close

తాజా వార్తలు

దుర్గమ్మ వేడుకలకు రారండోయ్‌

దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు

రెండు తెలుగు  రాష్ట్రాల నుంచి  లక్షల మంది రాక 

బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 29 నుంచి అక్టోబరు 08 వరకు పది రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. గతేడాది 13.39 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈసారి పది రోజుల్లో కనీసం 15లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు వరుసల్లో పొడవైన క్యూలైన్లు, పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేశారు. వచ్చే ప్రతి భక్తుడికి సాఫీగా దర్శనం జరిగేలా అన్నదానం, ప్రసాదం స్వీకరించేలా ముందే సిద్ధం చేసి ఉంచుతున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను విజయవాడకు నడుపుతోంది. హైదరాబాద్‌, విశాఖ, తిరుపతి సహా పలు ప్రాంతాల నుంచి బస్సులను నడుపుతున్నారు. దసరా ఉత్సవాల నేపథ్యంలో ‘ఈనాడు’ అందిస్తున్న ప్రత్యేక కథనం.

దర్శనం టిక్కెట్లు..
ఉత్సవాలు జరిగే పది రోజులు కొండ దిగువ నుంచి నాలుగు క్యూలైన్లలో దర్శనానికి అనుమతిస్తారు. కొండపైకి వచ్చాక.. ఓం టర్నింగ్‌ వద్ద నుంచి ఐదు క్యూలైన్లుగా విడగొట్టారు. వీటిలో రెండు ఉచిత దర్శనం లైన్లుంటాయి. ఒకటి    రూ.100 ముఖ మండపం, ఒకటి రూ.300 అంతరాలయ దర్శనం క్యూలైన్లు ఉన్నాయి. మరొక లైను వీఐపీ భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వీరు కూడా రూ.300 టిక్కెట్‌ను కొనుగోలు చేయాలి ఉంటుంది. టిక్కెట్లను క్యూలైన్లకు ఆనుకుని ఏర్పాటు చేసిన కౌంటర్లు, పున్నమిఘాట్‌ వద్ద అందుబాటులో ఉంటాయి. కొండపై ఓం టర్నింగ్‌ వద్ద కూడా టిక్కెట్ల కౌంటర్‌ ఉంటుంది. 

ప్రత్యేక పూజలు
ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక లక్ష కుంకుమార్చన, విశేష చండీ హోమం పూజలు నిర్వహిస్తారు. ప్రతి రోజూ లక్ష కుంకుమార్చన పూజను ఉదయం 7 గంటల నుంచి 9 వరకూ, ఉదయం 10గంటల నుంచి 12వరకూ రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. ఒక టిక్కెట్‌ ధర రూ.3వేలు. ఇద్దరు ఉభయదాతలు పూజకు హాజరుకావొచ్చు. మూలానక్షత్రం రోజున జరిగే లక్ష కుంకుమార్చన పూజ ధర రూ.5వేలుగా నిర్ణయించారు. విశేష చండీహోమం టిక్కెట్‌ ధర రూ.4వేలు. ఈ ప్రత్యేక పూజల టిక్కెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో దాదాపు అన్ని రోజులకూ అమ్ముడయ్యాయి. ఈ పూజల టిక్కెట్లు తీసుకున్న ఉభయదాతలకు దసరాలో ప్రత్యేక దర్శనం కూడా కల్పిస్తారు. విజయవాడ వన్‌టౌన్‌లోని గాంధీజీ మున్సిపల్‌ హైస్కూల్‌, హైదరాబాద్‌ వైపు నుంచి వచ్చేవారికి పున్నమిఘాట్‌ వద్ద నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. అక్కడికి చేరుకుంటే వీరిని కొండపైకి తీసుకెళ్లి ప్రత్యేక పూజల తర్వాత, రూ.300 దర్శనానికి అనుమతిస్తారు.

