close

తాజా వార్తలు

పుకార్లను నిజం చేసిన హిందుజా సోదరులు..!

అశోక్‌లేల్యాండ్‌ సొంతంతో ఘన విజయం

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం : ‘ఐకమత్యమే మహాబలం’ ఈ నానుడి అపరకుబేరులైన ‘హిందుజా’ సోదరులకు సరిగ్గా సరిపోతుంది. మనల్ని వందల సంవత్సరాల పాటు పాలించిన బ్రిటీష్‌ గడ్డపై అత్యంత ధనవంతులుగా నిలిచి భారతీయుల సత్తా చాటారు. చిన్న చిన్న ఆస్తి తగాదాలతో ఏళ్లనాటి బంధాన్ని మరచి సొంత అన్నదమ్ములపై పగలు పెంచుకుంటున్న ఈ రోజుల్లో.. రూ.లక్షల కోట్ల ఆస్తుల్ని ఇంకా ఉమ్మడిగానే నిర్వహిస్తున్నారు. కలిసి ఉండడంలో ఉన్న మాధుర్యమేంటో తమ వ్యాపారాల్లో సాధిస్తున్న విజయాల ద్వారా శ్రీచంద్‌, గోపీచంద్‌, ప్రకాశ్‌, అశోక్‌(హిందుజా సోదరులు)చాటి చెబుతున్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా.. ‘మన పని మనం చేస్తూ పోతే ఫలితం అదే వస్తుంది’ అని నమ్మే ‘హిందుజా’ సోదరుల ప్రయాణం చూద్దాం..!

శిఖర్‌పూర్‌ నుంచి లండన్‌ వరకు..
హిందుజా సోదరుల తండ్రి పరమానంద్‌ హిందుజా ప్రస్తుతం పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లిన సింధ్‌ ప్రావిన్స్‌లోని శిఖర్‌పూర్‌ అనే పట్టణంలో 1914లో వ్యాపారాన్ని ప్రారంభించారు. అనంతరం ముంబయిలోని వ్యాపార అవకాశాల్ని గమనించి అక్కడికి మకాం మార్చారు. కార్పెట్లు, డ్రైఫ్రూట్స్‌ను దిగుమతి చేసుకొని వస్త్రాలు, మసాలాలు, తేయాకు ఎగుమతి చేసే వ్యాపారం ప్రారంభించారు. మంచి లాభాలు గడించడంతో ఇరాన్‌లో ఉన్న వ్యాపార అవకాశాల్ని చేజిక్కించుకునేందుకు తొలి విదేశీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అలా హిందూజా గ్రూప్‌కి అంకురం పడింది. నాటి నుంచి పక్కా వ్యాపార సూత్రాల్ని పాటిస్తూ.. ఎదురు లేని సంస్థగా ఎదిగింది. 1975 తర్వాత ఇరాన్‌లో రాజకీయ సంక్షోభం కారణంగా తమ వ్యాపార కేంద్రాన్ని లండన్‌కి మార్చారు. నేటికీ అది లండన్‌లోనే కొనసాగుతోంది. 

ఒక్కొక్కరిగా వ్యాపారంలోకి..
చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పనితీరును గమనిస్తూ పెరిగిన హిందుజా సోదరులకు సహజంగానే వ్యాపార విలువలు, అందులోకి మెలకువలు అబ్బాయి. అందరికంటే పెద్దవాడైన శ్రీచంద్‌ చిన్న వయసులోనే వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా నిలిచారు. 1952లో పూర్తిస్థాయిలో బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత నాలుగేళ్లకు అన్నకు సాయంగా గోపిచంద్‌ హిందుజా రంగంలోకి దిగారు. అలా కొన్ని రోజుల తర్వాత మరో ఇద్దరు సోదరులు ప్రకాశ్‌, అశోక్‌ సైతం బాధ్యతలు పంచుకొన్నారు. తన తండ్రి పరమానంద్.. వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారో స్వయంగా గమనించిన వీరికి అందులోని కిటుకులు, సూత్రాలు, నియమాలు సహజంగానే అలవడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన హిందుజా గ్రూప్‌ వ్యాపారాలను ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో సమర్థంగా నిర్వహిస్తున్నారు. పెద్దవారైన శ్రీచంద్‌, గోపీచంద్‌ ఇద్దరూ లండన్‌లోనే ఉంటుండగా.. ప్రకాశ్‌ జెనీవాలో,  చిన్నవాడైన అశోక్‌ భారత్‌లో వ్యాపారాలను చూస్తున్నారు.

