ఎం.డి.ఇంతియాజ్‌కు వారు ఫిర్యాదు చేశారు. ఏం జరిగిందో విచారణ చేయించి బాధితుడికి సరైన వైద్యం అందిస్తామంటూ కలెక్టర్‌ హామీ ఇచ్చారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.