స్నాన ఘట్టాలు
భక్తులు కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు బ్యారేజీ కింద వైపున పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌లలో ఏర్పాట్లు చేశారు. బ్యారేజీలో నీటిమట్టం అధికంగా ఉన్నందున దుర్గాఘాట్‌లో స్నానాలకు ఈ ఏడాది అనుమతించడం లేదు. కృష్ణవేణి, పద్మావతి ఘాట్‌లలో జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేశారు. 

వీఐపీల సమయం
ప్రముఖులు వారికి ప్రత్యేకంగా కేటాయించిన సమయాల్లోనే దర్శనాలకు రావాలని అధికారులు సూచించారు. ఎవరికి నచ్చిన వేళల్లో వారొస్తే సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఉదయం 7గంటల నుంచి 8, 11 గంటల నుంచి 12, మధ్యాహ్నం 3గంటల నుంచి 4, రాత్రి 8గంటల నుంచి 9 మధ్యలో మాత్రమే వీఐపీ భక్తులు దర్శనానికి రావాలని సూచించారు. వీరి కోసం విజయవాడ బందరు రోడ్డులో ఉన్న స్టేట్‌ గెస్ట్‌హౌస్‌, పున్నమిఘాట్‌లలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీరు ముందుగా ప్రోటోకాల్‌ పాయింట్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించేందుకు టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. 

ప్రత్యేక బస్సులు
భారీ సంఖ్యలో వృద్ధులు, వికలాంగులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైల్వేస్టేషన్‌, బస్టేషన్‌ నుంచి వీరి కోసం ఉచిత దేవస్థానం బస్సులను ఏర్పాటు చేశారు. పీఎన్‌బీఎస్‌ బస్టాండ్‌కు ఆనుకుని ఉన్న రాజీవ్‌గాంధీ పార్కు వద్ద నుంచి ప్రత్యేక బస్సులు నేరుగా ఘాట్‌ రోడ్డు మీదుగా కొండపైకి వీరిని తీసుకెళ్లి దించుతాయి. అక్కడ ఉండే స్వచ్ఛంద సేవకులు, పోలీసులు, భవానీ సేవాదళ్‌ సభ్యులు వీరిని తీసుకెళ్లి దగ్గరుండి దర్శనం చేయించి తీసుకొస్తారు.  

క్లోక్‌ రూమ్‌లు
ఘాట్‌ రోడ్డులో ఎక్కడా క్లోక్‌రూంలు ఉండవు.కొండ దిగువనే రథం సెంటర్‌,   నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో తమ సామగ్రి, చెప్పులు భద్రపరుచుకున్నాకే దర్శనానికి వెళ్లాలి. తిరిగి కిందకు వచ్చాక వాటిని తీసుకుని వెళ్లిపోవచ్చు. 
కేశఖండనశాల..
కృష్ణవేణిఘాట్‌ వద్ద సీతమ్మవారి పాదాలు ప్రాంతానికి ఎదురుగా కేశఖండనశాల ఏర్పాటు చేశారు. ఇక్కడే భక్తులు తలనీలాలు సమర్పించాలి. రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌కు మధ్యలో ఉండే ఈ ప్రాంతంలో భక్తులు తలనీలాలు సమర్పించిన తర్వాత ఎదురుగానే స్నానఘట్టాలు ఉన్నాయి.  
నగరోత్సవం, సాంస్కృతిక  ప్రదర్శనలు...

ఆలయంలో ఉత్సవాలు జరిగే పది రోజులూ నగరోత్సవం వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజూ సాయంత్రం 6గంటలకు నగరోత్సవం ఆరంభమవుతుంది. శివాలయం మెట్ల మార్గం వద్ద నుంచి స్వామివారి ఉత్సవ విగ్రహాలను మేళతాళాల మధ్య ఊరేగిస్తారు. అర్జునవీధి, రథం సెంటర్‌, వినాయక ఆలయం మీదుగా తిరిగి ఘాట్‌రోడ్డు వద్దకు వచ్చి.. కొండపైకి ఊరేగింపుగా వెళ్తుంది. నగరోత్సవంలో భాగంగా బ్రహ్మరథం, సంకీర్తనలు, కోలాట బృందం, నృత్య ప్రదర్శనలు, శాక్సోఫోన్‌ వాయిద్యం, కేరళ కళాకారుల ప్రదర్శనలు, సన్నాయి తదితర ప్రదర్శనలతో వైభవంగా ఊరేగింపు జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాల కోసం కళా వేదికను సిద్ధం చేశారు. 