వదంతిని నిజం చేస్తూ.. అశోక్‌ లేల్యాండ్‌ను సొంతం చేసుకొని..
ఓ వదంతిని నిజం చేస్తేనే అశోక్‌ లేలాండ్‌ వీరి సొంతమైంది. అశోక్‌ మోటార్స్‌ పేరిట బస్సులు, లారీలను తయారీ సంస్థను తొలుత రఘునందన్‌ సారన్ అనే వ్యాపారవేత్త 1948లో ప్రారంభించారు. తదనంతరం దీన్ని బ్రిటన్‌కు చెందిన లేల్యాండ్‌ మోటార్స్‌ కొనుగోలు చేసింది. అయితే, 1985లో దీన్ని హిందూజా గ్రూప్‌, ఇవేకో గ్రూప్‌ సంయుక్తంగా కొనుగోలు చేశాయి. అయితే అశోక్‌ లేల్యాండ్‌ను పూర్తిగా హిందుజా గ్రూప్‌ సొంత చేసుకోనుందని అప్పట్లో కొన్ని వార్తా పత్రికల్లో వదంతులు వచ్చాయి. ఈ విషయాన్ని అశోక్‌ లండన్‌లో ఉన్న తన సోదరులు శ్రీచంద్‌, గోపీచంద్‌లకు తెలిపారు. దీంతో ‘ఎలాగూ వదంతాలు వచ్చాయి. ఇక నిజం చేస్తే తప్పేముంది’ అంటూ దాన్ని సవాల్‌గా స్వీకరించారట. అలా 2007లో అశోక్‌ లేల్యాండ్‌లోని 51శాతం వాటా హిందూజా గ్రూప్‌ సొంతమైంది. ప్రస్తుతం ఇది భారత్‌లో రెండో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థగా.. ప్రపంచంలో ట్రక్కుల తయారీలో పదో అతిపెద్ద సంస్థగా నిలిచింది. భారత సైన్యానికి రవాణా వాహనాలు అందిస్తున్న అతిపెద్ద సంస్థ కూడా ఇదే కావడం విశేషం.
వ్యాపారంలో విజయవంతంగా దూసుకుపోతున్న వీరు తండ్రి ప్రారంభించిన సామాజిక కార్యక్రమాల్నీ కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు, ఆసుపత్రులు నడుపుతున్నారు. సొంతంగా ప్రైవేట్‌ బ్యాంకున్న తొలి వ్యాపార సంస్థ హిందుజా గ్రూపే కావడం విశేషం. రూ.100కోట్లతో ప్రారంభించిన ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ని ఒక దిగ్గజ సంస్థగా మలిచారు. భారత్‌లో సంస్థకు చెందిన వ్యాపార లావాదేవీలన్నీ ఈ బ్యాంకు ద్వారానే జరుగుతుంటాయి. ఇక స్విట్జర్లాండ్‌లో స్థాపించిన హిందుజా బ్యాంక్‌ ఐరోపాలో కీలక బ్యాంకుగా ఎదిగింది. ప్రస్తుతం వాహన, ఐటీ, మీడియా, మౌలిక, చమురు, విద్యుత్తు, రియల్‌ ఎస్టేట్‌, హెల్త్‌కేర్‌, ఆర్థిక, బ్యాంకింగ్‌, రక్షణ, మైనింగ్‌ లాంటి తదితర రంగాల్లో హిందుజా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. 130కి పైగా దేశాల్లో లక్షా 50వేల మందికి ఉపాధి కల్పిస్తోంది.