ప్రసాదం కౌంటర్లు
అమ్మవారి దర్శనానికి తరలివచ్చే ప్రతి భక్తుడికీ కావాల్సినంత ప్రసాదం అందించేందుకు ముందుగానే ఏర్పాట్లు చేశారు. పది రోజుల ఉత్సవాల కోసం 20లక్షల లడ్డూ ప్రసాదం, 25వేల కిలోల పులిహోర అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేశారు. గతేడాది 18.83లక్షల లడ్డూలు, 20,880 కిలోల పులిహోర పది రోజుల్లో అమ్ముడయ్యాయి. ఈసారి మరిన్ని ఎక్కువ సిద్ధం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం ముందుగానే తయారు చేసి ఉంచుతున్నారు. ప్రసాదాల విక్రయాల కోసం కొండ దిగువన కనకదుర్గానగర్‌లో భక్తులు దిగి వచ్చే మార్గంలో 12 కౌంటర్లు, ఘాట్‌రోడ్డులో మరో కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌, బస్టేషన్లలోనూ ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయంలో ఉచిత ప్రసాదంగా పులిహోర అందించేందుకు 20వేల కిలోలను ఎప్పటికప్పుడు సిద్ధం చేయనున్నారు.

నీరు పాలు
రెండున్నర కిలోమీటర్ల పొడవైన క్యూలైన్లు కావడంతో భక్తులు నడిచి రావడానికి చాలా సమయం పడుతుంది. దారి పొడవునా వారికి మంచినీరు, మజ్జిగ, చిన్న పిల్లలకు వేడి పాలు అందించే ఏర్పాటు చేశారు. వినాయక మండపం దగ్గరి నుంచి క్యూలైన్‌లోకి ప్రవేశించాక.. భక్తుల రద్దీని బట్టి కనీసం గంటకు పైగా సమయం పడుతుంది.  క్యూలైన్లకు సమీపంలో ప్రథమ చికిత్సా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ఒక్కసారి క్యూలైన్లలో  ప్రవేశిస్తే...
కొండ దిగువన రెండున్నర కిలోమీటర్ల పొడవునా క్యూలైన్లను ఏర్పాటు చేశారు. విజయవాడ ప్రధాన నగరం వైపు నుంచి వచ్చే భక్తులు నేరుగా వినాయక మండపం వద్ద ఉన్న క్యూలైన్లలో ప్రవేశిస్తే.. దర్శనం చేసుకున్నాకే తిరిగి బయటకు వస్తారు. భవానీపురం వైపు వచ్చే భక్తులు కుమ్మరిపాలెం సెంటర్‌ నుంచి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో ప్రవేశించాల్సి ఉంటుంది. కొండ కింద నుంచి నాలుగు క్యూలైన్లలో వచ్చాక.. పైకి వెళ్లాక ఐదుగా విభజించారు. క్యూలైన్లను పక్కాగా ఏర్పాటు చేశారు. ప్రతి ఐదు మీటర్ల దూరానికి ఒక అత్యవసర ద్వారం ఏర్పాటు చేశారు. భక్తులకు ఏదైనా ఇబ్బంది వస్తే.. వీటిలోంచి బయటకు వచ్చేయొచ్చు. వీరికి అక్కడ సిద్ధంగా ఉండే స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సహాయం చేస్తారు. దర్శనం చేసుకున్న తర్వాత భక్తులంతా రెండు మార్గాలలో కిందకు వెళ్లిపోతారు. మహామండపం మెట్ల మార్గం, శివాలయం వద్ద ఉన్న రాయబార మండం వద్ద నుంచి కిందకు వెళ్లిపోవచ్చు. 

పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
భక్తులు భారీగా తరలివస్తున్నందున పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. 4500 మంది పోలీసులు నిరంతరం మూడు విడతల్లో భద్రతను పర్యవేక్షిస్తారు. భక్తులకు మార్గదర్శనం చేయడం దగ్గర నుంచి క్యూలైన్లు, దర్శనం సజావుగా చేయించడం, కిందకు దిగే దగ్గర, రైల్వేస్టేషన్‌, బస్టేషన్‌ ప్రాంతాలన్నింటిలో పోలీసులు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, పార్కింగ్‌ ప్రాంతాల్లో పర్యవేక్షణ అన్నీ పోలీసుల కనుసన్నల్లోనే జరుగుతాయి. దీనికితోడు 175 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భక్తుల సంచారం అధికంగా ఉండే అన్ని ప్రాంతాలూ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. వీటిని పర్యవేక్షించేందుకు రెండు కమాండ్‌ కంట్రోల్‌ యూనిట్లను నెలకొల్పారు. కొండ పైభాగంలో ఒకటి, కిందన దుర్గాఘాట్‌లో ఒకటి సీసీ కెమెరాల పర్యవేక్షణ యూనిట్లను ఏర్పాటు చేశారు. నిరంతరం వీటిలో     నిశితంగా పరిశీలించనున్నారు.

పార్కింగ్‌ ప్రత్యేక యాప్‌
భక్తుల సౌకర్యార్థం పోలీసులు ప్రత్యేక పార్కింగ్‌ యాప్‌ను తీసుకొచ్చారు. గతేడాది దాదాపు 21,500 మంది దీనిని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఈసారి మరింత ఎక్కువ మంది ఉపయోగించుకునేలా పోలీసులు విస్తృతంగా ప్రచారం చేపట్టనున్నారు. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో పనిచేసేలా యాప్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో పనిచేసేలా యాప్‌ను రూపొందించారు. ప్లేస్టోర్‌ నుంచి ‘దసరా పార్కింగ్‌ యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జీపీఎస్‌ ఆన్‌ చేసుకుంటే అక్కడికి సమీపంలోని పార్కింగ్‌ ప్రదేశం వివరాలు కనిపిస్తాయి. ఎంత దూరంలో ఉంది? ఏమార్గంలో వెళ్లాలో  చూపిస్తుంది.  ఆ పార్కింగ్‌ ప్రదేశంలో ఎంత మేర ఖాళీ ఉందో కూడా తెలుసుకోవచ్చు. అక్కడ ఖాళీ లేకపోతే సమీపంలోని మరో పార్కింగ్‌ ప్రాంతం ఎక్కడ ఉందో చిత్ర పటంలో చూపిస్తుంది.

ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం నిత్యం కనీసం 35వేల మంది చొప్పున పది రోజుల్లో 3.5లక్షల మంది భక్తులకు అన్నదానం చేయనున్నారు. దీనికోసం కొండ దిగువన అర్జునవీధిలోని అన్నదాన సత్రంలో రోజూ ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4గంటల వరకూ, తిరిగి సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 9.30 వరకూ అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది. 
సహాయం కోసం  టోల్‌ఫ్రీ...
భక్తుల సహాయం కోసం 24గంటలూ అందుబాటులో ఉండేలా దేవస్థానం టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది. ఏ సమాచారం కోసమైనా ఈ నంబరుకు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చు. అన్ని ప్రధాన ప్రదేశాలలో మైక్‌ ప్రచారం ఏర్పాటు చేశారు. విజయవాడ పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలోనూ సమాచార కేంద్రాలను బస్టేషన్‌, రైల్వేస్టేషన్‌  సహా భక్తులు వచ్చే మార్గంలో అనేక చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. 

దేవస్థానం టోల్‌ఫ్రీ నంబరు: 1800 425 9099

భక్తులకు వ కోసం వీరు...
భక్తుల సేవ కోసం దేవాదాయశాఖ సిబ్బంది 700 మంది, పారిశుద్ధ్య నిర్వహణ కోసం మరో 700 మంది పని చేస్తారు. మరో 900 మంది ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భక్తుల సేవలో పాల్గొంటారు.  

 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.