లండన్‌లో అత్యంత వైభవంగా దీపావళి..

సంప్రదాయ హిందూ కుటుంబం నుంచి వచ్చిన హిందుజాలు భారతీయ ఆచారాలు, సంస్కృతికి అత్యంత విలువనిస్తారు. ఏటా లండన్‌లోని అలెగ్జాండ్రా రాజభవనంలో వీరు జరిపే దీపావళి ఉత్సవాలు స్థానికులకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తున్నాయి. లండన్‌లోని ప్రముఖులు, రాజకీయవేత్తలందరూ ఈ వేడుకకు హాజరవుతారు. గోపీచంద్‌ షష్టిపూర్తిని అత్యంత ఘనంగా నిర్వహించారు. గుజరాతీ సంప్రదాయం ప్రకారం వచ్చిన అతిథులందరికీ వెండి పళ్లేలు పంచారు. హిందుజా వారసుల వివాహాలు సైతం సంప్రదాయబద్ధంగా అంగరంగవైభంగా ముంబయిలో జరిగాయి.

ప్రపంచంలో మూడో అత్యంత ఖరీదైన భవనం వీరి సొంతం..

లండన్‌లో బ్రిటీష్‌ రాజకుటుంబానికి చెందిన అత్యంత ఖరీదైన, సౌకర్యవంతమైన కార్ల్‌టన్‌ హౌస్‌ని వీరు సొంతం చేసుకన్నారు. కింగ్‌ జార్జ్‌-IVకి చెందిన ఈ రాజసౌధం 67000 చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. 2013లో ఫోర్బ్స్‌ అధ్యయనం ప్రకారం 500మిలియన్‌ డాలర్లు విలువచేసే ఈ సౌధం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మూడో ప్రైవేట్‌ భవనం కావడం విశేషం. ఇది ఎలిజబెత్‌ రాణి నివసించే బకింగ్‌హామ్‌ రాజభవనానికి అతి సమీపంలో ఉంటుంది.

ఐకమత్యమే మహాబలం..
హిందుజా కుటుంబంలోని నాలుగోతరం వ్యాపారంలోకి ప్రవేశించే సమయం వచ్చేసింది. కానీ, ఇప్పటికీ ఈ
సోదరులు ఎలాంటి విభేదాలు లేకుండా కలసిమెలసి ఉంటున్నారు. సోదరుల్లో ఒకరు తీసుకొన్న నిర్ణయాన్ని మరొకరు తిరస్కరించరు. అయితే దాన్ని ఎలా అమలు చేయాలి, వచ్చే ఇబ్బందులేంటో సమగ్రంగా చర్చించి మార్పులు చేర్పులు మాత్రమే చేస్తారు. ఈ విషయాల్ని స్వయంగా గోపీచంద్‌, అశోక్‌ సోదరులు ఓ సందర్భంలో వెల్లడించారు. ఇప్పటికీ రోజులో కనీసం రెండు మూడు సార్లైనా సోదరులంతా ఫోన్‌లో సంభాషించుకుంటారు. వ్యాపార విశేషాలతో పాటు కుటుంబ బాగోగులపై చర్చిస్తారు.  తల్లిదండ్రులు నేర్పిన విలువలే నేటికీ తాము కలిసుండేలా చేస్తాయంటారు ఈ సోదరులు. ఏనాడూ డబ్బు ఆశించి వ్యాపారాలు చేయలేదట. భగవద్గీతలో చెప్పినట్లు మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకుంటూ పోతే ఫలితం దానంతట అదే వస్తుందనేది వీరి సిద్ధాంతం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.